అనాలోచిత చర్యకు జగన్ సర్కార్ మూల్యం-విద్యా దీవెన నిలిపేస్తామని హెచ్చరిక- కాలేజీలకు ఇవ్వకపోతే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన(ఫీజు రీయింబర్స్ మెంట్ ) కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజుల్ని కాలేజీల ఖాతాల్లో కాకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనిపై ముందు నుంచీ రచ్చ జరుగుతోంది. ఇలా ఫీజులు తమ ఖాతాల్లో వేయించుకున్న వారిలో కనీసం 40 శాతం మంది తల్లులు వీటిని తిరిగి కాలేజీలకు చెల్లించడం లేదు. ఇలా చెల్లించని తల్లులకు జగన్ సర్కార్ తాజాగా వార్నింగ్ ఇచ్చింది.

జగనన్న విద్యా దీవెన
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మాజీ సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో మార్పులు చేసి జగనన్న విద్యా దీవెనపేరుతో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పేద పిల్లలు, వెనుకబడిన తరగతుల, బలహీన వర్గాల విద్యార్ధులకు వారు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల్ని వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. వీటిని వీరు తిరిగి కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించడం ద్వారా కాలేజీలు వీరికి నాణ్యమైన విద్యను అందించడం ఈ పథకం ఉద్దేశం. కానీ వాస్తవంలో మాత్రం అలా జరగడం లేదు.

వాడేసుకుంటున్న కొందరు తల్లులు
జగనన్న విద్యాదీవెన కింద కాలేజీలకు విద్యార్ధుల తరఫున చెల్లించాల్సిన ఫీజుల్ని తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా మేలు జరుగుతుందంటూ కొత్త లాజిక్ తీసుకొచ్చిన జగన్ సర్కార్.. కాలేజీలకు కాకుండా వీరికే ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇలా తల్లుల ఖాతాల్లో వేస్తున్న విద్యాదీవెన ఫీజు మొత్తాల్ని కొందరు తల్లులు కాలేజీలకు చెల్లించడం లేదు. సొంతానికి ఖర్చుపెట్టేసుకుని కాలేజీలు అడిగితే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలా 40 శాతం విద్యార్ధులు ప్రభుత్వం నుంచి విద్యాదీవెన మొత్తాలు అందుకుని కాలేజీలకు ఫీజులు చెల్లించలేదని తాజాగా నిర్ధారణ అయింది.

అలా కుదరదన్న హైకోర్టు
జగనన్న విద్యాదీవెన కింద కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు పేరుకుపోతుండటం, అడిగితే వేధింపులంటూ విద్యార్ధుల తల్లులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తుండటంతో విసిగిపోయిన కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. తమకు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వకుండా తిరిగి తమపైనే ఎదురుదాడి చేయడంపై యాజమాన్యాలు హైకోర్టుకు ఫిర్యాదు చేశాయి. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. విద్యాదీవెన మొత్తాలు తల్లుల ఖాతాల్లో వేయడం సరికాదని ప్రభుత్వానికి సూచించింది. తిరిగి కాలేజీల ఖాతాల్లోనే వేసేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించింది.

ఆ తల్లులకు జగన్ సర్కార్ హెచ్చరిక
విద్యాదీవెన కింద ప్రభుత్వం ఇస్తున్న ఫీజు మొత్తాల్ని తమ ఖాతాల్లో వేయించుకుంటూ తిరిగి కాలేజీలకు చెల్లించకుండా జాప్యం చేస్తున్న తల్లులకు ప్రభుత్వా తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపింది. గతంలో విద్యాదీవెన మొత్తాన్ని తీసుకుని కాలేజీలకు చెల్లించని తల్లులకు ఇకపై మరో విడత ఫీజులు ఖాతాల్లో వేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. నవంబర్ మూడో వారంలో మరో విడత విద్యాదీవెన మొత్తాలు తల్లుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. అక్టోబర్ 27 నుంచి అర్హతల పరిశీలన చేపట్టబోతోంది. ఇలా అర్హుల్ని గుర్తించాక వచ్చే నెల 10వరకూ అభ్యంతరాలు స్వీకరించి వచ్చే నెల 17న అర్హుల జాబితా ఖరారు చేయబోతున్నారు.

జగన్ సర్కార్ అనాలోచిత చర్య?
గతంలో మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తొలిసారి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారు. అప్పట్లో కాలేజీల ఖాతాలకు నేరుగా ఫీజులు జమ చేసే వారు. అప్పట్లో ఈ పథకం కోసమే కొత్తగా పలు కాలేజీలు పుట్టుకొచ్చాయి కూడా. వైఎస్ తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్, చంద్రబాబు ప్రభుత్వాలు సైతం పేరు మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చాయి.
నిబంధనలు మాత్రం మార్చలేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన మొత్తాల్ని వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం ఉద్దేశం దెబ్బతినడం ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా ఫీజులు తమ ఖాతాల్లో వేయించుకున్న తల్లుల్లో 40 శాతం మంది వాటిని తిరిగి కాలేజీలకు జమ చేయకపోవడంతో ప్రభుత్వం అనాలోచిత చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఇప్పుడు వాటిని తిరిగి తల్లుల నుంచి రాబట్టలేక, అలాగని కాలేజీల్ని ఫీజుల్లేకుండా విద్యార్ధులకు చదువు చెప్పాలని చెప్పలేక ప్రభుత్వం ఇరుకునపడుతోంది. దీంతో చివరి ఆప్షన్ గా ఇకపై ఫీజు మొత్తం ఇవ్వబోమని హెచ్చరికలు జారీ చేస్తోంది.