జగన్ ను తాకిన బెజవాడ కాల్వల దుర్వాసన-సీఎంవో సీరియస్- అధికారుల పరుగులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తొలిసారి విజయవాడ కాలుష్య సెగ తగిలింది. ఇప్పటివరకూ ఉద్యమాల సెగ మాత్రమే తగులుతున్నా ఈసారి కాలుష్య దుర్వాసన సెగ తగలడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ వెంటనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే వెంటనే సీఎంవో నుంచి సైతం అధికారులు విజయవాడకు పరుగులు పెట్టారు. వెంటనే దుర్వాసనకు కారణమైన కాల్వల్ని స్వయంగా పరిశీలించారు. తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చేశారు.
సీఎం జగన్ ను తాకిన బెజవాడ కాలుష్యం
సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ విజయవాడ రూరల్ మండలం పరిధిలోకే వస్తాయి. ఈ గ్రామాల పరిధిలోనే విజయవాడ ఆటోనగర్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్యపు నీరు ఈ చుట్టుపక్కల కాల్వల నుంచే ప్రవహించి వెళ్లి బుడమేరు వాగులో కలుస్తుంది. దీంతో ఇక్కడి ప్రజలు కొన్నేళ్లుగా దుర్వాసన మధ్యే బతుకుతున్నారు. ఈసారి సీఎం జగన్ కు ఆ సెగ తగిలింది. తాజాగా ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వస్తుండగా.. రాత్రి సమయంలో ఒక్కసారిగా దుర్వాసన వెదజల్లింది. దీంతో బుల్లెట్ ప్రూఫ్ కారులోనే జగన్ ఉక్కిరిబిక్కిరైనట్లు తెలుస్తోంది.
అధికారులపై జగన్ సీరియస్
సీఎం జగన్ గురించి తెలిసిన వారెవరూ ఆయన ఆగ్రహానికి గురికాకూడదని కోరుకుంటారు. అది పార్టీలో వారైనా, అధికారులైనా, ఉన్నతస్ధానాల్లో ఉన్న వారైనా. అలాంటిది విజయవాడ కాలుష్య ఘటనపై జగన్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే సీఎంతో పాటు కీలక స్ధానాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో కాలుష్యం దుర్వాసన రూపంలో వెదజల్లుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. దీనిపై తక్షణ చర్యలకు జగన్ వెంటనే ఆదేశాలు ఇచ్చారు.
జగన్ ఆదేశాలతో అధికారుల పరుగులు
ఇన్నాళ్లూ విజయవాడలో కాలుష్యంతో జనం దుర్వాసన బారిన పడుతున్నా పట్టించుకోని అధికారులు, ఉన్నతాధికారులు అంతా జగన్ కు కాలుష్య సెగ తాకడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే పరుగులు తీశారు. ఇందులో సీఎంవో ముఖ్యకార్యదర్శఇ ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పురపాలక కార్యదర్శి విజయ్ కుమార్, కృష్ణా కలెక్టర్ నివాస్ తో పాటు స్వచ్ఛభారత్ ఎండీ సంపత్ కుమార్ వంటి వారు ఉన్నారు. వీరంతా వెంటనే విజయవాడవెళ్లి కాల్వల్ని పరిశీలించడం మొదలుపెట్టేశారు. గంటల వ్యవధిలో కాలుష్యానికి కారణాలు కూడా గుర్తించేశారు. వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు కూడా ఇచ్చేశారు.

బెజవాడలో చర్యలకు ఆదేశాలు
బెజవాడ శివార్లలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల్ని తక్షణం గుర్తించడంతో పాటు వాటికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పక్కా డ్రైనేజీ వ్యవస్ధ ఏర్పాటు కోసం ఆదేశాలు ఇచ్చారు. ఆటోనగర్ నుంచి ప్రసాదం పాడు, ఎనికేపాడు వస్తున్న మురుగునీటిని జగన్ ప్రయాణించే జాతీయ రహదారి వైపు నుంచి కాకుండా నిడమానూరు మీదుగా మళ్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ముగురునీటిని విచ్చలవిడిగా వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు నిర్ణయించారు. దీంతో ఇప్పుడు పరిశ్రమల యజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి.