గూగుల్ లోనూ సైబర్ నేరగాళ్ళు ... ఆ సమాచారం నమ్మారా ... మీ పని అంతే
గూగుల్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ షాపింగ్ ఫేక్ సైట్ ల పేరుతో, కస్టమర్ కేర్ నెంబర్ లతో వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులు అందకపోతే, గూగుల్ సెర్చ్ ద్వారా కస్టమర్ కేర్ నెంబర్ లను చూసి ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేసే లోపే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. దీంతో గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేయాలన్న వినియోగదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇలాంటి కేసులు సైబర్ పోలీసులకు నిత్యకృత్యంగా మారుతున్నాయి.
ఓటీఎస్ పై అదే రగడ: లబ్దిదారుల్లో సందిగ్ధం; మళ్ళీమళ్ళీ క్లారిటీ ఇస్తున్న మంత్రులు!!

గూగుల్ సెర్చ్ లో కస్టమర్ కేర్ నంబర్ .. కాల్ చేయటంతో ...
ఇక తాజాగా ఒక సైబర్ నేరం వెలుగులోకి రావడంతో గూగుల్ సెర్చ్ వినియోగం విషయంలోనూ జాగ్రత్త వహించాలని, ఏది పడితే అది నమ్మి మోసపోవద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులు అందకపోవడంతో, కస్టమర్ కేర్ నెంబర్ అని భావించి కాల్ చేసిన ఒక వ్యక్తి నిలువునా మోసపోయిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి గంగస్థాన్ కు చెందిన వన్నెం రెడ్డి నాగ వెంకట కృష్ణ ట్రాక్ ఆన్ కొరియర్ ద్వారా చెన్నై నుంచి పెయింట్ పిగ్మెంట్ శాంపిల్స్ ను ఆర్డర్ చేశారు. అయితే పార్సిల్ ఎంతకూ రాకపోవడంతో, గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ ను సెర్చ్ చేశారు. దాని నుండి ఫోన్ఈ చేశారు. క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి రెండు రూపాయలు డబ్బులు చెల్లించమని పాపప్ రావడంతో ఆ డబ్బులను తన ఫోన్ పే తద్వారా చెల్లించారు.

దాదాపు లక్ష రూపాయలు పోగొట్టుకున్న వినియోగదారుడు
ఇక ఆ తర్వాత తన ఖాతా నుండి వరుసగా విడతలవారీగా 94,991 రూపాయలు డెబిట్ అయినట్టుగా నాగ వెంకట కృష్ణకు ఫోన్లో మెసేజ్ లు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న నాగ వెంకట కృష్ణ తాను మోసపోయానని గ్రహించి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారాయి. అందమైన గృహోపయోగంవస్తువులను అతి తక్కువ ధరలకే అని గూగుల్ లో చూపిస్తూ కొన్ని సైట్లు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. తీరా కొనుగోలు చేయడానికి డబ్బులు చెల్లించిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రావు. ఇక ఆ వస్తువు డెలివరీ కాదు అన్న చందంగా పరిస్థితి తయారైంది.

గూగుల్ సెర్చ్ విషయంలో జాగ్రత్త.. సైబర్ పోలీసుల హెచ్చరిక
ఇదే సమయంలో గూగుల్ సెర్చ్ ద్వారా విశ్వసనీయమైన సమాచారం ఉంటుందని నమ్మి పలువురు మోసపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గూగుల్ సెర్చ్ లో ఉండే సమాచారమంతా విశ్వసనీయమైన కాదన్నది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పదంగా ఉన్న లింకులు ఓపెన్ చేయడం, లేదా మన మొబైల్ ఫోన్ లోని అన్ని యాప్స్ కు ఆయా సైట్ల కు యాక్సిస్ ఇవ్వడం ప్రమాదకరమని పదే పదే హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు. ఆన్లైన్ సెర్చ్ చేసే వాళ్ళు, గూగుల్ సెర్చ్ లో ఉన్న సమాచారం అంతా నిజమే అని నమ్మేవాళ్ళు మోసపోయే ప్రమాదముందని చెబుతున్నారు. అందుకే గూగుల్లో సెర్చ్ చేస్తున్నా సరే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.