అక్టోబర్ 2022లో ఒక మలిసంజ వేళ, బళ్లారిలోని వడ్డు గ్రామంలో ఉన్న సామాజిక కేంద్రం ప్లాట్‌ఫారమ్‌పై బలహీనంగా ఉన్న ఒక పెద్దవయసు మహిళ వీపును స్తంభానికి ఆనించి, కాళ్లు చాచి, విశ్రాంతి తీసుకుంటున్నారు. సండూర్ తాలూకా లోని కొండ దారుల గుండా 28 కిలోమీటర్లు నడవడం ఆమెకు అలసట కలిగించింది. మరుసటి రోజు ఆమె మరో 42 కి.మీ దూరం కవాతు చేయాల్సివుంది.

సండూర్‌లోని సుశీలానగర్ గ్రామానికి చెందిన గని కార్మికురాలైన హనుమక్క రంగన్న, బళ్ళారి జిల్లా గని కార్మికర సంఘ (బళ్ళారి డిస్త్రిక్ట్ మైన్ వర్కర్స్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోన్న రెండురోజుల పాదయాత్ర లో పాల్గొంటున్నారు. ఈ నిరసనకారులు ఉత్తర కర్ణాటకలోని బళ్ళారిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో తమ డిమాండ్లను తెలియచేయడానికి 70 కి.మీ. దూరం నడిచి వస్తున్నారు. తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని, జీవనోపాధికి సరియైన ప్రత్యామ్నాయాన్ని కల్పించాలని కోరుతూ గత పదేళ్ళుగా వీధులలో కవాతు చేస్తూవస్తున్న సాటి గని కార్మికులతో కలిసి ఆమె ఇలా రావటం ఇది పదహారోసారి.

1990 దశాబ్దపు చివరలో బళ్ళారిలో పనిలోంచి వెళ్ళగొట్టబడిన వందలాది మంది మహిళా గని కార్మికులలో ఈమె కూడా ఒకరు. "ఇప్పుడు నా వయసు 65 ఏళ్ళు అనుకుందాం. నన్ను పనిలోంచి తీసేసి పదిహేనేళ్ళకు పైనే అయింది" అంటారామె. "డబ్బు (నష్ట పరిహారం) కోసం ఎదురుచూస్తూ చాలామంది చనిపోయారు... నా భర్త కూడా చనిపోయాడు."

"బతికివున్న మేమంతా శాపగ్రస్తులం. ఈ శాపగ్రస్తులైనా నష్ట పరిహారాన్ని పొందుతారో లేదా పొందకుండానే చనిపోతారో మాకు తెలియదు. మేం మా నిరసనను తెలియచేయడానికి వచ్చాం. ఎక్కడ సభ జరిగినా నేను అందులో పాల్గొంటాను. మేం దీన్ని చివరిసారిగా ప్రయత్నించాలనుకుంటున్నాం." అన్నారామె.

PHOTO • S. Senthalir
PHOTO • S. Senthalir

ఎడమ: నష్ట పరిహారం కోసం, పునరావాసం కోసం డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2022లో సండూర్ నుండి బళ్ళారి వరకూ జరిగిన 70 కి.మీ. నిరసన పాదయాత్రలో చేరిన మహిళా గని కార్మికులు. కుడి: 2011లో బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో దాదాపు 25,000 మంది గని కార్మికులను విధుల నుంచి తొలగించారు

