“నా ఇద్దరు కూతుళ్ళకు ఇందుకు భిన్నమైన జీవితం కావాలనుకుంటున్నాను,” వెండి రంగులో మెరు స్తూ పొరలు పొరలు ఎండబెట్టి ఉన్న చేపల మీద ఉప్పు జల్లేందుకు ముందుకు వంగుతూ అన్నారు విశాలాచ్చి. తమిళనాడు తీరంలోని కడలూరు పాతపట్నం ఓడరేవులో గత 20 ఏళ్లుగా చేపలను ఎండబెడుతున్నారు ఈ 43 ఏళ్ళ మహిళ.

“నేనొక భూమి లేని దళిత కుటుంబంలో పెరిగాను. వరి పొలాల్లో వ్యవసాయకూలీలుగా పని చేసే నా తల్లిదండ్రులకు సహాయం చేస్తుండేదాన్ని. వాళ్ళసలు చదువుకోలేదు,” అని ఆమె తెలిపారు. విశాలాచ్చికి 15 ఏళ్ళ వయసులో శక్తివేల్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత రెండు సంవత్సరాలకు కడలూరు జిల్లాలోని ఒక కుగ్రామమైన భీమారావునగర్‌లో వారి మొదటి కుమార్తె శాలిని పుట్టింది.

భీమారావునగర్‌లో వ్యవసాయ కూలీ పనులు దొరకకపోవడంతో, జీవనోపాధి కోసం కడలూరు పాతపట్నం ఓడరేవుకు వచ్చారు విశాలాచ్చి. అక్కడ కమలవేణిని కలిసినప్పటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలు. చేపలను ఎండబెట్టడంలోని మెళకువలను, సదరు వ్యాపార సూత్రాలను ఆవిడే విశాలాచ్చికి నేర్పారు. నెమ్మదిగా విశాలాచ్చి ఆ వ్యాపారంలో ఆరితేరారు.

బహిరంగ ప్రదేశంలో చేపలను ఎండబెట్టడం అనేది చేపలను నిలవచేసే ఒక పాత ప్రక్రియ. ఉప్పులో ఊరవేయడం (సాల్టింగ్), కలప లేదా మొక్కలను మండించి, అందులోంచి వస్తున్న పొగలో చేపలను ఉంచడం (స్మోకింగ్), పచ్చడి పట్టడం వంటివి కూడా ఈ నిల్వ చేసే పద్దతులలో భాగమే. కొచ్చిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన మెరైన్ ఫిషరీస్ సెన్సస్-2016 ప్రకారం, కడలూరు జిల్లాలో 5,000 మందికి పైగా ఉన్న మత్స్యకార మహిళల్లో, దాదాపు 10 శాతం మంది చేపలను ఎండబెట్టడం, చేపలను ఊరబెట్టడం (క్యూరింగ్), వాటి తోలు ఒలచటం వంటి పనులలో నిమగ్నమై ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది; 2020-2021లో దాదాపు 2.6 లక్షల మంది మహిళలు సముద్రపు చేపల పెంపకంలో ఉన్నారని తమిళనాడు రాష్ట్ర మత్స్యశాఖ వెబ్‌సైట్ పేర్కొంది.

PHOTO • M. Palani Kumar

ఎండబెట్టిన చేపల దగ్గర నిలబడివున్న విశాలాచ్చి. చేపలను నిలవ ఉంచడానికి వాటిని ఎండబెట్టడమనేది ఒక పాత ప్రక్రియ. ఉప్పు వేయడం, పొగపెట్టడం, పచ్చడిగా పట్టడం వంటివి కూడా ఈ ప్రక్రియలో భాగమే

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: చేపలపై ఉప్పు చల్లుతున్న విశాలాచ్చి. రాష్ట్ర మత్స్యశాఖ అంచనా ప్రకారం,(2020-2021లో) సుమారు 2.6 లక్షలమంది మహిళలు సముద్రపు చేపల పెంపకం, తదితర కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. కుడి: కడలూరు పాతపట్నం ఓడరేవులో ఎండుతున్న చేపలు

విశాలాచ్చి ఈ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఆమె గురువైన కమలవేణికి 40 ఏళ్ళు దాటాయి. చేపలను వేలం వేయడం, విక్రయించడం, ఎండబెట్టడం చేసే వ్యాపారంలో ఆమె అప్పటికే స్థిరపడివున్నారు. ఆమె కింద పనిచేసే 20 మంది మహిళా ఉద్యోగులలో విశాలాచ్చి ఒకరు. ఆ రోజువారీ పని కష్టతరమైనది – విశాలాచ్చి ఉదయం 4 గంటలకు ఓడరేవుకు చేరుకుంటే, సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేది. అందుకు ఆమె జీతం రోజుకు రూ. 200; కూలీలకు అల్పాహారం, టీ, భోజనం ఇచ్చేవారు. “మేం కమలవేణిని నిజంగా ఇష్టపడతాం. ఆమె కూడా రోజంతా పనిచేసేది – వేలం వేయడం, చేపలు అమ్మడం లేదా పనిచేస్తున్న కూలీలను పర్యవేక్షించడం,” అని ఆమె గుర్తుచేసుకున్నారు.

*****

2004లో వచ్చిన సునామీ విశాలాచ్చి జీవితంలోనూ, ఆమె చుట్టుపక్కలా ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. “సునామీ తర్వాత నా రోజువారీ వేతనం రూ.350కి పెరిగింది. అదేవిధంగా చేపల ఉత్పత్తి కూడా పెరిగింది.”

“అక్కడ ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువ లాభం, అందుకు తగిన కూలీ ఉండేది,” అని విశాలాచ్చి గుర్తుచేసుకున్నారు. నమ్మకమైన మనిషి కావడంతో, బయటకు వెళ్ళేప్పుడు చేపలు ఆరబెట్టే షెడ్డు తాళాలను విశాలాచ్చికి ఇచ్చేవారు కమలవేణి. “సెలవులుండేవి కావు కానీ మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారావిడ.” అంటారు విశాలాచ్చి.

చేపల ధరలు పెరిగినట్టే నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. విశాలాచ్చి-శక్తివేల్ దంపతులకు ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు – శాలిని, సౌమ్య; వాళ్లిద్దరూ బడికి వెళుతున్నారు. శక్తివేల్ వాటర్ ట్యాంక్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నప్పటికీ, తనకొచ్చే రూ.300 రోజువారీ కూలీ సరిపోక ఆర్థికంగా కష్టాలు పడేవారు.

PHOTO • M. Palani Kumar

తన పనివాళ్ళలో ఒకరితో కలిసి తాజాగా కొనుగోలు చేసిన చేపలను తీసుకువెళుతున్న విశాలాచ్చి. కూలీలకు ఆమె రూ.300 రోజువారీ వేతనం, భోజనం , టీ ఇస్తున్నారు

PHOTO • M. Palani Kumar

తాజాగా కొన్న చేపలను పరిశీలిస్తున్న విశాలాచ్చి; 3-4 కిలోల తాజా చేపలు తెస్తే అవి ఒక కిలో ఎండు చేపలు అవుతాయి

“కమలవేణి అంటే నిజంగా నాకు చాలా గౌరవమే అయినా, లాభాలతో సంబంధం లేకుండా నాకు రోజువారీ కూలీ మాత్రమే వచ్చేది,” విశాలాచ్చి వివరించారు.

ఈ సమయంలోనే తనే సొంతంగా ఎండబెట్టి, అమ్మే ఉద్దేశ్యంతో కొన్ని చేపలను కొనుగోలు చేశారు విశాలాచ్చి. అప్పుడు ప్రయాణంలో ఉన్న కమలవేణి, తన కాళ్ళపై తాను నిలబడటానికి విశాలాచ్చి చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుని, 12 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యోగం నుండి విశాలాచ్చిని తొలగించారు.

ఇప్పుడామె తన కూతుళ్ళు చదువుతున్న బడిలో వార్షిక ఫీజు (రూ.6,000) కూడా కట్టలేని పరిస్థితి. ఆ కుటుంబం కష్టాల్లో పడింది.

ఒక నెల తర్వాత ఆమె కుప్పమాణిక్కం అనే చేపల వ్యాపారిని కలుసుకున్నారు. అతను ఆమెను ఓడరేవుకు తిరిగిరమ్మని చెప్పి, ఎండబెట్టేందుకు ఒక బుట్టెడు చేపలను ఇచ్చి, అతని షెడ్‌లో కొంచెం స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చారు. కానీ దానివలన వచ్చే సంపాదన సరిపోయేదికాదు.

2010లో, విశాలాచ్చి సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానికంగా ఉండే ఒక పడవ యజమాని దగ్గర ప్రతిరోజూ రూ.2,000 ఖరీదు చేసే చేపలను అప్పుగా తీసుకునేవారు. ఇలా ఒక వారం పాటు చేశారు. దాంతో ఆమె మరింత కష్టపడాల్సి వచ్చింది – చేపలు కొని, ఎండబెట్టి, అమ్మడానికి తెల్లవారుఝామున 3 గంటలకల్లా ఓడరేవుకు వచ్చి, రాత్రి 8 గంటలకు తిరిగి ఇంటికి వెళ్ళేవారు. కొన్ని రోజుల తరువాత ఆవిడ ఒక మహిళా స్వయం సహాయక బృందం (ఎస్ఎచ్‌జి) దగ్గర ఏడాదికి 40 శాతం వడ్డీకి రూ.30,000 అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఆమె రెండేళ్లలో తిరిగి చెల్లించాలి. ఎస్ఎచ్‌జి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు తీసుకునే వడ్డీ రేటు కంటే తక్కువే.

ఈలోపు ఆమెకు కుప్పమాణిక్కంతో విభేదాలు తలెత్తాయి. “మా మధ్య డబ్బుకు సంబంధించిన తేడాలు వచ్చాయి. తాను నాకెంత సహాయం చేశాడో ఎప్పుడూ గుర్తుచేస్తుండేవాడు,” ఆమె వివరించారు. దాంతో, ఎండు చేపలను నిల్వ చేయడానికి నెలకు రూ1,000 అద్దె చెల్లించి సొంతంగా ఒక షెడ్డును అద్దెకు తీసుకోవాలని విశాలాచ్చి నిర్ణయించుకున్నారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎండిన చేపలను సేకరించేందుకు తన షెడ్ నుండి ఒక పెట్టెను (ఎడమ) తీసుకువస్తున్న విశాలాచ్చి. మధ్యాహ్న భోజనం తర్వాత ఇద్దరు కూలీలతో కలిసి (కుడి) విశ్రాంతి తీసుకుంటున్న విశాలాచ్చి. 2020లో, తమిళనాడు ప్రభుత్వం రింగు వలతో చేపలు పట్టడంపై నిషేధాన్ని అమలు చేసిన తర్వాత, ఆమె సంపాదన బాగా పడిపోవడంతో, ఆమె తన వద్ద పనిచేసే కూలీలను వదులుకోవలసి వచ్చింది

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: చేపలను శుభ్రపరిచి, ఎండబెడుతున్న కూలీ, విశాలాచ్చి, ఆమె భర్త శక్తివేల్ (నిలబడి ఉన్నవారు).   కుడి: సాయంత్రం అవుతుండగా శక్తివేల్ ఎండుతున్న చేపలను సేకరిస్తారు

స్వతంత్రంగా బతకడం కోసం సొంత వ్యాపారం పెట్టాలనుకోవడంతో, విశాలాచ్చి తన చుట్టూ ఉన్నవారి నుండి తరచూ దూషణలను ఎదుర్కొనేవారు. కడలూరులో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబిసిలు)కు చెందిన పట్టణవర్, పర్వతరాజకులం వర్గాలు ఈ చేపల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా, విశాలాచ్చి దళిత వర్గానికి చెందినవారు. “ఓడరేవులో పని చేయడానికి, నా వ్యాపారాన్ని కొనసాగించడానికి నన్ను అనుమతించి నాకు చాలా సహాయం చేస్తున్నామనే భావనలో మత్స్యకార సంఘంవారు ఉండేవారు. తమ నోటికి వచ్చింది మాట్లాడేవాళ్ళు. అది నన్ను బాధించేది,” అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ముందు ఆమే ఒంటరిగా చేపలను ఎండబెడుతున్నప్పటికీ, కొంత కాలానికి ఆమె భర్త కూడా సాయంచేయడం మొదలుపెట్టారు. వ్యాపారం పెరగడంతో, ఇద్దరు మహిళా కూలీలను పనిలో పెట్టుకుని, వారికి రోజువారీ కూలీ రూ.300, భోజనం, టీ ఇవ్వసాగారు విశాలాచ్చి. చేపలను ప్యాకింగ్ చేయటం, వాటిని ఎండబెట్టడం బాధ్యతలు ఆ మహిళలవే. చేపలకు ఉప్పు రాయడానికీ, ఇతర చిన్నాచితకా పనులు చేసేందుకూ రోజుకు రూ.300 ఇచ్చి ఓ అబ్బాయిని కూడా పనిలో పెట్టుకున్నారు విశాలాచ్చి.

రింగు వలల్లో చేపలు ఎక్కువ పడి వ్యాపారం అభివృద్ధి చెందడంతో, విశాలాచ్చివారానికి రూ.8,000-10,000 సంపాదించేవారు.

తన చిన్న కుమార్తె సౌమ్యను నర్సింగ్ కోర్సులో చేర్చారామె. పెద్ద కూతురు శాలిని రసాయనశాస్త్రంలో పట్టభద్రురాలయింది. ఆమె వ్యాపారం బిడ్డలిద్దరి వివాహ ఖర్చులు చెల్లించడానికి సహాయపడింది.

*****

రింగు వలతో చేపలు పట్టడం వల్ల విశాలాచ్చి, ఇంకా కొంతమంది ఇతరులు లాభపడి ఉండవచ్చు కానీ మత్స్య సంపద క్షీణించడానికి అదే కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆరోపించారు. అందుకే ఈ పద్ధతిని నిషేధించాలని చాలా కాలంగా పోరాటం సాగుతోంది. అయితే, రింగు వలలతో సహా ముడతలుగా ఉండే పెద్ద వలలను ఉపయోగించడం 2000 నుండే చట్టవిరుద్ధమైనప్పటికీ, చేపల వేటలో పెద్ద వలల వినియోగాన్ని నిషేధిస్తూ తెచ్చిన చట్టాన్ని 2020 వరకూ తమిళనాడు ప్రభుత్వం కఠినంగా అమలు చేయలేదు.

PHOTO • M. Palani Kumar

ఉప్పు పట్టించిన చేపలను ఎండబెట్టే ప్రదేశానికి తీసుకెళ్ళేందుకు ఒక పెట్టెలో సర్దుతున్న విశాలాచ్చి

PHOTO • M. Palani Kumar

చేపలపై ఉప్పు చల్లడంలో విశాలాచ్చికి సహాయం చేస్తున్న బాలుడు

“ఒకప్పుడు మేం బాగా సంపాదించేవాళ్ళం. కానీ ఇప్పుడు మా రోజువారీ భోజనానికి సరిపడా మాత్రమే సంపాదిస్తున్నాం,” అని విశాలాచ్చి తెలిపారు. నిషేధం కారణంగా తను మాత్రమే కాకుండా మత్స్యకార సమాజం మొత్తం ఎదుర్కొంటున్న నష్టాలను వివరిస్తూ ఆవిడ బాధపడ్డారు. దానివల్ల రింగు వలల పడవ యజమానుల నుండి ఆమె చేపలను కొనలేకపోయారు. వాళ్ళామెకు పాడయిన, మిగిలిపోయిన చేపలను తక్కువ ధరకు అమ్ముతున్నారు.

బదులుగా, అధిక ధరలకు చేపలను విక్రయించే ట్రాలర్ పడవలు విశాలాచ్చికి ఏకైక వనరులుగా మారాయి. చేపల సంతానోత్పత్తి సమయంలో, అంటే ఏప్రిల్-జూన్ నెలలలో, ట్రాలర్ పడవలు కార్యకలాపాలు ఆపివేసినప్పుడు, ఆమె తాజా చేపలను మరింత ఎక్కువ ధరలకు విక్రయించే ఫైబర్ పడవలను వెతకవలసి వస్తోంది.

సీజన్ బాగున్నప్పుడు, చేపలు అందుబాటులో ఉన్నప్పుడు ఆమె వారానికి దాదాపు రూ. 4,000-5,000 సంపాదిస్తారు. కారా ( కారై ) చేపలు, కురుగు పారా ( పారై ) చేపల వంటి చవకైన చేపలను ఎండబెట్టడం ఈ పనిలో భాగమే. ఎండిన కారా చేపలు కిలో రూ.150-200 పలికితే, కురుగు చేపల నుండి అత్యధికంగా రూ.200-300 రాబడి వస్తుంది. కిలో ఎండు చేపలు రావాలంటే 3-4 కిలోల తాజా చేపలు అవసరం. తాజా చేపల ధర కిలో రూ.30-70 వరకు ఉంటుంది.

“మేం రూ.120కి కొని, రూ.150కి అమ్మవచ్చు. అయితే, ఈ ధర మార్కెట్‌కు ఎంత ఎండు చేపల స్టాక్ వస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రోజులు బాగానే సంపాదిస్తాం, మరికొన్ని రోజులు ఏమీ మిగలదు,” అంటూ ఆమె తన పరిస్థితిని వివరించారు.

