“ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి రంగూ బరువూ కోల్పోతోంది. రంగు ఎంతగా వెలిసిపోతే, వ్యాపారులు అంత తక్కువ ధర ఇస్తారు,” ఆందోళనగా అన్నారు సందీప్ యాదవ్. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లాలోని గోగాఁవ్ తహసీల్‌ కు చెందిన ఒక పత్తి రైతు. అక్టోబర్ 2022లో పంట కోసినప్పటి నుండి సరుకు ధర పెరుగుతుందని ఆయన ఎదురుచూస్తున్నారు

మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద పత్తిని ఉత్పత్తి చేసే జిల్లాల్లో ఒకటైన ఖర్‌గోన్‌లో 2.15 లక్షల హెక్టార్ల భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ పంటను ఏటా మేలో విత్తుతారు, అక్టోబర్ నుండి డిసెంబర్ రెండవ వారం వరకు పత్తి ఏరటం సాగుతుంది. ఎనిమిది నెలల (అక్టోబర్-మే) కాలంలో ఖర్‌గోన్ పత్తి మండీ నుండి రోజుకు దాదాపు రూ.6 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేస్తారు. సందీప్ మధ్యప్రదేశ్‌లోని బహరామ్‌పురా గ్రామంలో తనకున్న 18 ఎకరాల పొలంలోని 10 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.

అక్టోబర్ 2022లో సందీప్, అప్పుడే చేతికివచ్చిన దాదాపు 30 క్వింటాళ్ల పత్తితో సంతోషంగా ఉన్నారు. ఇది అతని భూమిలో ఈ సీజన్లో మొదటిసారి ఏరగా వచ్చిన పత్తి. అతను రెండవ విడత ఏరినప్పుడు కూడా అంతే మొత్తంలో వస్తుందని అంచనా వేశారు, అలాగే 26 క్వింటాళ్ళు సాధించారు కూడా.

అయితే కొన్ని రోజుల తర్వాత సందీప్ ఖర్‌గోన్ పత్తి మండీ లో తన 30 క్వింటాళ్ళ పత్తిని అమ్మలేకపోయారు. వాస్తవానికి అక్టోబర్ 11, 2022 నుండి వ్యాపారులు సమ్మె చేస్తున్న కారణంగా మధ్యప్రదేశ్‌లోని అన్ని పత్తి మండీలు మూతపడ్డాయి. ప్రతి 100 రూ. వర్తకం మీద రూ. 1.70గా ఉన్న మండీ పన్నును తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ పన్ను దేశంలోనే అత్యధికం. ఈ సమ్మె ఎనిమిది రోజులు కొనసాగింది.

సమ్మెకు ఒకరోజు ముందు (అక్టోబర్ 10), ఖర్‌గోన్ పత్తి మండీ లో పత్తి ధర క్వింటాల్‌కు రూ. 8,740 ఉంది. అక్టోబర్ 19, 2022న సమ్మె ముగిసి మండీలు తిరిగి తెరిచేప్పటికి, ఈ ధర క్వింటాలుకు రూ. 890 పడిపోయి, రూ. 7,850 అయ్యింది. ధర పడిపోవటంతో అతను తన దిగుబడిని విక్రయించలేదు. "ఇప్పుడు నా పంటను అమ్మితే, నాకు ఎటువంటి లాభం ఉండదు," అని 34 ఏళ్ళ ఈ రైతు అక్టోబర్ 2022లో తనను కలిసిన PARIతో చెప్పారు.

PHOTO • Shishir Agrawal
PHOTO • Shishir Agrawal

ఖర్‌గోన్ జిల్లా, నవల్‌పురా గ్రామానికి చెందిన పత్తి రైతు సంజయ్ యాదవ్ (ఎడమ). అక్టోబర్-మే నెలల మధ్యకాలంలో ఖర్‌గోన్ పత్తి మండీ (కుడి) నుండి రోజుకు దాదాపు రూ.6 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేస్తారు

సందీప్ తన పత్తి దిగుబడిని నిల్వ చేసుకోవాల్సి రావడం ఇదే మొదటిసారి కాదు. కోవిడ్ సమయంలో మండీలు మూతపడ్డాయని, "(2021లో), కీటకాలు సోకి సగానికిపైగా పంట నాశనమైంద"ని అతను చెప్పారు.

కాబట్టి, తన రూ.15 లక్షల అప్పును ఈ 2022లో వచ్చిన దిగుబడి తీర్చేస్తుందని ఆయన ఆశించారు. కానీ "ఈ సంవత్సరం (2022) అప్పు వాయిదాలు చెల్లించిన తర్వాత ఏమీ మిగలదు," అని ఆయన చెప్పారు

రైతు పోర్టల్ డేటా ప్రకారం, 2022-2023లో పత్తికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పి) క్వింటాలుకు రూ. 6,380. ఇది 2021-2022 సంవత్సరపు రేటు కంటే రూ. 355 ఎక్కువ. “ఈ కనీస మద్దతు ధర కనీసం రూ. 8,500 ఉండాలి” అని భారతీయ కిసాన్ సంఘ్, ఇండోర్ విభాగం అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పంవార్ చెప్పారు."వ్యాపారులు ఈ స్లాబ్ కంటే తక్కువకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలి." అని ఆయన అన్నారు.

పత్తి ధర క్వింటాలుకు రూ. 7,405 అంటే చాలా తక్కువ అని బర్వాహ తహసీల్‌ లోని నవల్‌పురా గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్ అనే రైతు నమ్ముతున్నాడు. అతను ఖర్‌గోన్ మండీ లో తన మొత్తం దిగుబడిలో కొంత భాగాన్ని - 12 క్వింటాళ్లను మాత్రమే - అమ్మాడు. ప్రస్తుత ధర కంటే 2,595 ఎక్కువగా, అంటే క్వింటాల్‌కు కనీసం రూ. 10,000 ఉండాలని ఈ 20 ఏళ్ళ రైతు అభిప్రాయపడ్డాడు.

“మేం (రైతులు) దేన్నీ (కనీస మద్దతు ధర గురించి) నిర్ణయించలేం. మేం పండించిన పంటకు అయ్యే ఖర్చు కూడా మా చేతుల్లో ఉండదు," అని సందీప్ పేర్కొన్నారు.

“విత్తనాలు, ఎకరాకు 1,400 రూపాయలు ఖరీదు చేసే డిఎపి (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువుల వంటి ప్రాథమిక ఖర్చులు కాకుండా రోజు కూలీలకు రోజుకు 1,500 రూపాయలు. ఇక, గొంగళి పురుగులను చంపడానికి మూడుసార్లు పిచికారీ (పురుగు మందులను) చేస్తే అందుకు 1,000 రూపాయలు అవుతాయి. ఈ ఖర్చులన్నీ కలిపితే, నాకు ఒక ఎకరానికి 15,000 రూపాయలు కావాలి.” అన్నారు సందీప్.

PHOTO • Shishir Agrawal
PHOTO • Shishir Agrawal

ఎడమ: పత్తి సాగు ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్న సబదా గ్రామానికి చెందిన రైతు రాధేశ్యామ్ పటేల్. కుడి: వ్యాపారుల సమ్మె ముగిశాక పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరాశతో ఉన్న మండీ రైతులు

PHOTO • Shishir Agrawal
PHOTO • Shishir Agrawal

ఎడమ: బహరామ్‌పుర గ్రామ పత్తి రైతు సందీప్ యాదవ్ (ఎద్దుల బండిపై కూర్చున్నవారు). కుడి: అతను రూ.9 లక్షలు అప్పుచేసి కడుతోన్న కొత్త ఇల్లు

అక్టోబర్ 2022లో సందీప్ తన పొలంలో పత్తి ఏరిన కూలీలకు చెల్లించేందుకు రూ.30 వేలు అప్పుచేశారు. “దీపావళికి అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు. మనం డబ్బులిస్తే తప్ప వారు తమ ఖర్చులను భరించలేరు" అన్నారు సందీప్.

కొత్త ఇల్లు కట్టుకోవడానికి స్థానిక వడ్డీ వ్యాపారి ( షావుకారు ) నుండి కూడా సందీప్ రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ ప్రాంతంలో మంచి ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో, కోవిడ్ -19 కంటే ముందు, తన పిల్లలను ఆయన సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. అయితే, వారి వార్షిక రుసుము చెల్లించేందుకు ఆయన ఇబ్బందిపడ్డారు.

పత్తి సాగు ఖర్చుతో కూడుకున్నదని సబదా గ్రామానికి చెందిన రైతు రాధేశ్యామ్ పటేల్ ఒప్పుకున్నారు. “మేమిప్పుడు రబీ పంటను విత్తాలంటే (అక్టోబర్ 2022), దానికి కూడా మాకు డబ్బు కావాలి. అందుకు మేం వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వస్తుంది,” అని 47 ఏళ్ళ వయసున్న రాధేశ్యామ్ చెప్పారు. “తర్వాత (డబ్బు తీసుకున్న తర్వాత) పంట పండకపోతే, నష్టపోయేది రైతులే. అందుకే రైతు విషం తాగుతాడు, లేదంటే వడ్డీ ఊబిలో కూరుకుపోయి భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది." అన్నారాయన కొనసాగింపుగా.

“తన పంట ఎంత విలువైనదో ఒక్క రైతుకు మాత్రమే తెలుసు. ప్రభుత్వం కనీసం రైతు పంటకు కనీస మద్దతు ధర అందేలా చూడాలి," అని వ్యవసాయ నిపుణుడు దేవేంద్ర శర్మ అన్నారు.

జనవరి 2023 నాటికి, సందీప్ ఇంటి ఖర్చులు పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలో అతని తమ్ముడి పెళ్ళి జరిగింది. వారికి డబ్బులు అవసరం కావడంతో జనవరిలో సుమారు 30 క్వింటాళ్ల పత్తిని క్వింటాల్‌కు రూ.8,900 లెక్కన అమ్మినట్టుగా సందీప్ PARIతో చెప్పారు..

ఇది కాస్త మెరుగైన ధరే అయినప్పటికీ, తన ఖర్చులన్నీ పోగా ఇంకేమీ మిగలదని ఆయన చెప్పారు.

పత్తి ధర పట్ల నిరాశతో ఉన్న సందీప్, “రైతు మాట ఎక్కడా చెల్లదు” అన్నారు.

అనువాదం: పి. పావని

Shishir Agrawal

Shishir Agrawal is a reporter. He graduated in Journalism from Jamia Millia Islamia, Delhi.

Other stories by Shishir Agrawal
Editor : Devesh

Devesh is a poet, journalist, filmmaker and translator. He is the Translations Editor, Hindi, at the People’s Archive of Rural India.

Other stories by Devesh
Translator : P. Pavani

P. Pavani is an independent journalist and a short story writer

Other stories by P. Pavani