కేసీఆర్ బాటలో జగన్-రేపు అసెంబ్లీలో తీర్మానం-కేంద్రం పట్టించుకోదని తెలిసీ....
దేశవ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతున్న నేపథ్యంలో బీసీ కులగణన చేపట్టాలన్న డిమాండ్లు పలు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే కోవలో బీసీల జనాభా అధికంగా ఉన్న తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ బీసీ జన గణన కోరుతూ ఓ తీర్మానం చేసి ఆమోదించి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా రేపు తీర్మానం చేయబోతోంది. దీని వల్ల ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ వైసీపీ మాత్రం తన లెక్కలు తాను వెతుక్కుంటోంది.

బీసీ జన గణన
దేశవ్యాప్తంగా పదేళ్లకోసారి జరిగే జన గణనను కేంద్రం ఈ ఏడాది కూడా చేపడుతోంది. ఇఫ్పటికే దీనిపై ఆదేశాలు జారీకావడం, క్షేత్రస్ధాయిలో లెక్కలు తీసుకోవడం, వాటిని గణించడం కూడా జరుగుతోంది. అయితే అదే సమయంలో బీసీ కులాల లెక్కను ప్రత్యేకంగా గణించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ కేంద్రం మాత్రం దీనికి ససేమిరా అంటోంది. ఇప్పుడు బీసీ కులాల గణన చేపడితే మిగతా కులాలు కూడా ఇదే డిమాండ్ ను తెరపైకి తీసుకురావొచ్చనే ఆందోళనతో కేంద్రం ఈ డిమాండ్లను తిరస్కరిస్తోంది. దీంతో విపక్షాలతో పాటు బీజీపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రంపై పలు రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
బీసీ జనాభా అధికంగా ఉన్న రాష్టాల్లో ఒకటైన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతోంది. అయినా కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్ దీనిపై ఓ తీర్మానం కూడా చేసింది. బీసీ కుల గణన చేసి తీరాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఈ డిమాండ్ ను ఆమోదిస్తే తలెత్తే పరిణామాలపై బీజేపీకి పూర్తి అవగాహన ఉంది. కానీ టీఆర్ఎస్ మాత్రం రాజకీయంగా దీన్ని వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తూనే ఉంది.

కేసీఆర్ బాటలో జగన్
బీసీ కుల గణన కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడంతో సహజంగానే సగానికి పైగా బీసీ జనాభా కలిగిన ఏపీపై ఆ ప్రభావం పడింది. దీంతో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం కూడా బీసీ జన గణన కోరుతూ ప్రత్యేక తీర్మానం ఆమోదించి పంపాలని నిర్ణయం తీసుకుంది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కార్ సిద్దమవుతోంది. దీనిపై సభలో సుదీర్ఘంగా చర్చించి కేంద్రానికి పంపబోతున్నారు. కేంద్రం స్పందన వచ్చినా రాకపోయినా ఆ దిశగా ఒత్తిడి పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికార వైసీపీ చెబుతోంది.

జగన్ బీసీ గణన తీర్మానం అందుకేనా ?
ఇతర రాష్ట్రాల్లో పరిస్ధితులు ఎలా ఉన్నా ఏపీలో మాత్రం బీసీ జనాభా గణనీయంగా ఉంది. ప్రస్తుత జనాభాలో పాత లెక్కల ప్రకారం చూసినా దాదాపు 50 శాతానికి పైగా బీసీ జనాభా ఉందని అంచనా. దీంతో బీసీ ఓట్లను చేజిక్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గతంలో టీడీపీకి సుదీర్ఘకాలం అండగా నిలిచిన బీసీలు తొలిసారి వైసీపీవైపు మొగ్గడంతో జగన్ సర్కార్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అలా టీడీపీ నుంచి వైసీపీకి మారిన బీసీ కులాల కోసం కార్పోరేషన్ల ఏర్పాటుతో పాటు పలు కీలక చర్యల్ని జగన్ సర్కార్ అమలు చేస్తోంది. ఇలాంటి సమయంలో బీసీ కుల గణన డిమాండ్ తెరపైకి వస్తోంది. దీన్ని పట్టించుకోకపోతే విపక్ష టీడీపీ సొమ్ము చేసుకునే ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే క్షేత్రస్ధాయిలో టీడీపీ ఆ మేరకు బీసీల్లో కుల గణన డిమాండ్ ను రెచ్చగొడుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. దీంతో జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం స్పందనతో సంబంధం లేకుండా అసెంబ్లీ తీర్మానం చేసేందుకు సిద్ధమవుతోంది.