తన పొలంలో అడుగు పెట్టగానే నామ్‌దేవ్ తరాళే తన నడక వేగం తగ్గించారు. దాడి చేసినట్లుగా, తిన్నట్లుగా ఉన్న తన పెసర పంటను నిశితంగా పరిశీలించడానికి ఈ 48 ఏళ్ళ రైతు కిందకి వంగారు. ఫిబ్రవరి 2022లో, ఆహ్లాదకరమైన ఒక శీతాకాలపు ఉదయం అది; ఆకాశంలో సూర్యుడు మృదువుగా ఉన్నాడు.

హా ఏక్ ప్రకార్చా దుష్కాళచ్ ఆహే (ఇదొక కొత్త రకమైన కరువు),” గంభీరంగా అన్నారతను.

తరాళేలో నెలకొన్న నిరాశ, భయాలను ఈ వాక్యం ప్రతిబింబిస్తోంది. ఐదెకరాల పొలం ఉన్న ఈ రైతు మూడు నెలలుగా శ్రమించి, పండించి, కోతకు సిద్ధం చేసిన తూర్ (కంది), పెసర పంటలను నష్టపోతున్నానని ఆందోళన చెందుతున్నారు. పాతిక సంవత్సరాలుగా చేస్తున్నవ్యవసాయంలో, అతను వివిధ రకాల కరవులను చూశారు – వాతావరణం కారణంగా (వర్షాలు లేనప్పుడు లేదా అధికంగా కురిసినప్పుడు), జలసంబంధమైన కరవు (భూగర్భ జలాల పట్టిక ప్రమాదకర స్థాయికి పడిపోయినప్పుడు), లేదా వ్యవసాయ భూమిలో తేమ తగ్గి పంటలు విఫలమైనప్పుడు.

మంచి దిగుబడి వచ్చిందని మీరు అనుకున్నంతలోనే, ఈ విపత్తు ఒక్కోసారి నాలుగు కాళ్లపై వచ్చి పంటను దొంగిలిస్తుంది లేదా పొలం మీదుగా ఎగిరి వచ్చి మొత్తాన్ని చదును చేస్తుందని తరాళే ఉద్రేకానికి గురయ్యారు.

“నీటికోళ్ళు, కోతులు, కుందేళ్ళు పగటిపూట వస్తాయి; కృష్ణ జింకలు, మనుబోతులు (నీల్‌గాయ్), సాంబర్ జింకలు (Sambar), అడవి పందులు, పులులు రాత్రి వేళల్లో వస్తాయి,” అంటూ ముప్పుల చిట్టా విప్పారాయన.

అమ్హాలా పేరతా యెతే సాహెబ్, పణ్ వాచవతా యేత్ నాహీ ," (మాకు పంట ఎలా పండించాలో తెలుసు కానీ పంటను ఎలా కాపాడుకోవాలో తెలియదు),” అతని మాటల్లో ఓటమి భయం ప్రస్ఫుటమవుతోంది. సాధారణంగా, ఆయన పత్తి లేదా సోయాబీన్స్ వంటి వాణిజ్య పంటలు కాకుండా, పెసర, మొక్కజొన్న, జొన్నలు, కందులు వంటి పంటలు పండిస్తారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

చంద్రపూర్ జిల్లాలోని ధామణీ గ్రామానికి చెందిన నామ్‌దేవ్ తరాళే అడవి జంతువుల బెడదను కొత్త రకమైన కరవుతో పోల్చారు. అది నాలుగు కాళ్ళపై వచ్చి తన పంటను చదును చేస్తుందన్నారు

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: “రాత్రి పడుకున్నప్పుడు మరుసటి రోజు ఉదయం నా పంట కనిపించకపోవచ్చని ఆందోళన చెందుతున్నా”నని చప్రాళా గ్రామానికి చెందిన రైతు గోపాల్ బోండే అన్నారు. కుడి: రబీ పంటకు సిద్ధంగా ఉన్న తన పొలాన్ని పరిశీలిస్తున్న బోండే

అడవులు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని ధామణీ గ్రామంలో ఆందోళన చెందుతున్న రైతులు తరాళే ఒక్కరే కాదు. ఈ జిల్లాతో పాటు, తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (టిఎటిఆర్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో నివసించే అనేకమంది రైతులను నిరాశా నిస్పృహలు పట్టి పీడిస్తున్నాయి.

