సీఎం జగన్ అప్పుడే నిర్ణయం తీసుకుంటారు: పెట్రో ధరలపై మోపిదేవి, పవన్ కళ్యాణ్‌పై ఇలా..
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 పన్నును తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పన్ను తగ్గించాలంటూ బీజేపీతోపాటు టీడీపీ, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేంద్రం, బీజేపీలపై మండిపడ్డారు.

1 ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను గమనించాలన్న మోపిదేవి
పెట్రోల్ , డీజిల్ ,గ్యాస్ ధరలను గత కొంత కాలంగా కేంద్రం పెంచిందని వెంకటరమణ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో జనంలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చ జరిపిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికస్థితిగతులను కేంద్రం పరిగణంలోకి తీసుకోవాలన్నారు ఎంపీ మోపిదేవి. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయడం సరికాదన్నారు.

అప్పుడే పెట్రో ధరలపై సీఎం జగన్ నిర్ణయం: మోపిదేవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాదు.. కేంద్రంపై వత్తిడి తీసుకురాలని బీజేపీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కేంద్రం తగ్గించాల్సిన మోతాదులో తగ్గించాలన్నారు. అప్పుడు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు మోపిదేవి వెంకటరమణ.

పవన్ కళ్యాణ్ కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టాలన్న మోపిదేవి
ఏపీకి ప్రత్యేక హోదాపై తమ స్టాండ్ ఆనాడు.. ఈనాడు ఒకటే అన్నారు ఎంపీ మోపిదేవి. రాష్ట్రానికి హోదా కావాల్సిందేనని మోపిదేవి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఇందుకోసం అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు విషయంలో పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ పెట్టాల్సింది కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదన్నారు మోపిదేవి. విశాఖ ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకోవల్సింది కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాము పోరాటం చేస్తూనే ఉన్నామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు.

కేంద్రం తగ్గించినా తగ్గించని తెలుగు రాష్ట్రాలు, బిజేపీయేతర రాష్ట్రాలు
కాగా, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. అదే సమయంలో రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గిస్తే ప్రజలపై భారం కొంత మేర తగ్గుతుందని తెలిపింది. ఈ క్రమంలో స్పందించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు తమకు వీలైనంతగా వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయాలు ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని వినియోగదారులకు దీపావళి వేళ డబుల్ ధమాకా లభించినట్లయింది. బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు ఒడిశా ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించింది. అయితే, ఒడిశా మినహా బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదు. దీంతో ఈ ప్రభుత్వాలపై అటు రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం పెట్రో ధరలను తగ్గించిందని పలు పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు.