సమీరుద్దీన్ షేక్ రోజుకి రెండుసార్లు తన సైకిల్‌ని జనాలతో క్రిక్కిరిసిపోయి ఉండే పాత నగరపు సందుగొందుల గుండా పోనిస్తుంటారు. తన ఇల్లు ఉన్న జుహాపురా లోని ఫతేహ్‌వాడి నుంచి తాను పనిచేసే తాజ్ ఎన్వలప్స్ వరకు ఉన్న పదమూడు కిలోమీటర్ల దూరం రావడానికీ పోవడానికీ ఒక్కో వేపుకు గంట సమయం పడుతుందాయనకు. బైక్ హై పర్ నహీ లే జాతా, క్యోంకి పెట్రోల్ నహీ పోసాతా (నా దగ్గరున్న బైక్‌ను నేను తీసుకువెళ్ళను. పెట్రోల్ ఖర్చును భరించే స్తోమత నాకు లేదు)," అంటారు ముప్పైఆరేళ్ల షేక్, తన సైకిల్‌కి స్టాండ్ వేస్తూ.

షేక్ పని రోజులన్నీ ఖరియా అని పిలిచే ప్రాంతంలో ఒక వాణిజ్య సముదాయం బేస్‌మెంట్‌లో ఉండే 10x20 అడుగుల కొలతలున్న గదిలో మొదలై అక్కడే ముగుస్తాయి. తనవంటి మరో పదిమందితో కలిసి సంచికవర్లు తయారుచేయడం ఆయన పని. ఒక్క రోజులో ఆరు నుంచి ఏడు వేల సంచికవర్లు తయారుచేయగలిగిన నేర్పరితనం అతనిది.

సంచికవర్లను తయారు చేయడం కనపడేంత సునాయాసమైన పనేం కాదు. "సంచికవర్ల తయారీలో నైపుణ్యం సంపాదించడానికి సంవత్సరంన్నర నుంచి రెండేళ్ళ వరకూ పడుతుంది," అంటారు సమీరుద్దీన్. " ఉస్తాద్ (పనిలో నైపుణ్యమున్న సీనియర్, గురువు) నీ పని నాణ్యతను మెచ్చి, అనుమతిస్తే గాని నువ్వు సొంతంగా సంచికవర్లు తయారుచేయలేవు. అప్పటికిగాని సొంతంగా డబ్బులూ సంపాదించలేవు." అని వివరిస్తారాయన.

ఈ పనిలో నాణ్యత అంటే వేగం, నిర్దిష్టత, నేర్పు, పనిముట్లపై ఉన్న పట్టు- వీటన్నిటి కలబోత. కత్తిరించడం, రంధ్రాలు చేయటం - యంత్రాలు చేసే ఈ రెండు పనులు మినహా, మిగతా పనులన్నీ చేతులతో చేసేవే.

యంత్రాలన్నీ దుకాణాల యజమానులే వాడతారు; పెద్దపెద్ద కాగితపు షీట్లని తీసుకొచ్చి ముందే నిర్ణయించిన కొలతల్లోకి  కత్తిరించి, అపుడు ఒక ప్రత్యేకమైన అచ్చులో ఉంచి వివిధ కొలతలతో సంచికవర్లను తయారుచేస్తారు. పనివాళ్ళు ఒక్కో తడవకు వందేసి కాగితాలను లెక్కపెట్టి వాటిని మడతపెట్టడం, అంటించడం, ముద్రవేయడం, ఆఖరికి అన్నిటిని కట్టలుకట్టడం వరకు చేస్తారు.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

ఎడమ: పాత నగరం నుంచి ఖరియాలోని తాజ్ ఎన్వలప్స్ వరకు సైకిల్ మీద వెళ్తోన్న సమీరుద్దీన్ షేక్. కుడి: ఒక వాణిజ్య సముదాయానికి చెందిన బేస్‌మెంట్‌లో ఉన్న తాజ్ ఎన్వలప్స్ వర్క్‌షాప్‌లో నేలపై కూర్చొని పనిచేస్తోన్న కార్మికులు

ఈ ప్రక్రియనంతా అత్యంత జాగ్రత్తగా చేయవలిసి ఉంటుంది. సంచికవరులోని ప్రతి భాగానికి నిర్దిష్టమైన పేరు ఉంటుంది - అన్నిటికంటే పై భాగాన ఉన్నది మాథు , కింది భాగాన్ని పేంది , జిగురు పూత పూసే భాగాన్ని ఢాపా , జిగురు పూతపూసిన భాగంపై పక్కనుంచి అతికించే భాగాన్ని ఖోలా అంటారు. అలాగే ఈ ప్రక్రియలోని ప్రతి దశకి నిర్దిస్టమైన పేర్లు ఉన్నాయి; వాటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వాడే పనిముట్లని కూడా వాటి గురించి తెలుసుకొని, జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. లేదంటే పెద్దపెద్ద గాయాలే అవ్వొచ్చు కూడా.

రెండు పక్కలా ఉండే రెక్కలని మడిచిన తర్వాత కార్మికులు ముందుగా తమ పిడికిళ్ళను ఉపయోగించి గట్టిగా వత్తిపెట్టి, ఆపైన కాగితం చక్కగా మడతపడటానికి పత్తర్ (రాయి)ను ఉపయోగిస్తారు. ఈ 'మడతలు నిలిచేలా చేసే రాయి'ని ఇంతకుమునుపు రుబ్బురాయి నుంచి తీసేవారు. కానీ ఇపుడు ఒక బరువైన ఇనుప పలక నుంచి తీసుకుంటున్నారు. "నేనీ పద్ధతిని నేర్చుకునే సమయంలో ఓసారి ఈ పత్తర్‌ తో నా వేలుని కొట్టుకున్నాను. వేలు చితికి రక్తం దగ్గరగా ఉన్న గోడపైకి చిమ్మింది. అది చూసి, నేర్పుగలిగిన పనివాడిగా తయారవ్వాలంటే, కండ బలం ఉపయోగించడంకన్నా పనిచేయటంలోని కిటుకులని లోతుగా నేర్చుకోవాలన్నారు మా ఉస్తాద్ ," అన్నారు 51 ఏళ్ళ వయసున్న అబ్దుల్ ముత్తాలిబ్ అన్సారి.

ఆ 'రాయి' సుమారు కిలోగ్రాము బరువుంటుంది. "ఒక సంచికవరు తయారుచేయడానికి దాన్ని నాలుగైదుసార్లు వాడాల్సి ఉంటుంది," అని వివరిస్తారు అబ్దుల్ ముత్తాబిల్ అన్సారీ. "కాగితపు మందంని బట్టి పనిలోని కిటుకులు మారాలి. పత్తర్‌ ని ఎంత ఎత్తున లేపి కొట్టాలి, ఎంత గట్టిగా కొట్టాలి, ఎన్నిసార్లు కొట్టాలి- ఇవన్నీ చేస్తుంటేనే ఒంటబట్టే పనులు," అంటారు యాభై రెండేళ్ల అబ్దుల్ గఫార్ అన్సారీ. "ఈ ప్రక్రియలో ఒక్కో సంచికవరు పదహారు నుంచి పదిహేడుసార్లు మా మధ్య చేతులు మారుతుంది. రోజూ చేసే ఈ పనిలో మా వేళ్ళు తెగిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. అంటించడానికి వాడే జిగురు కనుక తెగిన వేళ్ళకు అంటితే, తాళలేని మంట పుడుతుంది." అంటారాయన.

సంచికవర్ల తయారీదారుడైన అరవైనాలుగేళ్ల ముస్తంసిర్ ఉజ్జయినీ, తన తెగిన వేళ్ళకు వేడి కోకమ్ నూనెను  రాసుకుంటుంటానని చెప్పారు. ఇంకొందరు ఉపశమనాని కోసం వేజలైన్ లేదా కొబ్బరి నూనె వాడతారు. తాము వాడే కాగితం రకాన్నిబట్టి తయారీ విధానంలోని సవాళ్లు ఆదారపడి ఉంటాయి. "కొన్నిసార్లు కడక్ మాల్ (120 జిఎస్ఎమ్‌ల ఆర్ట్ పేపర్) వాడాల్సి వచ్చినపుడు మా చేతులు చాలా నొప్పెడతాయి. నొప్పి పుట్టినప్పుడు ఉపశమనం కోసం ఏడెనిమిది నిముషాలపాటు ఉప్పు కలిపిన వేడి నీళ్లలో వేళ్ళను ముంచుతాను," అని సోనాల్ ఎన్వలప్స్‌కు చెందిన మహమ్మద్ అసిఫ్ అంటారు. "వాతావరణం చల్లగా మారినప్పుడు కూడా మా చేతులు నొప్పెడుతాయి. అప్పుడు నేను కూడా ఉపశమనం కోసం వేడి నీళ్ళనే వాడతాను." అంటారు సమీరుద్దీన్ షేక్.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