*****

కర్ణాటకలోని బళ్ళారి, హోస్పేట, సండూర్ ప్రాంతాలలో ఇనుప ఖనిజం త్రవ్వకాలు 1800లలో బ్రిటిష్ ప్రభుత్వం చిన్న స్థాయిలో తవ్వకాలు జపటంతో మొదలయ్యాయి. స్వతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం, కొద్దిమంది ప్రైవేట్ గనుల యజమానులు 1953లో ఇనుప ఖనిజం ఉత్పత్తిని ప్రారంభించారు; అదే సంవత్సరంలో 42 మంది సభ్యులతో బళ్ళారి జిల్లా గనుల యజమానుల సంఘం ఏర్పాటయింది. నలభై సంవత్సరాల తరువాత, 1993లో ఆనాటి జాతీయ ఖనిజ విధానం మైనింగ్ రంగంలో భారీ మార్పులను ప్రవేశపెట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, ఇనుప ఖనిజం తవ్వకంలో పెట్టుబడి పెట్టడానికి మరింతమంది ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించడం, ఉత్పత్తిని సరళీకృతం చేయడం చేసింది. తరువాతి సంవత్సరాల్లో బళ్ళారిలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీల సంఖ్య పెరిగింది; వాటితోపాటు పెద్ద ఎత్తున యాంత్రీకరణ కూడా పెరిగింది. మనుషులు చేసే పనిలో ఎక్కువ భాగం యంత్రాలు చేపట్టడం ప్రారంభించడంతో, ధాతువును తవ్వడం, చూర్ణం చేయడం, కోయడం, జల్లెడ పట్టడం వంటి పనులు చేసిన మహిళా కార్మికులు త్వరలోనే పనికి అనవసరంగా మారారు.

ఈ మార్పులన్నీ జరగక ముందు గనుల్లో కూలీలుగా పనిచేసిన మహిళల సంఖ్య గురించి కచ్చితమైన రికార్డులు లేకపోయినా, ప్రతి ఇద్దరు మగ కార్మికులకు కనీసం నలుగురి నుంచి ఆరుగురు మహిళలు పనులు చేస్తున్నారనేది ఇక్కడి గ్రామస్థులందరికీ తెలిసిన విషయమే. “యంత్రాలు వచ్చిపడటంతో మాకు ఎటువంటి ఉద్యోగాలు మిగల్లేదు. రాళ్ళు పగలగొట్టడం, వాటిని లోడ్ చేయడం వంటి మేం చేసే పనులను యంత్రాలు చేయడం మొదలుపెట్టాయి,” అని హనుమక్క గుర్తుచేసుకున్నారు.

“ఇకపై గనుల వద్దకు రావద్దని గనుల యజమానులు మాకు చెప్పారు. ఆ లక్ష్మీనారాయణ మైనింగ్ కంపెనీ (ఎల్‌ఎంసి) మాకేమీ ఇవ్వలేదు," అని ఆమె చెప్పారు. "మేం కష్టపడి పనిచేశాం, కానీ మాకు డబ్బు చెల్లించలేదు.” ఈ సంఘటన ఆమె జీవితంలోని మరొక ముఖ్యమైన సంఘటనతో పాటే - ఆమెకు నాల్గవ బిడ్డ పుట్టింది - జరిగింది.

ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఎల్ఎమ్‌సిలో హనుమక్క పనిని పోగొట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత, 2003లో, రాష్ట్ర ప్రభుత్వం 11,620 చదరపు కిలోమీటర్ల భూమిని ప్రైవేట్ తవ్వకాల కోసం డి-రిజర్వ్ చేసింది. ఈ భూమి అప్పటి వరకు ప్రభుత్వ సంస్థల తవ్వకాల కోసమే ప్రత్యేకంగా గుర్తించబడివుంది. ధాతువు కోసం చైనా నుండి అపూర్వమైన డిమాండ్‌ ఉండటంతో, ఇది ఈ రంగంలోని కార్యకలాపాలలో వేగవంతమైన వృద్ధిని సాధించింది. 2010 నాటికి, బళ్ళారి నుండి ఇనుప ఖనిజం ఎగుమతి 2006లో ఉన్న 2.15 కోట్ల మెట్రిక్ టన్నుల నుండి విపరీతంగా 585 శాతం పెరిగి, 12.57 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది. 2011 నాటికి జిల్లాలో దాదాపు 160 గనులు ఉన్నాయనీ, వాటిల్లో దాదాపు 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారనీ కర్ణాటక లోకాయుక్త (రాష్ట్ర స్థాయిలో దుష్పరిపాలన, అవినీతికి సంబంధించిన విషయాలను చూసేవారు) నివేదిక పేర్కొంది. అయితే అనధికారిక అంచనాల ప్రకారం 1.5-2 లక్షల మంది కార్మికులు స్పాంజ్ ఐరన్ తయారీ, ఉక్కు కర్మాగారాలు, రవాణా, భారీ వాహనాల వర్క్‌షాప్‌ల వంటి అనుబంధ కార్యకలాపాలలో పని చేస్తున్నారు.

PHOTO • S. Senthalir
PHOTO • S. Senthalir

సండూర్‌లోని రామ్‌గడ్‌లో ఇనుప ఖనిజం గని దృశ్యం

ఉత్పత్తి, ఉద్యోగాలలో ఇంతటి అనూహ్యమైన పెరుగుదల ఉన్నప్పటికీ, హనుమక్కతో సహా అధిక సంఖ్యలో ఉన్న మహిళా కార్మికులను గనులలో పనికి తిరిగి తీసుకోలేదు. పనిలోంచి తొలగించినందుకు కూడా వారికి ఎటువంటి పరిహారం అందలేదు.

*****

అన్ని నిబంధనలను తుంగలో తొక్కిన కంపెనీలు విచక్షణా రహితంగా తవ్వకాలకు పాల్పడటంతో, 2006 నుండి 2010 సంవత్సరాల మధ్య రాష్ట్ర ఖజానాకు 16,085 కోట్ల నష్టం వచ్చింది. మైనింగ్ కుంభకోణంపై విచారణకు పిలిచిన లోకాయుక్త, అనేక కంపెనీలు అక్రమ మైనింగ్‌లో పాల్గొన్నట్లు తన నివేదికలో ధృవీకరించింది. ఇందులో హనుమక్క చివరిసారిగా పనిచేసిన లక్ష్మీ నారాయణ మైనింగ్ కంపెనీ కూడా ఉంది. లోకాయుక్త నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు 2011లో బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.

ఒక సంవత్సరం తర్వాత, ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని గుర్తించిన కొన్ని గనులను తిరిగి తెరవడానికి కోర్టు అనుమతించింది. సుప్రీం కోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సిఇసి) సిఫార్సు చేసిన ప్రకారం, మైనింగ్ కంపెనీలను కోర్టు వివిధ కేటగిరీల్లో ఉంచింది: 'ఎ', అసలు ఉల్లంఘించని, లేదా అతి తక్కువ ఉల్లంఘనలకు పాల్పడినవి; 'బి', కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినవి; 'సి', అనేక ఉల్లంఘనలకు పాల్పడినవి. అతి తక్కువ ఉల్లంఘనలకు పాల్పడిన గనులను 2012 నుండి దశలవారీగా తిరిగి తెరవడానికి అనుమతించారు. మైనింగ్ లీజును తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాల్సిన పునరుద్ధరణ, పునరావాస (ఆర్ & ఆర్) ప్రణాళికల లక్ష్యాలను, మార్గదర్శకాలను కూడా సిఇసి నివేదిక నిర్దేశించింది.

అక్రమ మైనింగ్ కుంభకోణం కర్ణాటకలో అప్పటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసింది;బళ్ళారిలో ఉన్న సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకోవటం వైపుకు దృష్టిని ఆకర్షించింది. దాదాపు 25,000 మంది గని కార్మికులను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పని నుండి తొలగించారు. అయితే ఇవేవీ పతాక శీర్షికలకెక్కలేదు.

తమని తామే కాచుకోవలసిన పరిస్థితుల్లో పడిన కార్మికులు, నష్టపరిహారం కోసం, ఉపాధి కల్పన కోసం ఒత్తిడి చేయడానికి బళ్ళారి జిల్లా గని కార్మికర సంఘను ఏర్పాటు చేశారు. ఈ సంఘం ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం ప్రారంభించింది. కార్మికుల దురవస్థలపైకి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి 2014లో 23 రోజుల నిరాహారదీక్షను కూడా చేపట్టింది.

PHOTO • S. Senthalir
PHOTO • S. Senthalir

ఎడమ: 2012 నుండి దశలవారీగా గనులను తెరవాలని సుప్రీమ్ కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, పని నుంచి తొలగించిన గని కార్మికులలో అనేకమందిని యాజమాన్యం తిరిగి పనిలోకి తీసుకోలేదు. కుడి: కార్మికుల దురవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి బళ్ళారి జిల్లా గని కార్మికర సంఘ, అనేక ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తోంది

PHOTO • S. Senthalir

1990ల చివరలో గని పనివారిగా తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న వందలాదిమంది మహిళా గని కార్మికులలో, తన వయసు 65 ఏళ్ళు ఉండవచ్చని అనుకుంటోన్న హనుమక్క రంగన్న కూడా ఒకరు

కాంప్రహెన్సివ్ ఎన్విరాన్‌మెంట్ ప్లాన్ ఫర్ మైనింగ్ ఇంపాక్ట్ జోన్ (తవ్వకాల ప్రభావం ఉన్న ప్రాంతం కోసం సమగ్ర పర్యావరణ ప్రణాళిక) అనే కీలక పునరుజ్జీవన కార్యక్రమంలో కార్మికుల డిమాండ్లను కూడా చేర్చాలని సంఘం ఒత్తిడి చేస్తోంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు, బళ్ళారి మైనింగ్ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, సమాచార, రవాణా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన ప్రణాళిక అమలును పర్యవేక్షించడానికి, ఈ ప్రాంతంలో జీవావరణాన్నీ, పర్యావరణ పరిస్థితులనూ పునరుద్ధరించడానికి కర్ణాటక మైనింగ్ ఎన్విరాన్‌మెంట్ రెస్టోరేషన్ కార్పొరేషన్‌ను 2014లో స్థాపించారు. నష్టపరిహారం కోసం, పునరావాసం కోసం తాము చేస్తున్న డిమాండ్‌లను ఈ ప్రణాళికలో చేర్చాలని కార్మికులు కోరుతున్నారు. సుప్రీమ్ కోర్టు, లేబర్ ట్రిబ్యునళ్లలో కూడా పిటిషన్లు వేశామని సంఘం అధ్యక్షుడు గోపి వై. చెప్పారు.

ఈ విధంగా కార్మికులు ఉద్యమించడంతో, మహిళా కార్మికులను అన్యాయంగా తొలగించటంపై తన గళాన్ని వినిపించేందుకు తనకు ఒక సాధికారమైన వేదిక లభించినట్టుగా హనుమక్క  భావిస్తున్నారు. నష్టపరిహారాన్నీ పునరావాసాన్నీ డిమాండ్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్న 4,000 మంది (2011లో ఉద్యోగాలు కోల్పోయిన 25,000 మందిలో) కార్మికులతో ఆమె చేరారు. "1992-1995 వరకు, మేము వేలుముద్రలవాళ్ళంగా ఉండేవాళ్ళం. అప్పటికి, (కార్మికుల కోసం) మాట్లాడటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కారు,” అంటూ ఆమె ఇప్పుడు కార్మిక సంఘంలో భాగం కావడం వలన తాను పొందిన బలం, మద్దతుల గురించి చెప్పారు. “నేను (సంఘ) సమావేశాన్ని దేన్నీ వదలలేదు. హోస్పేట, బళ్ళారి, ఇలా ఎక్కడికైనా వెళ్ళాం. మాకు ఇవ్వవల్సినవి ప్రభుత్వాన్నే ఇవ్వనివ్వండి," అంటున్నారు హనుమక్క.

*****

హనుమక్క ఎప్పటి నుంచి గనుల్లో పనిచేయడం ప్రారంభించిందో ఆమెకే గుర్తులేదు. ఆమె రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న వాల్మీకి సముదాయంలో జన్మించారు. చిన్నతనంలో ఆమె ఇల్లు, చుట్టూ ఇనుప ఖనిజం నిక్షేపాలు అధికంగా ఉన్న సుశీలానగర్‌లో ఉండేది. అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతి ఒక్క భూమి లేని వ్యక్తి చేసినట్టే ఆమె కూడా గనులలో పని చేయడం ప్రారంభించారు.

"నేను చిన్నప్పటి నుండి (గనులలో) అనేక మైనింగ్ కంపెనీలలో పనిచేశాను," అన్నారామె. చాలా చిన్న వయస్సులోనే, ఆమె కొండలు ఎక్కడంలో నేర్పు సంపాదించారు. జంపర్లను ఉపయోగించి రాళ్లలో (ఇందులో ధాతువు ఉంటుంది) రంధ్రాలు చేసి, పేల్చడానికి వాటిని రసాయనాలతో నింపడంలో; ఖనిజాన్ని తవ్వడానికి అవసరమైన అన్ని భారీ పనిముట్లను ఉపయోగించడంలో ఆమె చాలా నేర్పరి. " ఆవాగ మెషినరీ ఇరలిల్లమ్మా (అప్పట్లో యంత్రాలు ఉండేవి కావమ్మా)," అని ఆమె గుర్తుచేసుకున్నారు. "మహిళలు జంటలుగా పని చేసేవారు. (పేల్చిన తర్వాత) ఒకరు రాయి పగిలి వదులుగా వచ్చిన ధాతువు ముక్కలను తవ్వితీస్తుండగా, మరొకరు కింద కూర్చొని వాటిని చిన్న ముక్కలుగా పగలగొట్టేవారు. మేం బండరాళ్ళను మూడు వేర్వేరు సైజులుగా విడగొట్టేవాళ్ళం." దుమ్మును తొలగించడానికి ఖనిజం ముక్కలను జల్లెడపట్టిన తరువాత, మహిళలు తమ తలపై ఆ ఖనిజాన్ని మోసుకెళ్లి ట్రక్కులకు ఎక్కించేవారు. “మేమంతా చాలా కష్టపడ్డాం. మేం పడినంతగా ఎవరూ కష్టపడివుండరు,” అని ఆమె చెప్పారు.

“నా భర్త మద్యానికి బానిస; నేను ఐదుగురు కూతుళ్ళను పెంచవలసి వచ్చింది,” అని ఆమె చెప్పారు. “అప్పట్లో, నేను పగలగొట్టే ప్రతి టన్నుకు (ఖనిజం) 50 పైసలు సంపాదించేదాన్ని. తిండి కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికీ తినడానికి సగం రొట్టి మాత్రమే దొరికేది. అడవి నుండి ఆకుకూరలను సేకరించి, ఉప్పు వేసి నూరుకుని, రొట్టి తో తినడానికి చిన్న చిన్న ఉండలుగా చేసేవాళ్ళం. కొన్నిసార్లు పొడుగ్గా, గుండ్రంగా ఉండే వంకాయను కొని, దాన్ని కట్టెల మీద కాల్చి, పై తోలు తీసేసి, ఉప్పు రుద్దేవాళ్ళం. అది తిని, నీళ్లు తాగి నిద్రపోయేవాళ్ళం... అలా జీవించాం." మరుగుదొడ్లు, తాగునీరు, రక్షణ సామాగ్రి లేకుండా పనిచేసిన హనుమక్క, కటాకటిగా తినడానికి సరిపడేంత మాత్రం సంపాదించేవారు.

PHOTO • S. Senthalir

కనీసం 4,000 మందికి పైగా గని కార్మికులు నష్టపరిహారం కోసం, పునరావాసం కోసం డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్-పిటిషన్ దాఖలు చేశారు

PHOTO • S. Senthalir

సండూర్‌లోని వడ్డు గ్రామంలో విశ్రాంతి కోసం ఆగి, తిరిగి నిరసన ప్రదర్శన కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న హనుమక్క రంగన్న (ఎడమ నుండి రెండవవారు), హంపక్క భీమప్ప (ఎడమ నుండి మూడవవారు), ఇతర మహిళా గని కార్మికులు

