వారికి తిరిగి శ్రీవారి దర్శన సౌకర్యం-అలిపిరి..మెట్ట మార్గం మూసివేత : విరిగిపడిన కొండచరియలు..!!
భారీ వర్షాలు..పోటెత్తుతున్న వరదలతో తిరుమలలోనూ ప్రభావం పడింది. తిరుమలలోని గోగర్భం డ్యాం, పాపనాశనం డ్యాం నిండిపోయాయి. దీంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఆ నీటితో పాటు... కొండల్లో నుంచి దుమికే వరద నీరు తిరుపతి కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కపి లేశ్వరస్వామి ఆలయం వరద నీటితో నిండి పోయింది. తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి.

మెట్టు మార్గాల మూసివేత
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి, తిరుమలలో ఉండిపోయిన భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులో శుక్రవారం జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. తిరుమలలో ఉన్నవారు వర్షం తగ్గేవరకు గదుల్లోనే ఉండాలని సూచించారు. అందరికీ అన్నప్రసాదాలు అందిస్తామన్నారు.

నిలిచి పోయిన భక్తులకు అదనపు సౌకర్యలు
తిరుపతిలో ఉండిపోయిన భక్తులు శ్రీనివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజస్వామి సత్రాల్లో బస పొందవచ్చన్నారు. అక్కడ భోజన సదుపాయం కల్పించామన్నారు. శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు రాలేకపోయిన వారికి తిరిగి దర్శన సౌకర్య కల్పిస్తామన్నారు. ఇతర ప్రాంతాల్లో తీసిన వీడియోలు, ఫొటోలను తిరుమలలో తీసినట్టుగా కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా తెలియజేస్తామన్నారు.

రాలేకపోయిన భక్తులకు మరోసారి దర్శన సౌకర్యం
అంతకుముందు జీఎన్సీ, నారాయణగిరి గెస్ట్‌హౌస్, మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల ఆలయ ప్రాంతాలను, ఆ తర్వాత తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించారు. భారీ వర్షానికి శ్రీవారి మెట్టు మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. టన్నుల బరువున్న కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడానికి కష్టతరంగా మారింది.

దెబ్బ తిన్న అలిపిరి ..మెట్ల మార్గం
మరోపక్క ఘాట్ రోడ్డులో కూడా అనేక ప్రాంతాలలో కొండచరియలు పడిపోవడంతో వీటిని తొలగించే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. మరిన్ని రోజులు నడకదారులను టీటీడీ మూసివేయనుంది. తిరుమల ఘాట్‌రోడ్డులో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. రైళ్లు..విమానాల సర్వీసులు రద్దు కావటంతో తిరుమలకు వచ్చిన ప్రయాణీకులకు రెండు రోజుల సరిపడా భోజన - వసతి సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకూ వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్దేశించారు. మెట్ల మార్గం అనేక చోట్ల దెబ్బ తింది.