బీజేపీ ఎంపీ కారుపై రైతుల దాడి, ఉద్రిక్తత: వివాదాస్పద వ్యాఖ్యలే కారణం
ఛండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జాంగ్రా తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ఆయన వాహనంపై దాడి చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి ఎంపీ రాంచందర్ జాంగ్రా మాట్లాడుతూ.. వారంతా పనిపాట లేని మందుబాబులని అన్నారు. ఈ క్రమంలో శుక్రవారం హర్యానా హిస్సార్ జిల్లాలోని నార్‌నౌంద్‌లో ధర్మశాల ప్రారంభించేందుకు వచ్చిన ఎంపీని.. రైతులు పెద్ద ఎత్తున నిరసనలతో అడ్డుకున్నారు. నల్ల జెండాలు పట్టుకుని ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు, రైతులకూ మధ్య జరిగిన తోపులాట జరిగింది. రైతుల దాడితో ఎంపీ కారు ధ్వంసమైంది. అంతకుముందు రైతులను నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు, ఎంపీకి మద్దతుగా పలువురు నినాదాలు చేయడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను తీవ్రంగా శ్రమించి అక్కడ్నుంచి పంపించేశారు.
కాగా, రోహ్‌తక్‌లో గురువారం దీపావళి వేడుకలకు హాజరైన సందర్భంలోనూ ఎంపీ జాంగ్రాకు ఇదే విధమైన అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఆయన నిరసనలు చేస్తున్న రైతులపై విమర్శలు గుప్పించారు. నిరసనలు చేస్తున్నవారిలో రైతులెవరూ లేరని, వారంతా పనీపాటలేని మందుబాబులని వ్యాఖ్యానించారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ఆందోళనల్లో పాల్గొంటున్నవారు.. ఎప్పుడూ ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నవారనేనని దుయ్యబట్టారు. ఇటీవల సింఘూ సరిహద్దులో ఓ అమాయకుడి హత్య ఘటనతో వారి ప్రవర్తన వెల్లడైందని చెప్పారు. తాను తరచూ ఢిల్లీ వెళ్తూనే ఉంటానని, అక్కడ చాలా టెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఎంపీ జాంగ్రా చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే శుక్రవారం ఎంపీ కారుపై దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ సరిహద్దులో దాదాపు ఏడాది కాలంగా రైతులు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.