ఆమె గ్రామానికే చెందిన మరో గని కార్మికురాలైన హంపక్క భీమప్ప కూడా కఠిన శ్రమ, లేమి గురించిన ఇదే కథను చెప్పారు. షెడ్యూల్డ్ కులాల సముదాయంలో జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే ఒక భూమిలేని వ్యవసాయ కూలీతో వివాహం జరిగింది. “నాకు పెళ్ళయ్యేప్పటికి నా వయసెంతో నాకు గుర్తు లేదు. నేను చిన్నతనంలోనే - ఇంకా యుక్తవయస్సుకు రాకముందే - పని చేయడం ప్రారంభించాను,” అని చెప్పారామె. “ఒక టన్ను ఖనిజాన్ని పగలగొట్టినందుకు రోజుకు 75 పైసలు ఇచ్చేవారు. వారం రోజులు పని చేస్తే మాకు ఏడు రూపాయలు కూడా వచ్చేవి కావు. నాకంత తక్కువ కూలీ ఇచ్చినందుకు ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని."

రోజుకు 75 పైసలు చొప్పున సంపాదించిన ఐదేళ్ళ తర్వాత హంపక్క కూలీ మరో 75 పైసలు పెంచారు. ఆ తర్వాత నాలుగేళ్ళ వరకు రోజుకు రూ. 1.50కు పనిచేశాక మరో 50 పైసలు పెంచారు. "నేను 10 సంవత్సరాల పాటు 2 రూపాయల కూలీకి (రోజుకు, ఒక టన్ను ఖనిజాన్ని పగులగొట్టినందుకు) పనిచేశాను," అని ఆమె చెప్పారు. "నేను ప్రతి వారం ఒక అప్పుపై వడ్డీగా రూపాయిన్నర చెల్లించేదాన్ని. 10 రూపాయలు మార్కెట్‌కి ఖర్చవుతాయి... చవకగా వస్తాయని మేం నూచు (బియ్యపు నూక) కొనుక్కునేవాళ్ళం."

అప్పట్లో ఆమె, మరింత సంపాదించడానికి తెలివైన మార్గం కష్టపడి పనిచేయడమేనని భావించేది. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, వంట చేసి, అన్నం మూటగట్టుకొని, ఉదయం 6 గంటలకే రోడ్డు మీదకు వెళ్ళి, తనను గనులకు తీసుకెళ్ళడానికి వచ్చే ట్రక్కు కోసం వేచి ఉండేది. పెందలాడే పనిలోకి వెళ్ళడం అంటే, ఆమె అదనంగా మరో టన్ను ఖనిజాన్ని పగులగొట్టగలదని అర్థం. “మా ఊరి నుండి బస్సులుండేవి కావు. (ట్రక్కు) డ్రైవర్‌కి 10 పైసలు ఇవ్వాల్సివచ్చేది; తర్వాత అది 50 పైసలకు చేరుకుంది” అని హంపక్క గుర్తుచేసుకున్నారు.

ఇంటికి తిరిగి వెళ్ళేప్పుడు అంత సులభంగా ఉండేదికాదు. బాగా పొద్దుపోయాక, ఆమె మరో నలుగురైదుగురు ఇతర కార్మికులతో కలిసి భారీ ఖనిజాలతో నిండివున్న ట్రక్కులలో ఒకదానిపైకి ఎక్కేది. “కొన్నిసార్లు ట్రక్కు ఒక కోసుగా ఉన్న మలుపు తిరిగినప్పుడు, మాలో ముగ్గురమో నలుగురమో రోడ్డుపై పడిపోయేవాళ్ళం. (అయినా) మాకెప్పుడూ నొప్పి అనిపించేదికాదు. మళ్లీ అదే ట్రక్కు ఎక్కి తిరిగి వచ్చేవాళ్ళం,” అని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఆ అదనపు టన్ను ఇనుప ధాతువును బద్దలుకొట్టడానికి ఆమె పడిన శ్రమకు ఆమెకు ఎన్నడూ ఫలితం దక్కలేదు. "మేం మూడు టన్నులు బద్దలుకొట్టినా, కేవలం రెండు టన్నులకే చెల్లించేవారు," అని ఆమె చెప్పారు. "మేం ఏమీ చెప్పటం గానీ, అడగటం గానీ చేయగలిగేవాళ్ళం కాదు."

