drugs case: బొంబాయి హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై వాదనలు; విచారణ రేపటికి వాయిదా !!
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. కేసులో కొత్త కొత్త ఆరోపణలు, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఆర్యన్ ఖాన్ కు మాత్రం ఈ కేసు లో బెయిల్ రావటం లేదు. ఈ రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ అభ్యర్థనపై బాంబే హైకోర్టులో విచారణ కొనసాగింది. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో ఆర్యన్ ఖాన్ ను అక్టోబరు రెండవ తేదీన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు ఆర్యన్ ఖాన్ కు కు బెయిల్ రాకుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అడ్డుపడుతున్నారు.

రేపు మరోమారు వాదనలు వినిపించనున్న ఆర్యన్ తరపు లాయర్లు
ఎన్డీపీసీ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆర్యన్ ఖాన్ తరపు వాదిస్తున్న లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు కోర్టులో విచారణ జరగగా కేసు రేపటికి వాయిదా పడింది. దీంతో ఆర్యన్ ఖాన్ జైలుశిక్షను మరో రోజు పొడిగించారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ తిరిగి ప్రారంభమవుతుంది. నేటి వాదనలలో, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఆర్యన్ ఖాన్ తరపున వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. క్రూయిజ్ షిప్ లో పార్టీకి ఆర్యన్ ఖాన్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారని వెల్లడించిన అడ్వకేట్ ప్రతీక్ గాబా అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపుమేరకు ఆర్యన్ ఖాన్ అక్కడికి వెళ్ళినట్టుగా పేర్కొన్నారు.

అర్బాజ్ దగ్గర డ్రగ్స్ దొరికితే ఆర్యన్ ను ఎలా అరెస్ట్ చేస్తారు?
ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్ మర్చంట్ ను కూడా ఆహ్వానించడంతో ఇద్దరు కలిసి వెళుతున్న క్రమంలో వారిని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారని ముకుల్ రోహత్గి వాదించారు. అర్బాజ్ కు ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. తనతోపాటు కలిసి వెళ్ళిన ఓ వ్యక్తి దగ్గర మాదకద్రవ్యాల పట్టుబడితే ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ అధికారులు ఏ విధంగా అరెస్టు చేస్తారంటూ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు పూర్తిగా అక్రమమని ఆయన వాదించారు.

వాట్సప్ చాటింగ్ లకు ఈ కేసుకు సంబంధం లేదు, ఇది కావాలని చేస్తున్న కుట్ర
కుట్రపూరితంగానే ఆర్యన్ ఖాన్ ను ఈ కేసులో ఇరికించారని న్యాయవాది వాదనలు వినిపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ పై ఆరోపిస్తున్న వాట్సప్ చాట్ లు ముంబై క్రూయిజ్ పార్టీ కేసు కు సంబంధించినవి కాదని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆ చాటింగ్ లను తప్పుగా డ్రగ్స్ కేసులో లింకు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ యువకుడు అని, అతన్ని జైలుకు కాకుండా పునరావాసానికి పంపాలని పేర్కొన్నారు. అనవసరంగా చెయ్యని నేరానికి ఆర్యన్ ఖాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్ లతో లింక్ ఉందని ఎన్సీబీ వాదన
ఇదిలా ఉంటే అక్టోబర్ 8 నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉన్నాడు. అతను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులచే ఏ 1 నిందితుడిగా పేర్కొనబడ్డాడు. ఈ డ్రగ్స్ కేసులో అతనే మూలమని ఎన్సీబీ వాదిస్తుంది. అతని వద్ద ఎటువంటి డ్రగ్స్ కనుగొనబడలేదని అతని లాయర్లు పదేపదే వాదించారు. గత వారం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించిన ప్రత్యేక మాదక ద్రవ్యాల నిరోధక న్యాయస్థానం అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ లింక్ ఉందని ఎన్సీబీ వాదనల నేపధ్యంలో కోర్టు బెయిల్ ను తిరస్కరించింది.