పీయూష్ గోయల్ ఓ వ్యాపారి.!రైతు కష్టాలేం తెలుస్తాయన్న జగదీశ్ రెడ్డి.!
ఢిల్లీ/హైదరాబాద్ : వరి కొనుగోలు అంశంలో గులాబీ ప్రభుత్వానికి, కేంద్ర బీజేపి ప్రభుత్వానికి మాటల యుద్దం నడుస్తోంది. తాజా పరిణామాలపై టీఆర్ఎస్ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పందించారు. 40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, కానీ ఎఫ్సిఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని అన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఏ రాష్ట్రంలో లేనిది, తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని అడుగుతున్నారని, తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంతగా పంట పండిందని, అందుకే అదనపు కొనుగోళ్లు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అగ్రిమెంట్ జరిగిందని, తాము మిల్లు పట్టి ఇస్తే, కేంద్రం తీసుకోవాల్సి ఉంది, అయితే, ఈ టార్గెట్ పూర్తయిందని, ఇంకా మార్కెట్ యార్డుల్లో, పంట కల్లాల్లో, కోతలు ఇంకా పూర్తి కాని వరి ఉందని జగదీశ్ రెడ్డి స్పష్టం చేసారు.

కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ అని, ఓ నాయకుడు లేని పార్టీ అని జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల తప్ప రైతుల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదని బీజేపిపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఎవరు రైతుల కోసం పని చేస్తున్నారు, ఎవరు చేయడం లేదనే అంశాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి ఎంవోయూ చేసినోళ్లు, అదనపు సేకరణపై లెటర్ ఇవ్వడానికి ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదో వాళ్లే చెప్పాలని ప్రశ్నించారు. మిల్లు పట్టి బియ్యం రెడీ చేసి ఉంచామని, తీసుకెళ్ళాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. పీయూష్ గోయల్ వ్యాపారి. వ్యాపార ప్రతినిధి. వారికి వ్యాపార ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవని ఘాటు విమర్శలు చేసారు. 2014 తర్వాత వ్యవసాయం రంగం ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలని, విషయం పక్కదారి పట్టించేందుకు, ఎన్నికల మాట మాట్లాడుతున్నారని అన్నారు. బిజెపి పార్టీ రైతులను శత్రువులుగా చూసే పార్టీ అని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.