ఎడమ: చక్కగా మడతపడటానికి ఢాపాపై 'రాయి'తో కొడుతోన్న సోనాల్ ఎన్వలప్స్‌కు చెందిన మహమ్మద్ ఆసిఫ్ షేక్. కుడి: నొప్పిచేసిన తన చేతులకు వెచ్చని కోకమ్ నూనెను రాసుకుంటోన్న ముస్తాంసిర్ ఉజ్జయినీ

ఈ ఉద్యోగంలో పనివాళ్ళు అదేపనిగా గంటల తరబడి నేలపై కూర్చోవాల్సి ఉంటుంది. "మేం పొద్దున్నే తొమ్మిదిన్నరకి పనిమీద కూర్చుంటే, మళ్ళీ ఒంటి గంటకు భోజనానికి లేస్తాం. సాయంత్రం పనైపోయి లేచే సమయానికి వీపంతా నొప్పి పుడుతుంది," అంటారు సమీరుద్దీన్. గంటలుగంటలు ఒకే స్థితిలో కూర్చొని పనిచేయడం వలన ఆయనకు చీలమండ వద్ద కాయలుకాచాయి. "ఈ పనిలో ఉన్న అందరూ ఎదుర్కొనే సమస్యే ఇది," బాసింపట్టు వేసుకుని నేలపైన కూర్చోవటం వల్లనే అలా జరుగుతోందని సూచిస్తూ అన్నారాయన. "నా కాళ్ళను రక్షించుకోవాలనుకుంటే, అప్పుడు నా వీపు తీవ్రంగా నొప్పెడుతుంది."

కోసుకుపోవటం, కాలటం, పోట్లు, నొప్పులతో పాటు ఈ పనిలో వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రమే. ముప్పైమూడేళ్ల మొహసిన్ ఖాన్ పఠాన్ ఆందోళన కూడా ఇదే. "నా కుటుంబమంతా నా ఒక్కడి సంపాదన మీదే ఆధారపడి ఉంది. ఇంటి అద్దె ఆరువేల రూపాయలు. నాకు రోజువారీ చాయ్, చిరుతిళ్ళకు యాభై రూపాయలు, బస్సు, ఆటో ఖర్చులకు అరవై రూపాయలు ఖర్చవుతాయి." ఇతని నాలుగేళ్ళ వయసున్న కూతురు ఈమధ్యనే ఇంగ్లిష్ మీడియం బడిలో చేరింది. "ఫీజు ఏడాదికి పది వేల రూపాయలు," అంటూ పఠాన్ వాపోయారు, ఒకవైపు సంచికవర్లను తయారుచేస్తూనే.

సమీరుద్దీన్ కుటుంబంలో - అతని భార్య, ముగ్గురు పిల్లలు, వృద్ధుడైన తండ్రి - ఆరుగురు ఉంటారు. "పిల్లలు పెరిగిపోతున్నారు. ఈ సంచికవర్ల తయారీ జీవనానికి సరిపోయేంత  డబ్బులివ్వదు. ఇల్లు గడుస్తుంది తప్ప డబ్బులు ఆదా చేసే వెసులుబాటు ఉండదు," అంటారు సమీరుద్దీన్. డబ్బులు సంపాదించే వేరే మార్గాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఒక ఆటోరిక్షా కొనుక్కుంటే కొంత మెరుగైన సంపాదన ఉండొచ్చనే ఆలోచనతో ఆటో లైసెన్సు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. "ఈ సంచికవర్ల తయారీలో వచ్చే డబ్బుల మీద కూడా ఆశలు పెట్టుకోలేం. పని ఉండని కొన్ని రోజుల్లో మధ్యాహ్నం రెండుమూడింటికే మా పనైపోతుంది. మేమంతా కమిషన్ మీద పనిచేసే రోజువారీ కూలీలం. ఇక్కడ స్థిరమైన జీతమంటూ ఉండదు." అన్నారాయన.

PHOTO • Umesh Solanki
PHOTO • Umesh Solanki

పనిచేస్తున్నంతసేపూ కార్మికులు ఒకే స్థితిలో కూర్చొనివుంటారు. ఒక్క కాలు మడుచుకొని అదే స్థితిలో కూర్చోవడం వలన కాయలుకాచిన చీలమండను చూపిస్తోన్న సమీరుద్దీన్ షేక్ (ఎడమ). నేల మీద కూర్చొని పనిచేస్తోన్న ముస్తంసిర్ ఉజ్జయిని(కుడి), మరో ఇద్దరు పనివాళ్ళు

1988లో ఒక ఎన్వలప్ వర్కర్ల యూనియన్ ఏర్పడింది. కొన్నిసార్లు చురుకుగా ఉంటూ, మరికొన్నిసార్లు మందకొడిగా ఉంటూ అది చివరికి లేకుండాపోయింది. అది ఎప్పుడు పోయిందో కార్మికులకు ఖచ్చితంగా తెలియదు, కానీ కొన్నేళ్ల తర్వాత వారిలో కొందరు ఆ సంస్థను పునరుద్ధరించారని వారు చెప్పారు. వర్క్‌షాప్ యజమానులతో కలిసి, ప్రతి కార్మికునికి వార్షిక పెంపుతో పాటు, ద్రవ్యోల్బణాన్ని అనుసరించి 10 శాతం హక్కు, బోనస్, వారి పనిని రోజులను బట్టి సెలవులు కల్పించాలని నిర్ణయించారు.

అహ్మదాబాద్‌లోని ఈ పరిశ్రమలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒకే ఒక్క మహిళ సంచికవర్లు తయారుచేస్తున్నారు.

తయారుచేసిన సంచికవరుల సంఖ్య, వాటి పరిమాణం, వాటి మందంపై ఆధారపడి వారానికోసారి వేతనాలను చెల్లిస్తారు. సాధారణ కాగితంతో తయారుచేసిన 1,000 సంచికవర్లకు  సుమారు రూ. 350, ఆర్ట్ కాగితంతో తయారుచేసిన వాటికి రూ. 489 చెల్లిస్తారు. ఒక కార్మికుడు కవరు రకం, వాటిని చేయడంలో ఆ కార్మికుని వేగం, వాటికి ఉన్న డిమాండ్‌, సీజన్‌లను బట్టి రోజుకు 2,000 నుండి 6,000 వరకు సంచికవరులను తయారుచేస్తారు.

11 x 5 అంగుళాల పరిమాణం, 100 జిఎస్ఎమ్ (చదరపు మీటరుకు గ్రాములు) బరువున్న ఒక ఆఫీస్ కవరును ఐదు రూపాయలకు ఒకటిగా విక్రయిస్తారు.

100 జిఎస్ఎమ్ నాణ్యత కలిగిన 1,000 సంచికవర్లకు కార్మికునికి చెల్లించే వేతనం దాదాపు రూ. 100. మరో మాటలో చెప్పాలంటే, అతను అమ్మకపు విలువలో యాభయ్యవ వంతును పొందుతున్నాడు

కార్మికుడు ఒక వంద రూపాయలు సంపాదించడానికి రెండు గంటలు పనిచేయాల్సివుంటుంది.

PHOTO • Umesh Solanki

యంత్రంలో కాగితాన్ని కత్తిరించే ముందు దీర్ఘచతురస్రాకారపు షీట్‌లపై అచ్చును అమర్చుతున్న తాజ్ ఎన్వలప్‌ల యజమాని ఎస్.కె. షేక్

PHOTO • Umesh Solanki

మడతపెట్టడానికి వీలుగా పంచింగ్ మెషీన్‌లో ఉంచిన అచ్చు పరిమాణం, రకాన్ని బట్టి కాగితాన్ని కత్తిరిస్తోన్న మక్బూల్ అహ్మద్ జమాలుద్దీన్ షేక్. ఈయన ఓమ్ ట్రేడర్స్‌లో పనిచేస్తుంటారు. చాలామంది వర్క్‌షాప్ యజమానులు కటింగ్, పంచింగ్ యంత్రాలను తామే స్వయంగా నిర్వహిస్తారు

PHOTO • Umesh Solanki

పంచింగ్ మెషీన్‌లలో ఉపయోగించే వివిధ ఆకారాల, పరిమాణాలలోని లోహపు అచ్చులు (వీటిని డై అని పిలుస్తారు)

PHOTO • Umesh Solanki

మడతపెట్టడానికి, కాగితపు షీట్‌లను కత్తిరించి ఒక్కొక్క దానిలో 100 ముక్కలు ఉండేలా సిద్ధంచేస్తున్న ఓమ్ ట్రేడర్స్‌లోని పనివారు

PHOTO • Umesh Solanki

సంచికవరు కాగితాన్ని మడతపెట్టి దానికి ఒక ఆకృతిని ఇవ్వడం ద్వారా కార్మికులు పనిని ప్రారంభిస్తారు. ప్రతి కాగితపు రెక్కకు (flap) ఒక ప్రత్యేకమైన పేరుంటుంది - మాథు (అన్నిటికంటే పైనున్న రెక్క), పేందీ (దిగువ రెక్క), ఢాపా (కుడివైపున్న రెక్క, ఇక్కడ జిగురు అంటిస్తారు), ఖోలా (ఎడమవైపున్న రెక్క). తాజ్ ఎన్వలప్‌లకు చెందిన భిఖాభాయ్ రావల్ ఎక్స్-రేల కోసం ఉద్దేశించిన పెద్ద కవరు పేందీ (దిగువ భాగం)ని మడతపెడుతున్నారు

PHOTO • Umesh Solanki

మడతపెట్టిన ఢాపా, పేందీలపై తమ అరచేతుల అంచులతో కొట్టి చక్కగా మడతపడేలా చేస్తున్న సమీర్ ఎన్వలప్‌లకు చెందిన అబ్దుల్ మజీద్ అబ్దుల్ కరీమ్ షేక్ (ఎడమ), యూసుఫ్ ఖాన్ చోటుఖాన్ పఠాన్

PHOTO • Umesh Solanki

సంచికవరుకు ఒక వైపున్న రెక్కపై తన పిడికిలి బలాన్ని ప్రయోగిస్తోన్న ధృవ్ ఎన్వలప్స్‌కు చెందిన మొహమ్మద్ ఇలియాస్ షేక్. అతను ఒకేసారి 100 సంచికవర్లపై పని చేస్తారు. అందుకోసం 16 సార్లు అదేవిధంగా పిడికిలితో నొక్కటం వలన అతని అరచేయి అంచులు బాగా నొప్పిచేస్తాయి

PHOTO • Umesh Solanki

సంచికవరు దిగువ రెక్కపై 'మాల్ తోడ్వానో పత్తర్' (మడతపెట్టే రాయి)ను ఉపయోగిస్తున్న తాజ్ ఎన్వలప్‌లకు చెందిన అబ్దుల్ గఫార్ గులాబ్‌భాయ్ మన్సూరి. ఈ 'రాయి' నిజానికి ఒక కిలోన్నర బరువుండే ఇనుప ముక్క. ఇది సంచికవర్ల తయారీలో అవసరమైన సాధనం

PHOTO • Umesh Solanki

సంచికవర్ల బొత్తికి సులభంగా జిగురు అంటించేందుకు వాటిని కుడి వైపున పైకెత్తి పట్టుకునేందుకు పనివారు 'సిలాస్' అని పిలిచే చెక్క సాధనాన్ని ఉపయోగిస్తారు

PHOTO • Umesh Solanki

ఒక పుట్లోను ఉపయోగించి కవర్లపై లై (మైదా పిండి లేదా చింతగింజలతో తయారుచేసిన జిగురు)ను పూస్తున్న తాజ్ ఎన్వలప్స్‌కు చెందిన అబ్దుల్ ముత్తాలిబ్ మొహమ్మద్ ఇబ్రహీమ్ అన్సారీ. సన్నని బట్టపీలికలను చిన్న కట్టలా కట్టి ఒక రెక్సిన్ ముక్కలోపల పెట్టి కుట్టిన సాధనాన్ని పుట్లో అంటారు

PHOTO • Umesh Solanki

సంచికవరు కుడివైపు రెక్క భాగమైన ఢాపాకు జిగురు పూస్తోన్న సమీరుద్దీన్ షేక్. ఈయన ఒక్కసారే 100 సంచికవర్లపై పనిచేస్తారు

PHOTO • Umesh Solanki

జిగురు అంటించిన కుడి రెక్కను ఎడమ రెక్క అయిన ఖోలాకు అతికించడానికి కాగితాలను మడతపెట్టిన తాజ్ ఎన్వలప్స్‌కు చెందిన భిఖాభాయ్ రావల్

PHOTO • Umesh Solanki

జిగురు అంటించిన పేందీని మడతపెట్టి సంచికవరు అడుగుభాగాన్ని మూసివేస్తున్న ధృవ్ ఎన్వలప్‌కు చెందిన మొహమ్మద్ ఇలియాస్ షేక్

