ఏప్రిల్ 30, 2023న, హిమాలయలలోని ధౌలాధార్ శ్రేణిలోని ధర్మశాల పట్టణం తన మొదటి స్వాభిమాన యాత్రను నిర్వహించుకుంది.

‘ఈ ఇల్లు నీకు, నాకు, అతనికి, ఆమెకి, వారికి, వారి కోసం’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు పట్టుకుని, ప్రజలు (క్వీర్ కమ్యూనిటీ వ్యక్తులు, మద్దతుదారులు) ప్రధాన మార్కెట్ నుంచి ధర్మశాలలోని టిబెట్ ప్రజల స్థిరనివాసమైన మెక్‌లోడ్‌గంజ్‌లో ఉన్న దలైలామా ఆలయం వైపుకు నడిచారు. తర్వాత ఈ యాత్ర ధర్మశాల పట్టణంలో రద్దీగా ఉండే కొత్వాలీ బజార్‌ లో కొనసాగింది. ఇది LGBTQIA+ (ఎల్‌జిబిటిక్యుఐఎ+) సముదాయానికి మద్దతు తెలుపుతూ ధర్మశాలలో ఏర్పాటైన తొలి బహిరంగ సభ. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచీ, చిన్న పట్టణాలనుంచీ వచ్చిన అనేకమంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు

"మేం అజీబ్ (విలక్షణ) అనే పదాన్ని సగర్వంగా ఉపయోగిస్తున్నాం" అని హిమాచల్ క్వీర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, స్వాభిమాన యాత్ర నిర్వాహకుడు డాన్ హసర్ చెప్పారు. “Queernessని (విలక్షణతను) వివరించడానికి మేం ఆంగ్ల పదాలను వాడతాం. కానీ హిందీ, ప్రాంతీయ భాషల మాండలికాల సంగతేంటి? విలక్షణతను(Queerness), స్వేచ్ఛగా చరించడాన్ని (Fluidity) గురించి మాట్లాడటానికి మేం ప్రాంతీయ మాండలికాలలో పాటలనూ కథలనూ ఉపయోగిస్తాం," అని 30 ఏళ్ళ డాన్ వివరించారు.

"అతి తక్కువ సమయంలోనే దేశం నలుమూలల నుండి - దిల్లీ, చండీగఢ్, కొల్‌కతా, ముంబైలతో పాటు రాష్ట్రంలోని చిన్న పట్టణాల నుండి కూడా - దాదాపు 300 మంది జనం ఈ యాత్రలో పాల్గొనటానికి వచ్చారు. స్వాభిమాన యాత్రలో పాల్గొనటానికి సిమ్లా నుంచి వచ్చిన 20 ఏళ్ళ విశ్వవిద్యాలయ విద్యార్థి ఆయుష్, “ఇక్కడ (హిమాచల్ ప్రదేశ్‌లో) దీని (విలక్షణంగా ఉండటం) గురించి ఎవరూ మాట్లాడరు,” అన్నాడు. బడిలో ఉన్న సమయంలో ఆయుష్ బాత్‌రూమ్‌కి వెళ్లేందుకు ఇబ్బందిపడేవారు. “నా తరగతిలోని అబ్బాయిలు నన్ను ఆటపట్టించేవారు, వేధించేవారు. నేను ఆన్‌లైన్‌లో ఈ సముదాయాన్ని కనుక్కున్న తర్వాత ఎప్పటికంటే కూడా సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తులతో కలిసి ఉండే అవకాశం నాకు లభించింది." అంటూ ఆయుష్ వివరించారు..

ఒక ప్రొఫెసర్‌ను సలహాదారుగా తీసుకుని, కళాశాలలో బహిరంగ చర్చా కూటములను నిర్వహించి, ఈ విషయాలను చర్చలోకి తీసుకురావడానికి ఆయుష్ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు జెండర్, లైంగికత (sexuality)ల గురించి తెలుసుకోవడానికి వచ్చి, తమ సందేహాలను తీర్చుకోవడానికో, లేదా పంచుకోవడానికో ఉండిపోతారు.

PHOTO • Sweta Daga

ధర్మశాలలో ఏప్రిల్ 30, 2023న జరిగిన మొట్టమొదటి స్వాభిమాన యాత్రలో LGBTQIA+ సముదాయానికి మద్దతుగా ప్లకార్డ్‌ను పట్టుకున్న ఒక సభ్యులు

PHOTO • Sweta Daga

ఇక్కడ (హిమాచల్ ప్రదేశ్‌లో) దాని (విలక్షణంగా ఉండటం) గురించి ఎవరూ మాట్లాడరు' అని సిమ్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి ఆయుష్ చెప్పారు

కాఁగ్రా జిల్లా, పాలమ్‌పుర్ తహసీల్ లోని ఒక గ్రామానికి చెందిన శశాంక్ హిమాచల్ క్వీర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు. “నేను ఎప్పుడూ ఎక్కడా ఇమడలేని (misfit) వ్యక్తిని అనుకునేవాడ్ని. చివరకు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తులను - చాలామంది అవమానంగా లేదా తప్పుగా భావిస్తుంటారు - కలిశాను. నేను ఎవరినైనా కలుసుకోవడానికి (డేట్స్‌కి) వెళ్లినప్పుడు కూడా సంభాషణలన్నీ మేం ఎంతగా ఒటరితనాన్ని అనుభవిస్తున్నామనే దాని గురించే ఉండేవి," అని శశాంక్ చెప్పారు. ఆ అనుభవాలే 2020లో కేవలం ఇందుకోసమే అంకితమైన ఒక నంబర్‌తో, శశాంక్ ఒక క్రైసిస్ హెల్ప్‌లైన్‌ని ప్రారంభించేలా చేశాయి.

ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ శశాంక్, “గ్రామీణ ప్రాంతాలకు చెందిన విలక్షణ వ్యక్తుల గొంతులు ఎక్కడ వినిపిస్తున్నాయి?” అని ప్రశ్నించారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం 2019 , కింద అమలుచేయాల్సిన కొన్ని అంశాలు హిమాచల్ ప్రదేశ్‌లో అమలుకాకపోవటంతో, దీనిపై తాము సిమ్లా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు కూడా శశాంక్ తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది కలిసి హిమాచల్ క్వీర్ ఫౌండేషన్ (HQF) నిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. మెక్‌లోడ్‌గంజ్‌లో స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ర్యాలీకి అనుమతి సాధించడంతో మొదలుపెట్టి, “కేవలం రెండు వారాల్లో అన్నింటినీ ఒక దగ్గరకు తెచ్చాం,“ అన్నారు ఫౌండేషన్ సహవ్యవస్థాపకులు, కొల్‌కతాకు చెందిన డాన్.

తర్వాత హిమాచల్ క్వీర్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది, దీనికి మంచి స్పందన వచ్చింది. “స్వాభిమాన యాత్రలో నడవటానికి ధైర్యం కావాలి. మేం ఇక్కడ (చిన్న పట్టణాలలో) నుండి సంభాషణ మొదలు పెట్టాలనుకుంటున్నాం.” అని నిర్వహకుల్లో ఒకరైన మనీశ్ థాపా చెప్పారు.

ర్యాలీలో ప్రదర్శించిన ఒక ప్లకార్డు మీద 'కుల నిర్మూలన లేకుండా క్వీర్ విముక్తి లేదు. జై భీమ్!’ అని రాసి ఉన్నట్టుగా, తాము కులం, వర్గం, భూమి లేనితనం, దేశీయతా గుర్తింపు లేనితనంకు వ్యతిరేకంగా కూడా సంఘీభావం తెలియచేస్తూ కవాతు చేశామని డాన్ పేర్కొన్నారు.

PHOTO • Sweta Daga

క్వీర్ సముదాయానికి మద్దతును తెలపటంతో పాటు తాము కులం, వర్గం, భూమి లేనితనం, దేశీయతా గుర్తింపు లేనితనంకు వ్యతిరేకంగా కూడా సంఘీభావం తెలియచేస్తూ కవాతు చేశామని నిర్వాహకులు చెప్పారు

PHOTO • Sweta Daga

స్వాభిమాన యాత్ర నిర్వహించడానికి సహాయం చేసిన అనంత్ దయాళ్, సాన్యా జైన్, మనీశ్ థాపా, డాన్ హసర్, శశాంక్ (ఎడమ నుండి కుడికి)

ర్యాలీ జరిగిన ఆ ఆదివారం రోజున, స్వాభిమాన యాత్ర పట్టణంలోని వాణిజ్య ప్రాంతాల గుండా 1.2 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లోచుట్టివచ్చింది. ఈ కవాతులో పాల్గొన్నవారు నృత్యం చేయడానికీ, ఉపన్యాసం ఇవ్వడం కోసం దారి పొడుగునా పదే పదే ఆగారు. ఈ కవాతు కోసం ఈ స్థలాన్నే ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు, “(మార్కెట్లో) దాదాపు 300 చిన్న దుకాణాలు ఉన్నాయి. ప్రజలకు కనిపించేలా ప్రధాన రహదారులపై కవాతు చేయడం మాకు చాలా ముఖ్యం,” అని మనీశ్ థాపా చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ 2019 నుండి ఇప్పటి వరకూ కేవలం 17 ట్రాన్స్ గుర్తింపు కార్డులను మాత్రమే జారీ చేసిందని, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కోసం ఉన్న నేషనల్ పోర్టల్ తెలియజేస్తోంది.

