ఆ ఇద్దరికీ బీఫామ్ అందించిన వైఎస్ జగన్: గెలుపు లాంఛనమే: పట్టు బిగించడమే
అమరావతి: ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం 9:30 గంటలకు ఆరంభం అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ బీఏసీ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రతిపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
26వ తేదీ వరకు సభ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించారు. పెద్దల సభను మాత్రం ఈ ఒక్కరోజుకే పరిమితం చేయాలని బీఏసీలో నిర్ణయించారు. కాగా- ఈ ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయాన్ని సాధించిన డాక్టర్ సుధ.. ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు.

సభ కార్యకలాపాలు ఆరంభం కావడానికి ముందు- ముఖ్యమంత్రి కార్యాలయం సందడిగా మారింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. పలువురు మహిళా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌ను కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.
శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన వరుదు కల్యాణి, మొండితోక అరుణ్ కుమార్‌కు వైఎస్ జగన్ బీఫామ్‌లను అందించారు. అరుణ్ కుమార్, తన సోదరుడు, నందిగామ శాసన సభ్యుడు మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వచ్చారు. ఆయనకు వైఎస్ జగన్ బీఫామ్‌ను అందజేశారు. మరో క్యాండిడేట్ వరదు కల్యాణి.. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు. ఆమెకు బీఫామ్ ఇచ్చారు వైఎస్ జగన్.

ఇదే ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన పాలవలస విక్రాంత్, ఇసాక్ భాష, డీసీ గోవింద రెడ్డికి ఇదివరకే ఆయన బీఫామ్‌ను అందజేసిన విషయం తెలిసిందే. రెండురోజుల కిందటే ఈ ముగ్గురూ వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి వారికి బీఫామ్ అందజేశారు. వైసీపీకి శాసన సభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఎంపికైన అభ్యర్థులందరూ గెలవడం లాంఛనప్రాయమే.