తరాళే పొలానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో చప్రాళా (2011 జనాభా లెక్కల ప్రకారం చిప్రాళా) గ్రామానికి చెందిన 40 ఏళ్ళ గోపాల్ బోండే కూడా ఇలాగే కలవరపడుతున్నారు. అది 2022, నడి ఫిబ్రవరి నెల. సగానికి సగం పెసర పంట వేసివున్న అతని విశాలమైన 10 ఎకరాల వ్యవసాయ భూమిలో నిశ్శబ్ద వినాశనాన్ని చూడవచ్చు. అక్కడక్కడా పంట నేలమట్టానికి నలిగిపోయి ఉంది – ఎవరో ప్రతీకారంతో దానిపై దొర్లినట్లు, మొక్కలను పీకినట్లు, పెసరకాయలను తిన్నట్లు, పొలాన్ని నాశనం చేసినట్లుగా ఉంది.

దాదాపు ఒక సంవత్సరం తర్వాత, జనవరి 2023లో మళ్ళీ మేం కలుసుకున్నప్పుడు, “రాత్రి పడుకునే సమయానికి, మరుసటి రోజు ఉదయం నా పంటను చూడలేనేమోనని దిగులుపడుతుంటాను,” అని బోండే అన్నారు. అందుకే అతను రాత్రిపూట కనీసం రెండుసార్లు – చలిగా ఉన్నా, వర్షం పడుతున్నా – తన బైక్‌పై పొలానికి వెళ్తుంటారు. దీర్ఘకాలం పాటు నిద్ర లేకపోవడం, చలి కారణంగా అతను తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. (వేసవిలో లాగా) పొలంలో పంట వేయనప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళరు. కానీ మిగిలిన సమయంలో, ముఖ్యంగా పంట చేతికొచ్చేటప్పుడు, ప్రతిరాత్రీ పొలంలో కాపలా కాస్తుంటానని, ఒక శీతాకాలపు ఉదయాన తన ఇంటి ముందు పెరట్లో ఉన్న కుర్చీలో కూర్చుంటూ తెలిపారాయన.

అడవి జంతువులు ఏడాది పొడవునా పొలాలపై దాడి చేసి పంటను తింటాయి – శీతాకాలంలో పొలాలు పచ్చగా ఉన్నప్పుడు; వర్షాకాలంలో కొత్త రెమ్మలు చిగురించినప్పుడు; వేసవిలో అవి నీటితో సహా పొలం మొత్తాన్నీ అవి చిందరవందర చేసేస్తాయి.

అందువల్ల, దాగి ఉండే అడవి జంతువులు ‘అత్యంత చురుకుగా తిరిగే రాత్రివేళల’ గురించి, అవి పంటను నాశనం చేస్తే కలిగే ‘రోజుకు కొన్ని వేల రూపాయల’ ద్రవ్య నష్టం గురించి బోండే ముందుగా ఒక అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అడవి పిల్లులు అదను చూసి పశువులను చంపేస్తాయి. ఒక దశాబ్ద కాలంలో జరిగిన పులి-చిరుతపులి దాడులలో, ఆయన కనీసం రెండు డజన్ల ఆవులను కోల్పోయారు. ప్రతి సంవత్సరం, పులుల దాడిలో తమ గ్రామంలో సగటున 20 పశువులను కోల్పోతున్నామని ఆయన తెలిపారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, అడవి జంతువుల దాడిలో ప్రజలు గాయాల పాలవుతున్నారు లేదా మరణిస్తున్నారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఉత్తర సరిహద్దుల వెంబడి ఉన్న దట్టమైన అటవీ రహదారిలో అడవి పందులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఈ ప్రాంత రైతులకు ముప్పుగా మారాయి