వారానికి ఒకసారి, చేపలను రెండు ఎండుచేపల మార్కెట్‌లకు - ఒకటి కడలూరులో, మరొకటి పొరుగున ఉన్న నాగపట్టిణం జిల్లాలో - రవాణా చేయడానికి ఒక వాహనాన్ని అద్దెకు తీసుకుంటారు విశాలాచ్చి. దాదాపు 30 కిలోల బరువుండే ఒక్కో ఎండు చేపల పెట్టెను రవాణా చేయడానికి రూ.20 ఖర్చవుతుంది. ఆమె నెలకు 20 పెట్టెలను రవాణా చేయడానికి ప్రయత్నిస్తారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

రోజంతా శ్రమించాక, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విశాలాచ్చి. ఆమెకు విశ్రాంతి సమయం తక్కువ, పని గంటలు ఎక్కువ

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

తమ ఇంటి బయట (కుడి) నిలబడి ఉన్న విశాలాచ్చి, శక్తివేల్. శక్తివేల్ ఆమెకు వ్యాపారంలో సహాయం చేస్తున్నారు. తన ఇద్దరు కూతుళ్లను చదివించి, పెళ్ళిళ్ళకు డబ్బులు సమకూర్చినందుకు విశాలాచ్చి సంతోషిస్తున్నారు. అయితే, ఆవిడ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయివున్నారు

రింగు వలలతో చేపలు పట్టడంపై నిషేధం విధించిన కారణంగా చేపల ధరలు పెరగడం, ఉప్పు ధరలు, రవాణా ఖర్చులు, చేపల ప్యాకింగ్ కోసం వాడే సంచుల ధరలు పెరగడం - ఇలా ఆమెకు ఖర్చులు పెరిగాయి. అలాగే, కూలీలకిచ్చే కూలి కూడా రూ.300 నుంచి రూ.350కు పెరిగింది.

ఇదిలా ఉంటే, ఎండుచేపలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, ఏప్రిల్ 2022 నాటికి విశాలాచ్చి అప్పుల భారం రూ.80,000కి చేరుకుంది. ఇందులో, తాజా చేపల కోసం పడవ యజమానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.60,000 ఉండగా, మిగిలినది స్వయం సహాయక బృందం నుండి తీసుకున్న అప్పు.

ఆగస్ట్ 2022 నాటికి, విశాలాచ్చి తన వద్ద పనిచేసే కూలీలను తీసేయడమే కాక, తన వ్యాపారాన్ని కూడా తగ్గించుకోవలసి వచ్చింది. “ఇప్పుడు నేనే చేపలకు ఉప్పు పట్టిస్తాను. అప్పుడప్పుడు కొంచెం సహాయం తీసుకొని, నా భర్త-నేను వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం. మేం రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాం,” అని ఆమె చెప్పారు.

తన కుమార్తెలు శాలిని(26), సౌమ్య(23)లను చదివించి, వారికి పెళ్ళిళ్ళు చేసేయడమొక్కటే విశాలాచ్చికి ప్రస్తుతమున్న ఏకైక సాంత్వన. అయితే, ఇటీవలి కాలంలో క్షీణిస్తున్న తమ ఆర్థిక పరిస్థితి ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది.

“ఇప్పుడొక సంక్షోభం ఉంది. నేను చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను,” అన్నారామె.

జనవరి 2023లో నిబంధనలకు, షరతులకు లోబడి పరిమిత పద్ధతిలో ముడతలుపడే రింగు వలలతో చేపలు పట్టడాన్ని సుప్రీమ్ కోర్టు అనుమతించడంతో వారికి కొంత ఉపశమనం లభించింది. కానీ తన అదృష్టాన్ని తాను తిరిగి పొందగలదో లేదో అని విశాలాచ్చి సందేహపడుతున్నారు.

వీడియో చూడండి: కడలూరు చేపల రేవులో విభిన్నమైన పనులు చేపడుతోన్న మహిళలు

యు. దివ్య ఉతిరన్ మద్దతుతో

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Text : Nitya Rao

Nitya Rao is Professor, Gender and Development, University of East Anglia, Norwich, UK. She has worked extensively as a researcher, teacher and advocate in the field of women’s rights, employment and education for over three decades.

Other stories by Nitya Rao
Photographs : M. Palani Kumar

M. Palani Kumar is PARI's Staff Photographer and documents the lives of the marginalised. He was earlier a 2019 PARI Fellow. Palani was the cinematographer for ‘Kakoos’, a documentary on manual scavengers in Tamil Nadu, by filmmaker Divya Bharathi.

Other stories by M. Palani Kumar
Editor : Urvashi Sarkar

Urvashi Sarkar is an independent journalist and a 2016 PARI Fellow.

Other stories by Urvashi Sarkar
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi