చంద్రబాబుకు అవమానం రగడ; అయ్యన్నపాత్రుడు, అనితలతో పాటు 16 మందిపై కేసు నమోదు
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం విశాఖలోని నర్సీపట్నంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ర్యాలీ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో టిడిపి నేత అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, చింతకాయల విజయ్ తో సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన క్రింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

చంద్రబాబు కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన .. రసాభాసగా మారిన ర్యాలీ
బుధవారం నాడు టిడిపి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో చంద్రబాబు కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటి నుంచి టిడిపి నేతలు పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు .. టీడీపీ ఫైర్
తాము ఎలాంటి తప్పులు చేయలేదని, మహిళలకు అన్యాయం జరగడంతో నిరసనలు చేస్తున్నామని, నిరసన తెలియ చేసే హక్కు కూడా తమకు లేదా అంటూ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక వినతిపత్రం ఇవ్వాలని భావించటం తప్పా అంటూ ప్రశ్నించారు నడిరోడ్డుపై మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

అనుమతి ఉన్నా పోలీసులు ఆపారని అసహనం , రోడ్డుపై మహిళల నిరసన
ఇక టీడీపీ మహిళా నాయకులు రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలియజేశారు. మహిళలు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు టిడిపి నేతలు నర్సీపట్నంలో చేసిన హంగామాతో విపత్తు నిర్వహణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు టీడీపీ నేతల పై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాము ర్యాలీ నిర్వహించడానికి అనుమతి తీసుకున్నామని టిడిపి నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. తన నివాసం నుంచి మొదలైన పాదయాత్ర మధ్యలోకి వచ్చిన తరువాత పోలీసులు ఎందుకు ఆపారో చెప్పాలి అంటూ ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఒత్తిడి, వైసీపీ నేతల కుట్రలతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారు అంటూ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు అనేక చోట్ల వైసీపీ నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు నిర్వహించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నడూ కన్నీరు పెట్టని చంద్రబాబును కన్నీరు పెట్టించిన వైసిపి నేతలను వదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో వ్యాఖ్యల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న రగడతో కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు లకు భద్రతను మరింత పెంచింది వైసీపీ సర్కార్.