మహారాష్ట్రలోని అతిపెద్ద, పురాతనమైన జాతీయ ఉద్యానవనాలు-వన్యప్రాణుల అభయారణ్యాలలో టిఎటిఆర్ ఒకటి. ఇది తాడోబా జాతీయ ఉద్యానవనం, దానికి ఆనుకుని ఉన్న అంధారి వన్యప్రాణుల అభయారణ్యాలను కలుపుతూ, చంద్రపూర్ జిల్లాలోని మూడు తహసీల్‌లలో 1,727 చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం మానవ-జంతు సంఘర్షణ కేంద్రంగా మారింది. NTCA 2022 నివేదిక ప్రకారం, మధ్య భారతదేశ కొండప్రదేశాలలో భాగమైన  టిఎటిఆర్ లో, పులుల సంఖ్య (2018లో నమోదైన) 1,033 నుండి 1,161కి పెరిగిందని అక్కడ తీసిన ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది.

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఇచ్చిన 2018 నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 315 పైగా ఉన్న పులులలో, 82 పులులు తాడోబాలో ఉన్నాయి.

ఈ ప్రదేశం నుండి విదర్భ వరకు పదుల సంఖ్యలో ఉన్న గ్రామాలలో నివసించే (వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేని) తరాళే, బోండే లాంటి రైతులు అడవి జంతువులను తప్పించుకోవడానికి విచిత్రమైన ఉపాయాలను ప్రయత్నిస్తుంటారు. వారు ముట్టుకుంటే షాక్‌కొట్టే సౌర బ్యాటరీతో నడిచే కంచెలను నిర్మిస్తారు; అలాగే, చౌకైన రంగురంగుల నైలాన్ చీరలను తమ పొలాల చుట్టూ, అడవి అంచుల వరకూ కడతారు; పటాకులు పేలుస్తారు; కుక్కల మందలను పెంచుతారు; చైనా తయారీ పరికరాల ద్వారా రకరకాల జంతువుల అరుపులను వినిపిస్తారు.

కానీ ఏదీ పనిచేయదు!

బోండే నివసించే చప్రాళా, తరాలే నివసించే ధామణీ గ్రామాలు TATR బఫర్ జోన్‌ సమీపంలో ఉన్నాయి. ఇది ఆకురాల్చే అడవి; భారతదేశపు ముఖ్యమైన రక్షిత పులుల ప్రాంతాలలో ఒకటి; పర్యాటక కేంద్రం. రక్షిత అడవి ప్రధాన ప్రాంతానికి సమీపంలో ఉండడంతో, అడవి జంతువుల దాడుల వల్ల రైతులు తరచుగా ఇబ్బందులు పడుతున్నారు. బఫర్ జోన్‌లో రక్షిత అటవీ కేంద్రానికి దగ్గరగా మానవ నివాసాలు ఉంటాయి. రక్షిత అటవీ కేంద్రంలో మానవ కార్యకలాపాలకు అనుమతి లేదు. దాని నిర్వహణ పూర్తిగా రాష్ట్ర అటవీ శాఖ ఆధీనంలో ఉంటుంది.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: అడవి జంతువులు తినేస్తున్న ధామణీ గ్రామంలోని జొన్న, పెసర పంటల పొలాలు. కుడి: ఇక్కడ ఖోళ్‌దోడా గ్రామంలో, చీరలను ఉపయోగించి తన పొలానికి-అటవీ ప్రాంతానికి మధ్య సరిహద్దును గీసిన సన్నకారు రైతైన విఠోబా కాన్నాక

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: దాడిచేసే అడవి జంతువులను భయపెట్టడానికి మనుషుల, జంతువుల అరుపుల శబ్దాలను విడుదల చేసే, బ్యాటరీతో నడిచే అలారం పక్కన నిలబడిన మహదేవ్ ఉమ్రే (37). కుడి: అడవి పందులతో పోరాడగలిగేలా శిక్షణ పొందిన కుక్క, డామీ

చంద్రపూర్‌తో సహా 11 జిల్లాలున్న తూర్పు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారతదేశంలో మిగిలివున్న కొన్ని రక్షిత అడవులకు విదర్భ నిలయం; పులులు, మరెన్నో అడవి జంతువుల నివాసం. గ్రామీణ కుటుంబాలలో పెరుతున్న ఋణభారం, రైతుల ఆత్మహత్యలు కూడా ఈ ప్రాంతంలో అధిక స్థాయిలో ఉన్నాయి.

మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ మునగంటీవార్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, 2022లో చంద్రపూర్ జిల్లాలో పులులు, చిరుతలు 53 మంది ప్రాణాలుతీశాయి. గత రెండు దశాబ్దాలలో, రాష్ట్రంలో దాదాపు 2,000 మంది – ఎక్కువగా టిఎటిఆర్ ప్రాంతంలో – అడవి జంతువుల దాడులలో మరణించారు. ఈ దాడులు ప్రధానంగా పులులు, నల్ల ఎలుగుబంట్లు, అడవి పందులు చేసినవి. వీటిలో కనీసం 15-20 'సమస్యగా ఉన్న పులుల'ను - మానవులతో సంఘర్షణలో ఉన్నవి - కూడా చంపాల్సి వచ్చింది. చంద్రపూర్ జిల్లా పులులకు, మనుషులకు మధ్య ఘర్షణకు కేంద్రంగా మారిందని ఈ సంఖ్య రుజువు చేస్తోంది. అయితే, జంతువుల దాడిలో గాయపడినవారి అధికారిక గణాంకాలు మాత్రం అందుబాటులో లేవు.

వన్యప్రాణులను ఎదుర్కొనేది కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా వాటిని ఎదుర్కొంటారు.

“మేము భయం భయంగా పని చేస్తున్నాం,” నాగ్‌పూర్ జిల్లా బెల్లార్‌పార్ గ్రామానికి చెందిన యాబయ్యేళ్ళ పైబడిన ఆదివాసీ రైతు అర్చనాబాయి గాయక్వాడ్ అన్నారు. ఆమె తన పొలంలో చాలాసార్లు పులిని చూశారు. “సాధారణంగా, చుట్టుపక్కల పులి లేదా చిరుతపులి ఉన్నట్లు గుర్తించినట్లయితే, మేం పొలాలను వదిలి వెళ్ళిపోతాం,” అని ఆమె తెలిపారు.

*****

“మా పొలాల్లో ప్లాస్టిక్‌ను పండించినా అవి (అడవి జంతువులు) తింటాయి!”

గోండియా, బుల్‌ఢాణా, భండారా, నాగ్‌పూర్, వర్ధా, వాశిమ్, ఇంకా యవత్మాళ్ జిల్లాల్లో రైతులతో మేం పైపైన జరిపిన సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. ఈ రోజుల్లో అడవి జంతువులు పచ్చి దూది కాయలను కూడా ఆరగిస్తున్నాయని విదర్భ ప్రాంతంలో పర్యటించిన ఈ విలేఖరికి వారు తెలిపారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: మధుకర్ ధోతరే, గులాబ్ రణ్‌ధాయీ, ప్రకాశ్ గాయక్వాడ్ (ఎడమ నుండి కుడికి కూర్చున్నవారు) నాగపూర్ జిల్లా బెల్లార్‌పార్ గ్రామంలో నివసించే మానా తెగకు చెందిన చిన్న, సన్నకారు రైతులు. అడవి పందులు, కోతులు, ఇతర జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండటానికి వీరు తమ రాత్రులను ఈ విధంగా గడపాలి. కుడి: చంద్రపూర్ జిల్లాకు చెందిన వాసుదేవ్ నారాయణ్ భోగేకర్ (50), అడవి జంతువుల వల్ల తీవ్ర పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు

“కోత సమయంలో మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ, పంటను కాపాడుకోవడానికి పగలూ-రాత్రీ పొలాల్లో కాపలా కాయడం తప్ప మేమేం చేయలేం,” ప్రకాశ్ గాయక్వాడ్ నిట్టూర్చారు. మానా సముదాయానికి చెందిన ఈ 50 ఏళ్ళ రైతు టిఎటిఆర్ ప్రాంతంలోని నాగ్‌పూర్ జిల్లా బెల్లార్‌పార్‌ అనే చిన్న గ్రామంలో ఉంటారు.

“మేం అనారోగ్యం పాలైనా, మా పొలాల్లోనే ఉంటూ మా పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే పంట మా చేతికి రాదు. ఒకప్పుడు నా పొలంలో ఎలాంటి భయం లేకుండా నిద్రపోయేవాడిని. ఇప్పుడలా కాదు; ప్రతిచోటా అడవి జంతువులు ఉన్నాయి,” గోపాల్ బోండే నివసించే చప్రాళా గ్రామానికే చెందిన 77 ఏళ్ళ దత్తూజీ తాజణే వివరించారు.

గత దశాబ్ద కాలంలో, తరాళే, బోండేలు తమ గ్రామాలలో కాలువలు, బావులు, బోరుబావుల రూపంలో నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి అవడాన్ని చూశారు. దీనివల్ల సంప్రదాయంగా పండించే పత్తి లేదా సోయాబీన్స్‌తో పాటు, ఏడాది పొడవునా 2-3 పంటలను సాగు చేయడానికి ఈ రైతులకు వీలు కలిగింది.

కానీ ఇక్కడొక ప్రతికూలత స్పష్టంగా కనబడుతుంది: పచ్చని పొలాలు, ఏపుగా పెరిగిన పంటలను చూసి కృష్ణ జింకలు, మనుబోతులు, సాంబర్ల వంటి శాకాహార జంతువులు మేత కోసం వస్తాయి. ఈ శాకాహార జంతువులను వేటాడడం కోసం మాంసాహార జంతువులు కూడా అక్కడక్కడే దాగి ఉంటాయి.

“ఒకసారి నేను ఒకవైపు కోతుల వల్ల, మరోవైపు అడవి పందుల వల్ల ఇబ్బంది పడ్డాను. అవి నా సహనాన్ని పరీక్షించాలని నిర్ణయించుకొని, నన్ను ఆటపట్టించినట్లు అనిపించింది,” తరాళే గుర్తుచేసుకున్నారు.

సెప్టెంబరు 2022లో, ఆకాశం మబ్బులు కమ్మి ఉన్నరోజున, సోయాబీన్స్, పత్తి , ఇతర పంటలు మొలకెత్తుతున్న తన పొలాన్ని మాకు చూపించడానికి, ఒక వెదురు కర్రను తీసుకొని బోండే బయలుదేరారు. ఇంటి నుండి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది అతని పొలం. 15 నిమిషాల నడక. ఆ పక్కనే దట్టంగా పెరిగిన చెట్లతో నిశ్శబ్దంగా ఉన్న అడవి నుండి అతని పొలాన్ని వేరు చేస్తూ ఒక వాగు ప్రవహిస్తోంది.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

గోపాల్ బోండే పొలంలో కుందేళ్ళు, అడవి పందులు, కృష్ణ జింకల వంటి వన్యప్రాణులు సంచరించిన కాలి గుర్తులు ఉన్నాయి

పొలమంతా తిరుగుతూ, ఆ తేమగా ఉన్న నల్ల రేగడి నేలపై కుందేళ్ళతో సహా దాదాపు డజను అడవి జంతువుల కాలి గుర్తులను మాకు చూపించారతను. అవి పంటలను తిని, సోయాబీన్‌ మొక్కలను పీకి, పచ్చని రెమ్మలను పెకిలించి, అక్కడే మలవిసర్జన చేశాయి.

ఆతా కా కర్తా, సాంగా? (ఇప్పుడు చెప్పు ఏం చేయాలో?),” అంటూ బోండే నిట్టూర్చారు.

*****

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రాజెక్ట్ టైగర్” కార్యక్రమంలో భాగంగా, తాడోబా అడవులు పులుల సంరక్షణకు ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ, గత కొంత కాలంగా ఈ ప్రాంతం హైవేలు, నీటిపారుదల కాలువలు, కొత్త గనులు లాంటి ఎడతెగని అభివృద్ధిని చూసింది. ఇది రక్షిత అటవీ ప్రాంతాలుగా విభజించబడి, ప్రజలను నిర్వాసితులను చేసి, అటవీ పర్యావరణానికి భంగం కలిగిస్తోంది.

గతంలో పులులు తిరిగే భూభాగాన్ని మైనింగ్ కార్యకలాపాలు ఆక్రమించాయి. చంద్రపూర్ జిల్లాలో, 30కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బొగ్గు గనులలో, దాదాపు రెండు డజన్ల గనులు గత రెండు దశాబ్దాలలో దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి.

“బొగ్గు గనుల దగ్గర, అలాగే చంద్రపూర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (CSTPS) ఆవరణలో పులులు కనిపించాయి. ఈ ప్రాంతాలు మానవ-జంతు సంఘర్షణకు తాజా కేంద్రాలుగా మారాయి. మనం వాటి ఆవాసాలలోకి చొరబడ్డాం కదా,” పర్యావరణ కార్యకర్త-పరిరక్షకుడైన బండూ ధోత్రే అన్నారు. పులుల సంఖ్యపై సమర్పించిన ఎన్‌టిసిఎ 2022 నివేదిక ప్రకారం, మధ్య భారతదేశ కొండప్రదేశాలలో అధికంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలు పులుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన సవాలుగా మారాయి.

టిఎటిఆర్ అనేది మధ్య భారతదేశంలోని విశాలమైన అటవీ భూభాగంలోని ఒక భాగం. పొరుగు జిల్లాలైన యవత్మాళ్, నాగ్‌పూర్, భండారాలోని అటవీ ప్రాంతాలు ఈ ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్నాయి. “ఇక్కడే మనుషులు, పులుల మధ్య ఉన్న సంఘర్షణ అధికంగా కనబడుతుందని” ఎన్‌టిసిఎ 2018 నివేదిక తెలిపింది.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ధామణీ గ్రామానికి చెందిన మేఘరాజ్ లాడ్కే అనే రైతుతో నామ్‌దేవ్ తరాళే (కుడి). లాడ్కే(41), తన పొలంలో అడవి పందిని ఎదుర్కొన్నప్పటి నుండి రాత్రుళ్ళు కాపలా కాయడం మానేశారు. కుడి: మోర్వా గ్రామ రైతులు తమ పొలాలను పరిశీలించి, పులులు, కృష్ణ జింకలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, మనుబోతులు, సాంబర్‌ల వల్ల జరుగుతున్న నష్టాల గురించి చర్చించారు

“రైతులకు, రాష్ట్ర పరిరక్షణ అవసరాలకు, భారీ జాతీయ ఆర్థిక పరిణామాలు కలిగి ఉన్న సమస్య ఇది,” వన్యప్రాణి జీవశాస్త్రవేత్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)- పుణే మాజీ ప్రొఫెసర్ డాక్టర్ మిలింద్ వాట్వే తెలిపారు.

రక్షిత అడవులను, వన్యప్రాణులను చట్టాలు పరిరక్షిస్తున్నప్పటికీ, పశువుల ప్రాణనష్టం, పంట నష్టం వంటి సమస్యలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అడవి జంతువుల వల్ల కలిగే పంట నష్టం రైతులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇది పరిరక్షణా కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఉత్పాదకత లేని, లేదా సంతానోత్పత్తికి అనుకూలం కాని జంతువులను చంపడం, లేదా వాటిని మంద నుండి వేరు చేసే పద్ధతిని కూడా చట్టాలు నిరోధిస్తున్నాయని వాట్వే వివరించారు.

2015-2018 మధ్య, టిఎటిఆర్ చుట్టూ ఉన్న ఐదు గ్రామాలలో సుమారు 75 మంది రైతులతో ఒక క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించారు వాట్వే. విదర్భ డెవలప్‌మెంట్ బోర్డ్ సమకూర్చిన నిధుల ద్వారా చేపట్టిన ఈ అధ్యయనంలో భాగంగా, జంతువుల దాడుల కారణంగా ఒక ఏడాది కాలంలో ఎదుర్కొన్న సమగ్ర ఆర్ధిక నష్టాలను రైతులు సమష్టిగా నివేదించడానికి ఒక వ్యవస్థను రూపొందించారు. పంట నష్టాలు, ఆర్థిక నష్టాలు 50-100 శాతం మధ్య, లేదా ఒక ఏడాదిలో ఎకరానికి రూ.25,000-100,000 (పంటను బట్టి) ఉన్నట్లు ఆయన అంచనా వేశారు.