PHOTO • Umesh Solanki

మధ్యాహ్న భోజనం కోసం విరామం తీసుకుంటున్న ఓమ్ ట్రేడర్స్‌కు చెందిన పనివారు. కేవలం ఈ సమయంలోనే వాళ్ళు పనిచేయడాన్ని ఆపేస్తారు

PHOTO • Umesh Solanki

తాను తయారుచేస్తోన్న ఒక పెద్ద లామినేషన్ కవరును చూపిస్తోన్న తాజ్ ఎన్వలప్స్‌కు చెందిన అబ్దుల్ ముత్తాలిబ్ మొహమ్మద్ ఇబ్రహీమ్ అన్సారీ

PHOTO • Umesh Solanki

వంద సంచికవర్లను సిద్ధం చేయడానికి సగటు కార్మికునికి ఆరు నుండి ఏడు నిమిషాలు పడుతుంది. శారదాబెన్ రావల్ (ఎడమ) గత 34 సంవత్సరాలుగా సంచికవర్లను తయారుచేస్తున్నారు. ఆమె ఈ పనిని తన భర్త మంగళదాస్ రావల్ (కుడి)తో కలిసి పనిచేస్తూ నేర్చుకున్నారు

PHOTO • Umesh Solanki

తయారయ్యే మొత్తం క్రమంలో ఒక కవరు 16 సార్లు కార్మికుని చేతిలోకి వెళుతుంది. దానివలన కార్మికుల వేళ్ళు తెగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాయపడిన తన బొటనవేలును చూపిస్తోన్న కలీమ్ షేక్

PHOTO • Umesh Solanki

లై (ఇంట్లో తయారుచేసిన జిగురు) గాయపడిన వేళ్ళను తాకినపుడు చాలా నొప్పి, బాధ కలుగుతుంది. తన తాజా గాయాలను చూపిస్తోన్న ధృవ్ ఎన్వలప్స్‌కు చెందిన కలీం షేక్

PHOTO • Umesh Solanki

తెరచిన రెక్కలున్న సంచికవర్లను సైజులవారీగా పేర్చుతోన్న తాజ్ ఎన్వలప్స్‌కు చెందిన హనీఫ్ ఖాన్ బిస్మిల్లా ఖాన్ పఠాన్

PHOTO • Umesh Solanki

పై రెక్కను మడతపెట్టి సంచికవరును మూసివేస్తోన్న మొహమ్మద్ హనీఫ్ నూర్‌గనీ షేక్. ఈయన ఎన్వలప్ వర్కర్స్ యూనియన్‌కు ప్రస్తుత అధ్యక్షుడు

PHOTO • Umesh Solanki

పూర్తిగా తయారైన సంచికవర్లను ఒక్కో కట్టలో వంద కవర్లు ఉండేట్టుగా కట్టలు కడుతోన్న హనీఫ్ పఠాన్

PHOTO • Umesh Solanki

సంచికవర్లను ఒక పెట్టెలో పెడుతోన్న శారదాబెన్ రావల్. అహమ్మదాబాద్‌లో ఉన్న 35 సంచికవర్ల తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్నవారిలో ఈమె ఒక్కరే మహిళ

PHOTO • Umesh Solanki

ధృవ్ ఎన్వలప్స్ యజమాని జీతేంద్ర రావల్‌కు తమ పనిగురించి నివేదిస్తోన్న రావల్ దంపతులు. ఆ వారం చేసిన పనికి వేతనం వారికి శనివారం అందుతుంది

PHOTO • Umesh Solanki

జనవరి 1, 2022 నుండి డిసెంబర్ 31, 2023 మధ్య పెరిగిన కార్మికుల వేతనాల జాబితాను తెలియచేసే పత్రం ఫోటో. దీనిని అహ్మదాబాద్‌లో కార్మికుల, తయారీదారుల రెండు యూనియన్‌ల మధ్య జరిగిన చర్చల తర్వాత తయారుచేశారు. 2022లో, కవర్ తయారీ ధరలను 6 శాతం పెంచారు

ఈ కథనాన్ని నివేదించడంలో సహాయపడినందుకు హుజైఫా ఉజ్జయినీకి రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, documentary filmmaker and writer, with a master’s in Journalism. He loves a nomadic existence. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya
Photo Editor : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli