వాంఖడేకు షాక్ - ఆర్యన్ కేసు నుంచి తొలిగింపు : బదిలీ వేటు - లంచం ఆరోపణలతో...!!
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంచం డిమాండ్ చేసారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే పై అధికారులు వేటు వేసారు. ఆర్యన్ ఖాన్ జైళ్లో ఉన్న సమయంలో బెయిల్ కోసం పోలీసు అధికారి వాంఖెడే డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆరోపణలు సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు వాంఖెడేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాంఖెడే స్థానంలో విచారణాధికారిగా సంజయ్‌సింగ్‌ను నియమించారు.

విచారణ నుంచి వాంఖెడే తొలిగింపు
ఇక విచారణాధికారి స్థానం నుంచి తొలగించిన వాంఖెడేను ఎన్సీబీ సెంట్రల్ జోన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబయి జోన్ ఆర్యన్ ఖాన్ కేసును విచారిస్తుండగా.. ఇకపై ఎన్‌సీబీ సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఐదు కేసులను సెంట్రల్ యూనిట్‌కు బదలాయించారు. ఇకపై ఈ కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్ సింగ్ విచారించనున్నారు.

కొత్త అధికారిగా సంజయ్ సింగ్
డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారని ఆరోపించారు. ఆయన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించారంటూ పలు ఆరోపణలు చేశారు. దీంతో వాంఖడే మతంపైనా చర్చ జరిగింది. మరోవైపు ఆర్యన్‌ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి సైతం వాంఖడేపై సంచలన ఆరోపణలు చేశారు.

అవినీతి ఆరోపణలే ప్రధాన కారణంగా
ఎన్‌సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలన్నారని చెప్పారు. దీంతో వాంఖడే చుట్టూ వివాదాలు అలముకొన్న నేపథ్యంలో ఆయనను విచారణ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చింది. కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎన్సీబీ విచారణ అనంతరం అక్టోబర్ 8న అతన్ని ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించారు.

కోర్టు ముందు మరోసారి ఆర్యన్ ఖాన్
ఆ తర్వాత ఎన్సీబీ స్పెషల్ కోర్టు, కింది కోర్టులలో ఆర్యన్ ఖాన్ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌లు వేయగా కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. కాగా, కండిషన్ బెయిల్ నేపథ్యంలో ఆర్యన్ ఈ రోజు (శుక్రవారం) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు వాంఖెడే పైన తీసుకున్న చర్యల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఈ ఆరోపణలు మరిన్ని రోజులు కొనసాగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే, సమీర్ వాంఖడే ఢిల్లీ కేంద్రంగా పని చేస్తారని సమాచారం.