పరిహారం చెల్లించకపోతే, చాలా మంది రైతులు కొన్ని పంటలకే పరిమితవుతారు లేదా తమ పొలాలను బంజరుగా వదిలివేస్తారు.

వన్యప్రాణుల దాడిలో పశువులు లేదా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర అటవీశాఖ రూ. 80 కోట్ల వార్షిక పరిహారం అందిస్తోందని మార్చి 2022లో అప్పటి ఫారెస్ట్ ఫోర్స్ హెడ్, మహారాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సునీల్ లిమాయే PARIకి చెప్పారు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

విఠల్ బద్‌ఖల్ (మధ్య)తో కలిసి గోపాల్ భోండే (కుడి) ఈ సమస్యపై రైతులను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2022లో అడవి జంతువులు తన పొలాన్ని దెబ్బతీయడంతో, భోండే దాదాపు 25 సార్లు నష్టపరిహారం కోసం దావా వేశారు. అయితే, ఆ ప్రక్రియ గజిబిజిగా ఉండడంతో, రైతులు సాధారణంగా పరిహారం క్లెయిమ్ చేయరని బద్‌ఖల్ చెప్పారు

“ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నగదు పరిహారం ఏ మాత్రం సరిపోదు. సాధారణంగా రైతులు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయరు. ఎందుకంటే, ఈ ప్రక్రియ గజిబిజిగా, సాంకేతికపరంగా అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉంటుంది,” భద్రావతి తాలూకా లో ఈ సమస్యపై రైతులను సమీకరిస్తున్న విఠల్ బద్‌ఖల్ వివరించారు.

కొన్ని నెలల క్రితం, ఒక ఆవుతో సహా మరిన్ని పశువులను కోల్పోయారు బోండే. 2022లో, అతను దాదాపు 25 సార్లు నష్టపరిహారం కోసం దావా వేశారు. వేసిన ప్రతిసారీ అతను ఒక దరఖాస్తును నింపి, స్థానిక అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు తెలియజేసి, తప్పనిసరిగా జరిగిన ప్రదేశంలో చేయించవలసిన పంచనామా (తనిఖీ) చేసేలా స్థానిక అధికారులను ఒప్పించి, తన ఖర్చుల లెక్కలను రాసుకుంటూ, తన నష్టపరిహారం దావా ఎంతవరకు వచ్చిందని కనుక్కోవడం లాంటివన్నీ చేయవలసి వచ్చింది. ఇదంతా తనకి పరిహారమేదైనా అందడానికి కొన్ని నెలల ముందే చేసేదని ఆయన తెలిపారు. “అయితే, ఆ మొత్తం నా నష్టాలన్నిటినీ పూడ్చదు.”

డిసెంబర్ 2022లో, ఒక శీతాకాలపు ఉదయాన, బోండే మమ్మల్ని మరోసారి తన పొలానికి తీసుకువెళ్ళారు – తాను కొత్తగా నాటిన పెసర మొక్కలను చూపించడానికి. అయితే అప్పటికే అడవి పందులు లేత రెమ్మలను నమిలేశాయి. దాంతో, పంట ఏమవుతుందోనన్న అనిశ్చితి ఆయనలో నెలకొంది.

తదుపరి నెలల్లో, జింకల మంద దాడి చేసి నష్టపరచిన కొంత పంట మినహా, చాలా వరకు తన పంటను రక్షించుకోగలిగారు

జంతువులకు ఆహారం కావాలి. బోండే, తరాళే తదితర రైతుల కుటుంబాలకు కూడా. ఇందరి అవసరాలు ఆ పొలాల్లోనే తీరుతాయి!

అనువాదం: వై. కృష్ణ జ్యోతి

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Editor : Urvashi Sarkar

Urvashi Sarkar is an independent journalist and a 2016 PARI Fellow.

Other stories by Urvashi Sarkar
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi