కడప ఉక్కుపై ఉన్న ఇంట్రెస్ట్ విశాఖ ఉక్కుపై లేదేం.. రఘురామ
ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. ఏపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. దానికి తగినట్టు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే రఘురామ.. తాజా పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. నిన్న పవన్ కల్యాణ్ సభతో విశాఖ కదిలిపోయిందని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత నూటికి నూరు శాతం వైసీపీదేనని స్పష్టం చేశారు.
సీఎం ఒక్క రోజు అయినా విశాఖ ఉక్కు కోసం ఆందోళన చేశారా? అని రఘురామ ప్రశ్నించారు. సొంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై లేదని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. తన అనర్హతపై పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకున్న ఎంపీలు, విశాఖ ఉక్కు గురించి కూడా ప్లకార్డులు పట్టుకోవాలని రఘురామ హితవు పలికారు. రైతుల మహాపాదయాత్రపై రఘురామ స్పందించారు.

రైతుల పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రుణ ఒప్పంద పత్రంలో గవర్నర్ పేరు కూడా రాయడం దుర్మార్గమని రఘురామ అభిప్రాయపడ్డారు. ఏపీ శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, అదే మండలిలో ఖాళీలు భర్తీ చేయాలని ఢిల్లీలో కాళ్లావేళ్లా పడి బతిమాలుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రతిపక్షాలు ఒంటికాలిపై లేచాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. వైసీపీ తప్ప.. టీడీపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిని రఘురామ సీరియస్‌గా తీసుకున్నారు. తమ పార్టీపై విమర్శలు చేశారు. కడప ఉక్కుపై ఎందుకు ప్రేమ అని నిలదీశారు. విశాఖ ఉక్కు అల్లం.. కడప ఉక్కు బెల్లం అయ్యిందా అని అడిగారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని.. తీరు మార్చుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరింత గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.