యుద్దం కాదు.!కేసీఆర్ పతనం మొదలైంది.!బీజేపీని తక్కువ అంచనా వేయొద్దన్న ఈటల.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ లో మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనే హక్కు చంద్రశేఖర్ రావు లేదని మండిపడ్డారు. తనకే అన్నీ తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనులవల్ల, రైతు మరణాలకు చంద్రశేఖర్ రావు కారణమవుతున్నారని ఘాటు ఆరోపణలు చేసారు. హుజరాబాద్ పరిణామాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రశేఖర్ రావు డ్రామాలు మొదలు పెట్టారని, నవంబర్ 2న నరకాసుర వధ జరిగినట్టు తెలంగాణ ప్రజలు అందరూ పండుగ చేసుకున్నారని గుర్తుచేసారు ఈటల రాజేందర్.

ధర్నాచౌక్ లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసీనా వేస్ట్.. కేసీఆర్ పట్ల ప్రజలకు నమ్మకం పోయిందన్న ఈటల
అంతే కాకుండా చంద్రశేఖర్ రావు ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలునమ్మరని, చంద్రశేఖర్ రావు రైతు బందువు కాదని, రైతు వ్యతిరేకని, కరోనా అప్పుడు పారాసెటమాల్ అని ఎలా మాట్లాడారో, ఇప్పుడు కూడా అలానే రైతుల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 45 రోజులుగా తెలంగాణలో వరి ధాన్యం రోడ్ల మీద ఎండకు ఎండి, వానకు తడిసి రైతు కన్నీరు పెట్టుకున్నారని, వరి కుప్పల మీద ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, అయినా నిమ్మకు నీరత్తినట్లు ఉండి ఇప్పుడు సిగ్గు లేకుండా, బాధ్యత మరచి, కర్తవ్యాన్ని గాలికి వదిలివేసి రైతులను కేంద్ర ప్రభుత్వం మీదకు ఉసిగొలిపే కారక్రమం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.

కేసీఆర్ రైతు బంధు కాదు.. రైతు వ్యతిరేకి అంటున్న ఈటల రాజేందర్..
ఇదిలా ఉండగా ధర్నాచౌక్ ను బహిష్కరించిన చంద్రశేఖర్ రావు ఈ రోజు అదే ధర్నా చౌక్ లో ధర్నా చేసారని ఎద్దేవా చేసారు. సీఎంగా తన వైఫల్యాలను కేంద్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ, జుగుప్సాకరంగా మాట్లడుతున్నారని, చంద్రశేఖర్ రావు మాటల పట్ల తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని విరుచుకుపడ్డారు ఈటల. 45 రోజులుగా ధాన్య బయటే ఉండడం వల్ల రంగు మారిందని, ట్రాక్టర్ అన్లోడ్ కావడం లేదని, కింటాకి 8-12 కేజీ లు కట్ చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేసారు. ఆ అంశాలన్నీ పట్టించుకోకుండా ధర్నా చేస్తున్నారని, చంద్రశేఖర్ రావు అహంకారపూరిత ధోరణి వల్ల రైతులు వరి కుప్పల మీదే ప్రాణాలు వదులుతున్నారని మండిపడ్డారు.

రైతులను కేంద్రంపై ఉసిగొల్పుతున్నారు.. ఇందిరాపార్క్ లో కేసీఆర్ చేసిందదే అంటున్న ఈటల
ధర్నా చౌక్ లో కేంద్రాన్ని వరి కొంటవా? చస్తావా ? అని నిలదీస్తున్నారని, ఆనాడు నిండు శాసనసభలో వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేసారని, ఎక్కడా ప్రధాని మోదీ పేరు గానీ కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన గానీ తీయలేదని గుర్తు చేసారు. వడ్లు కొంటున్నది చంద్రశేఖర్ రావు కాదని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటున్న అంశం రైతులకు స్పష్టంగా అర్దం అయ్యిందని ఈటల తెలిపారు. చంద్రశేఖర్ రావు స్వార్థ ప్రయోజనాలకోసం తప్ప ప్రజలకోసం పని చేయరని, రైతులు, రైస్ మిల్లర్లు చేసిన సూచనలు పాటించకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని, దీనికి పూర్తి బాద్యత చంద్రశేఖర్ రావు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేసారు.

తెలంగాణలో కేసీఆర్ కు భవిష్యత్తు లేదు.. సొంత నాయకులే తిరగబడితారన్న ఈటల రాజేందర్
అంతే కాకుండా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి రైతులు వరి వేస్తున్నారని, వరి వేస్తే ఉరి అనే మాట చంద్రశేఖర్ రావు ఎలా చెప్తారని, హుజూరబాద్ లో వందల కోట్లు అక్రమ సంపాదన ఖర్చు పెట్టినా, దళిత బందు పెట్టినా, పెన్షన్ రావు అని బెదిరించినా కూడా ప్రజలు చంద్రశేఖర్ రావును నమ్మలేదని, మెడలు ఇరుస్తం, ముక్కలు చేస్తం అని వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి పై ధ్వజమెత్తారు ఈటల రాజేందర్. ధర్నాచౌక్ లాంటి ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఫసల్ భీమా కింద 513 కోట్లు రాష్ట్రం చెల్లించి ఉంటే, 960 కోట్లు రైతులకు వచ్చేవని, కానీ చంద్రశేఖర్ రావు పట్టించుకోక పోడంతో ఆ నిధులు ఆగిపోయాయాని ఈటల మండిపడ్డారు.