ఇక ప్రజాక్షేత్రంలోకి.. భువనేశ్వరిపై కామెంట్స్‌తో చంద్రబాబు కీలక నిర్ణయం..
భువనేశ్వరిపై చేసిన కామెంట్లతో చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలత చెందారు. ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ప్రతీన చేశారు. సీఎం అయితే తప్ప సభకు రానని చెప్పారు. సో.. ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఏపీలో వర్షంతో వరద పోటెత్తుతోంది. దీంతో వరద ప్రభావతి ప్రాంతాల్లో పర్యటించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఎల్లుండి (మంగళవారం) నుంచి పర్యటిస్తానని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ.. జనాలతో మమేకం అవుతానని సంకేతాలను ఇస్తున్నారు.

కడప, తిరుపతిలో పర్యటన..
చంద్రబాబు నాయుడు పర్యటన ఈ విధంగా ఉండనుంది. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో పర్యటిస్తారు. బుధవారం నెల్లూరులో కలియ తిరుగుతారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను పరామర్శిస్తారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం రోజున టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించిన సంగతి తెలిసిందే. ఇక నేరుగా ప్రజలను కలుసుకొని.. వారి సాధక బాధలను వింటారు.

సీమ, నెల్లూరులో సాయం
రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులను ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని కోరారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేయాలని తెలిపారు. టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు.

అవమానం..
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఓకే.. కానీ తనకు జరిగిన అవమానాన్ని ఆయన ఎత్తి చూపుతారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు లేవు.. కానీ సమయాన్ని మాత్రం తనకు అనుకూలంగా మార్చుకోనున్నారు. అందుకే పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటు ఏపీలో ఇప్పటికీ వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని కలిసి మరింత ధైర్యం ఇవ్వనున్నారు చంద్రబాబు నాయుడు.

జలదిగ్బంధనం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తిరుమల కొండచరియలు విరిగి ఘాట్ రోడ్డుపై పడిపోయాయి. మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది. తిరుమల జలదిగ్బందంలో చిక్కుకొనిపోయింది.