నేనున్నా.. ధైర్యంగా ఉండండి; కడప జిల్లాలో వరద బాధితులకు జగన్ భరోసా; ఒకరికి అవుట్ సోర్సింగ్ జాబ్ !!
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.ఇటీవల కురిసిన వర్షాల వరదలో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మొదటి రోజు కడప, చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. రెండవ రోజు చిత్తూరు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన కొనసాగనుంది.
దూసుకొస్తున్న జవాద్: ఉత్తరాంధ్రకు తుఫాన్ గండం; సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు

కడప జిల్లాలో సీఎం జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ప్రస్తుతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామంలో తిరుగుతూ వరద బాధితులను పరామర్శించారు. ఇళ్ళు కోల్పోయిన వరద బాధితులు సిఎం జగన్మోహన్ రెడ్డి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డితో వరద బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వరదల వల్ల నిలువ నీడ లేకుండా పోయిందని, తినటానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు వరద బాధితులు.

వరద బాధితుల పరామర్శ .. బాధితుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం
ఆపై వైయస్ఆర్ జిల్లా మందపల్లి గ్రామానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి.. అక్కడి సహాయ శిబిరంలో ఉన్న వారితో మాట్లాడారు. అనంతరం సీఎం ఎగుమందపల్లిలో కాలినడకన పర్యటించి వరద బాధితుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులతో, రైతులతో మాట్లాడిన సీఎం జగన్ వారికి తాను అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
వరద సహాయక కార్యక్రమాలు బాగా చేశారని అధికారులను మెచ్చుకున్న జగన్
వరద సహాయ కార్యక్రమాలలో అధికారులు చాలా బాగా పని చేశారని సీఎం జగన్ అధికారుల పనితీరును ప్రశంసించారు. ఇకపోతే మహిళల రుణాల పై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. నేనున్నాను ధైర్యంగా ఉండండి అని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు తమకు ప్రభుత్వం ఇచ్చిన 90 వేల సహాయం సరిపోదని ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. సీఎం జగన్ ఆ బాధ్యత తనదేనని అన్ని విధాలుగా ఆదుకుంటానని వారికి హామీ ఇచ్చారు.

క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు, సమీక్షలు, అధికారులకు జగన్ సూచనలు
అనంతరం గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. వరదల ప్రభావం ఎంతగా ఉందో అధికారుల ప్రాధమిక నివేదికలను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో వరద ప్రభావాన్ని పరిశీలిస్తున్న జగన్ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. వరదలతో జనం ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నాడని, నేలమీదకు దిగాలని టీడీపీ చేసిన విమర్శలకు చెక్ పెడుతూ జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయి పర్యటన సాగిస్తున్నారు.