వైసీపీని రద్దు చెయ్యాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ నేతలు; ఏపీలో డ్రగ్స్, దాడులపై ఫిర్యాదు
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హస్తినలో పొలిటికల్ హీట్ కు కారణంగా మారాయి. పట్టాభి వ్యాఖ్యలపై మొదలైన దుమారం, ఆపై తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు వెరసి వ్యవహారం కాస్త ఢిల్లీ దాకా చేరింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులపై ఏపీ ప్రభుత్వం తీరుపై రాష్ట్రపతికి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేస్తే, పట్టాభి ఉపయోగించిన భాష పై వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ నేతలు
ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఢిల్లీకి వెళ్లిన పలువురు టీడీపీ నేతలు సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం అధికారులను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వైసిపి గుర్తింపును రద్దు చేయాలని టిడిపి నేతలు కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, ప్రతిపక్షాలపై చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో గంజాయితో సహా ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ తమపై దాడులు చేస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

వైసీపీ తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందన్న టీడీపీ నేతలు
ఎంపీ కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ , నిమ్మల కిష్టప్ప తదితరులు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో పరిస్థితిని సవివరంగా చెప్పారు. అరాచక పాలన సాగిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని టిడిపి నేతలు చెబుతున్నారు. వైసిపి తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

జగన్ ఏపీని రౌడీ ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్న కేశినేని నాని
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ని రౌడీ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రం డ్రగ్స్ మాఫియాలా తయారైందని కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో టిడిపి హయాంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పై నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, వైసీపీ మంత్రులు నేతలు ఉచ్చరించే లేని అసభ్య పదజాలంతో చంద్రబాబుని తిట్టారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

గంజాయి, డ్రగ్స్ పై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు
రాష్ట్రంలో గంజాయి వ్యవహారంపై ప్రశ్నించినందుకు టిడిపి నేతల ఇళ్లపై దాడులు చేశారని తెలుగు దేశం పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. 31 కేసులలో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. మొన్నటికి మొన్న టిడిపిని రద్దు చేయాలంటూ వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవగా, ఇక నేడు వైసీపీని రద్దు చేయాలంటూ టిడిపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.