"హిమాచల్‌లోని కాఁగ్రా జిల్లాలో ట్రాన్స్ గుర్తింపు కార్డును కలిగి ఉన్న మొదటి వ్యక్తిని నేనే," అన్నారు డాన్. "నేను దానిని పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక హక్కుల గురించి తెలియనివారి పరిస్థితి ఏమిటి? రాష్ట్రలో సంక్షేమ బోర్డు లేదు; షెల్టర్ హోమ్‌లు, సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయి? ప్రభుత్వ అధికారులకు ఎందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటంలేదు?" అని డాన్ ప్రశ్నించారు.

స్వాభిమాన యాత్రను చూస్తోన్న చాలామంది స్థానికులలో కూడా దాని గురించిన అవగాహన లేనట్లు కనిపించింది. కొత్వాలీ బజార్‌ లో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని ఎలక్ట్రానిక్స్, స్టేషనరీ వస్తువులను విక్రయిస్తోన్న ఆకాశ్ భరద్వాజ్ ఈ ర్యాలీని గమనిస్తున్నారు. "నేను దీన్ని మొదటిసారి చూస్తున్నాను. వాళ్ళేం చేస్తున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్ళు నృత్యం చేయడాన్ని చూడటం చాలా బాగుంది. నేను దాన్ని పట్టించుకోను,” అని అతను చెప్పారు

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఎడమ: స్వాభిమాన యాత్రకు హాజరైన టిబెట్‌కు చెందిన మొదటి ట్రాన్స్‌మహిళ, టెన్జిన్ మారికో. కుడి: భగత్ సింగ్ విగ్రహం, నేపథ్యంలో ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులు

56 ఏళ్లుగా ధర్మశాలలో నివసిస్తోన్న నవనీత్ కోఠివాలా నృత్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. "నేను దీన్ని చూడటం ఇదే మొదటిసారి, ఇలా చూడటం చాలా మంచిగా అనిపిస్తోంది," అని ఆయన చెప్పారు

అయితే ఆ ర్యాలీ ఎందుకో తెలుసుకున్నాక ఆయన తన మనసు మార్చుకున్నారు. "ఇది సరైనదని నేను అనుకోను, వారు దీని కోసం పోరాడకూడదు, ఎందుకంటే వారు అడిగేది అసహజమైంది. వారికి పిల్లలు ఎలా పుడతారు?" అన్నారతను.

"ఈ కవాతులో మారికో (టిబెట్‌లొ మొదటి ట్రాన్స్‌మహిళ) ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది," అన్నారు డాన్.

దలైలామా ఆలయానికి చేరుకుంటున్న కవాతును టిబెటన్ సన్యాసి శేరింగ్ చూస్తున్నారు. "వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అనేక ఇతర దేశాలు తమ ప్రజలకు ఈ హక్కులను (పెళ్ళి చేసుకోవడానికి) ఇచ్చాయి, బహుశా భారతదేశం కూడా ఆ బాటలో నడవటానికి ఇది సరైన సమయం," అన్నారాయన.

2018లో సెక్షన్ 377ని రద్దు చేసినప్పటికీ, స్వలింగ జంటలు వివాహం చేసుకోవడం మాత్రం చట్టబద్ధం కాదు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం కోసం దాఖలైన పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం ఈ నెలలో విచారణను ముగించింది, కానీ ఇంకా తీర్పు ఇవ్వలేదు.

ఈ కవాతు జరుగుతున్న సందర్భంగా నీలమ్ కపూర్ అనే మహిళా పోలీసు ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. "హక్కుల కోసం పోరాడటం మంచిదే. ప్రతి ఒక్కరూ తమ గురించి తామే ఆలోచించుకోవాలి,” అని ఆమె చెప్పారు. "ఇది ఎక్కడో ఒక చోట మొదలుకావాలి, కాబట్టి ఇక్కడే ఎందుకు కాకూడదు?"

PHOTO • Sweta Daga

ట్రాన్స్ హక్కుల ప్రతీక అయిన జెండాను ఎత్తిపట్టుకున్న నిర్వాహకుల్లో ఒకరైన అనంత్ దయాళ్

PHOTO • Sweta Daga

'మేం రెండు వారాల్లో ఏర్పాట్లన్నీ చేసేశాం,' అంటోన్న డాన్ హసర్ (తెల్ల చీరలో ఉన్నవారు)

PHOTO • Sweta Sundar Samantara

ప్రధాన మార్కెట్ నుండి ధర్మశాలలోని టిబెట్ ప్రజల స్థిరనివాసమైన మెక్‌లోడ్‌గంజ్‌లోని దలైలామా ఆలయం వైపు నడుస్తోన్న ప్రజలు

PHOTO • Sweta Daga

తర్వాత ఈ కవాతు ధర్మశాల పట్టణంలో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతమైన కొత్వాలీ బజార్ వరకు కొనసాగింది

PHOTO • Sweta Daga

ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న స్వాభిమాన యాత్రను చూస్తోన్న ప్రజలు. 'అందరూ చూసేలా ప్రధాన రహదారులపై ర్యాలీ చేయడం మాకు చాలా అవసరం' అని చెప్పారు నిర్వాహకుల్లో ఒకరైన మనీశ్ థాపా

PHOTO • Sweta Daga

స్వాభిమాన యాత్ర సందర్భంగా ప్రసంగిస్తోన్న మనీశ్ థాపా (మైక్‌తో)

PHOTO • Sweta Daga

నృత్యం చేయడానికి ఆగిన స్వాభిమాన యాత్ర సభ్యులు

PHOTO • Sweta Sundar Samantara

స్వాభిమాన యాత్ర 1.2 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేసింది

PHOTO • Sweta Daga

కవాతును చూస్తున్న బౌద్ధసన్యాసి శేరింగ్. 'వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అనేక ఇతర దేశాలు తమ ప్రజలకు ఈ హక్కులను (పెళ్ళి చేసుకోవడానికి) ఇచ్చాయి, బహుశా భారతదేశం కూడా ఆ బాటలో నడవటానికి ఇది సరైన సమయం,' అన్నారాయన

PHOTO • Sweta Daga

ట్రాఫిక్‌కు దిశానిర్దేశం చేస్తున్న మహిళా పోలీసు నీలమ్ కపూర్‌తో మాట్లాడుతున్న శశాంక్. 'హక్కుల కోసం పోరాడటం మంచిదే. ప్రతి ఒక్కరూ తమ గురించి తామే ఆలోచించుకోవాలి' అని నీలమ్ అన్నారు

PHOTO • Sweta Daga

హిమాచల్ క్వీర్ ఫౌండేషన్ (HQF) సహ వ్యవస్థాపకులు డాన్ హసర్ (నిలబడినవారు), శశాంక్ (కూర్చున్నవారు)

PHOTO • Sweta Daga

హిమాచల్ ప్రదేశ్‌లోని కాఁగ్రా జిల్లాలో ట్రాన్స్ గుర్తింపు కార్డు పొందిన మొదటి వ్యక్తి డాన్ హసర్. 'అది పొందడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ తమ హక్కులను ఎలా పొందాలో తెలియనివారి పరిస్థితి ఏమిటి?' అని డాన్ అడిగారు

PHOTO • Sweta Daga

కవాతు సందర్భంగా వంతెనపై ఎగురుతోన్న స్వాభిమాన పతాక

PHOTO • Sweta Daga

చాలా తక్కువ సమయంలోనే దేశం నలుమూలల నుండి - దిల్లీ, చండీగఢ్, కొల్‌కతా, ముంబైతో పాటు రాష్ట్రంలోని చిన్న పట్టణాల నుండి కూడా - ఈ కవాతులో పాల్గొనటానికి వచ్చిన 300 మంది జనం

PHOTO • Sweta Daga

క్వీర్ సముదాయానికి మద్దతుగా కవాతులో ప్రదర్శించిన కొన్ని పోస్టర్లు

PHOTO • Sweta Daga

కవాతులో పాల్గొన్న కొంతమందితో గ్రూప్ ఫొటో

అనువాదం: పి. పావని

Sweta Daga

Sweta Daga is a Bengaluru-based writer and photographer, and a 2015 PARI fellow. She works across multimedia platforms and writes on climate change, gender and social inequality.

Other stories by Sweta Daga
Editors : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editors : Sanviti Iyer

Sanviti Iyer is Assistant Editor at the People's Archive of Rural India. She also works with students to help them document and report issues on rural India.

Other stories by Sanviti Iyer
Photo Editor : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Translator : P. Pavani

P. Pavani is an independent journalist and a short story writer

Other stories by P. Pavani