PHOTO • S. Senthalir
PHOTO • S. Senthalir

సండూర్ నుంచి బళ్ళారి వరకూ జరుగుతోన్న రెండు రోజుల పాదయాత్రలో రెండవ రోజున ఉదయపు ఫలహారం చేయటం కోసం సండూర్‌లో ఆగిన గని కార్మికులు

PHOTO • S. Senthalir
PHOTO • S. Senthalir

ఎడమ: నిరసన ప్రదర్శన జరుగుతోన్న సమయంలో తన స్నేహితులతో నవ్వుతోన్న హనుమక్క (మధ్యలో). కుడి: సండూర్‌లో తన తోటి గనికార్మికులతో కలిసివున్న హంపక్క

చాలా తరచుగా ఖనిజం దొంగతనాలు జరుగుతుండేవి. మేస్త్రీ, కార్మికులు చేసిన పనికి డబ్బులివ్వకుండా ఆ రూపంలో కార్మికులకు జరిమానా విధించేవాడు. “వారానికి మూడు నాలుగు సార్లు మేం (ధాతువుకు కాపలాగా) అక్కడే ఉండిపోయేవాళ్ళం. చలిమంటలు వెలిగించి నేలపై నిద్రపోయేవాళ్ళం. రాళ్లను (ధాతువు) కాపాడటానికి, మాకు జీతం రావడానికి మేం దీన్ని చేయాల్సి వచ్చేది.

గనులలో రోజుకు 16 నుండి 18 గంటలు పని చేయడం అంటే కార్మికులు తమ వ్యక్తిగత బాగోగులను కనీసంగా కూడా పట్టించుకునే సమయం లేకుండా పోవటం. “వారానికోసారి బజారుకు వెళ్ళే రోజున స్నానం చేసేవాళ్ళం” అంటారు హంపక్క.

1998లో ఉద్యోగాల నుంచి తీసేసిన సమయానికి ఈ మహిళా గని కార్మికురాలు టన్నుకు రూ. 15 సంపాదించేవారు. ఒక్క రోజులో ఐదు టన్నుల ఖనిజాన్ని వారు లోడ్ చేసేవారు. అంటే రోజుకు ఇంటికి రూ. 75 తీసుకెళ్ళేవారు. వారు భారీ ఖనిజ శకలాలను వేరుచేసిన రోజున, రోజుకు రూ. 100 సంపాదించేవారు.

హనుమక్క, హంపమ్మలు మైనింగ్‌ పనులు కోల్పోవడంతో జీవనోపాధి కోసం వ్యవసాయ పనులకు మొగ్గుచూపారు. “మాకు చేయడానికి కూలీ పని మాత్రమే ఉండేది. కలుపు తీయడానికి, రాళ్లను తొలగించడానికి, మొక్కజొన్నను కోయడానికి వెళ్ళేవాళ్ళం. రోజుకు ఐదు రూపాయల కూలికే పని చేశాం. ఇప్పుడు, వారు (భూమి యజమానులు) మాకు రోజుకు 200 రూపాయలు ఇస్తున్నారు,” అని హనుమక్క చెప్పారు. ఆమె ఇప్పుడు పొలం పనికి పోవడం మానేశారు. ఎందుకంటే, ఇప్పుడామెను ఆమె కుమార్తె చూసుకుంటోంది. కొడుకు తన బాగోగులు చూసుకుంటుండటంతో హంపమ్మ కూడా వ్యవసాయ కూలీ పనులు మానేశారు.

మేం మా రక్తాన్ని చిందించాం, ఆ రాళ్లను (ధాతువులను) పగలగొట్టడానికి మా యవ్వనాన్ని త్యాగం చేసాం. కానీ వాళ్ళు (మైనింగ్ కంపెనీలు) మమ్మల్ని పొట్టు లాగా ఊదేశారు,” అంటారు హనుమక్క.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

S. Senthalir

S. Senthalir is Assistant Editor at the People's Archive of Rural India. She reports on the intersection of gender, caste and labour. She was a PARI Fellow in 2020

Other stories by S. Senthalir
Editor : Sangeeta Menon

Sangeeta Menon is a Mumbai-based writer, editor and communications consultant.

Other stories by Sangeeta Menon
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli