చంద్రబాబు.. జగన్ కు ఎన్నికల కమీషన్ కు సంబంధం ఏమిటో చెప్పాలి: ఎమ్మెల్యే రోజా రివర్స్ ఎటాక్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి నగిరి ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు రోజా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నాడని ఎమ్మెల్యే ఆర్కే రోజా చురకలంటించారు. అందుకే ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రోజా నిప్పులు చెరిగారు.

జగన్ కు ఎన్నికల కమీషన్ కు సంబంధం ఏమిటో చంద్రబాబు చెప్పాలి
చంద్రబాబు ప్రవర్తన చూస్తే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి అని అందరూ నిర్ణయించుకునే విధంగా తయారయిందని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.నరకాసురుడిని సంహరించినట్టు ఈ నారాసురుడిని గతంలో లోకల్ బాడీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓట్లతో వధించారంటూ రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. పండగ పూట ఎన్నికలేంటి అని చంద్రబాబు అంటున్నాడు అన్న రోజా మంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల కమీషన్ కు సంబంధం ఏమిటో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ నచ్చాయి అని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు తప్పేనని చెప్పడం వెనక ఆంతర్యమేమిటో అందరికీ తెలుసని రోజా విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చంద్రబాబుపై మండిపడిన రోజా
చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడిన రోజా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో, ప్రజా సంక్షేమం వైపు ముందుకు సాగడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అంటూ, ఓర్చుకోలేకనే ఈ తరహా విమర్శలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రవర్తిస్తే మంచిదని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. అంతేకాదు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో తన కొడుకును మంత్రి చేసుకుని తన ఆశలు నెరవేర్చుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని రోజా మండిపడ్డారు.

ఎన్నికలు కుప్పం అయినా శ్రీకాకుళం అయినా .. క్లీన్ స్వీప్ చేసింది జగన్ మాత్రమే
బద్వేలులో బిజెపికి ఏజెంట్లను సరఫరా చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించిన రోజా కుప్పం నుండి శ్రీకాకుళం వరకు జగన్ స్వీప్ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని వదిలి వెళితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు రోజా. జగన్ తో తేల్చుకోడానికి చంద్రబాబుకు ఇంకేమీ మిగల్లేదు అని వ్యాఖ్యానించారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేలు కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని, ప్రజలు వైసీపీ పాలన పై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్న రోజా, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబును , టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్న వైసీపీ
ప్రస్తుతం మరోమారు ఏపీలో ఎన్నికల నగారా మోగిన నేపధ్యంలో టీడీపీ ఆరోపణలు, ఫిర్యాదులపై వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికలు ఏవైనా, ఎక్కడైనా గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని తేల్చి చెప్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎదురు దాడికి దిగుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు అవుతుందని, ఓటమి భయంతోనే చంద్రబాబు, టీడీపీ నాయకులు సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారని, చంద్రబాబు అర్ధం పర్ధం లేని ఆరోపణలతో తంటాలు పడుతున్నాడు అని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.