రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ధర్నాలు చెయ్యండి: బీజేపీపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజం
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా ధాన్యం కొనుగోలు ఆపేది లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కావాలని బిజెపి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణాలో నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు కూడా చేస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆ పని చేస్తే సన్మానం చేస్తానన్న మంత్రి గంగుల కమలాకర్

టీఆర్ఎస్ పై బీజేపీ అనవసరపు విమర్శలు చేస్తోంది
ఎఫ్సిఐ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేయాలని కనీసం ఆ సమాచారం లేనివారు కూడా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని బండి సంజయ్ ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు . ఇప్పటికే 3500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వెయ్యి కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై బీజేపీ అనవసరపు విమర్శలు చేస్తోందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

యాసంగిలో వరి సాగు చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చెయ్యదు
తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేస్తామంటున్న బిజెపి నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని ఆయన సూచించారు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు ఆయనను నమ్మరని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎన్నిక గెలవగానే తామే అంతా అన్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకూ పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, యాసంగిలో వరి సాగు చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చెయ్యదని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ధర్నాలు చేయాలంటూ సెటైర్లు
బిజెపి నాయకుల మాటలు విని రైతులు ఆగం కావద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరుగుతుంటే బీజేపీ ఆందోళనలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్న ఆయన బిజెపి రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ధర్నాలు చేయాలంటూ సెటైర్లు వేశారు. తెలంగాణా రాష్ట్రంలో కొంత కాలంగా వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం దుమారంగా మారిన విషయం తెలిసిందే. వరి సాగు చెయ్యొద్దని సర్కార్, సాగు చేసుకోవచ్చని బీజేపీ మాటల యుద్ధానికి తెరతీశాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చెయ్యటం లేదని, వరి సాగు చెయ్యొద్దని, ప్రత్యామ్నాయ పంటలను వెయ్యాలని టీఆర్ఎస్ సర్కార్ రైతులకు చెప్తుంది.

బీజేపీ నేతలపై ఎదురుదాడి చేసిన టీఆర్ఎస్
కేంద్రం కొనుగోలు చెయ్యకపోవటమే వరి సాగు వద్దని చెప్పటానికి కారణం అని టీఆర్ఎస్ చెప్తుంది. అయితే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని, కావాలని తప్పును కేంద్రంపై రుద్దే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ సర్కార్ చెప్పింది అబద్ధం అని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చెయ్యాలని తెలంగాణా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలపై ఎదురు దాడి చేస్తున్నారు. బీజేపీ తీరును ఎండగడుతున్నారు.