పంతం నెగ్గించుకున్న వైజాగ్ వైసీపీ -జీవీఎంసీ కమిషనర్ సృజన బదిలీ-పరిశ్రమల డైరెక్టర్ గా
ఏపీలో అధికారులకూ, అధికార పార్టీ నేతలకూ మధ్య వార్ ముదురుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతల్ని పట్టించుకోకుండా విధి నిర్వహణలో దూసుకుపోతున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కాబోయే రాజధాని విశాఖలోనూ అదే పరిస్ధితి ఎదురైంది. విశాఖలో అధికార వైసీపీ నేతలకు కంటగింపుగా మారిన జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ల సృజనను ప్రభుత్వం ఆ పదవిలో నుంచి బదిలీ చేసేసింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల్ని కట్టడి చేసేందుకు సృజన చేసిన ప్రయత్నాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ల సృజన
విశాఖ మహానగర పాలక సంస్ధ కమిషనర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల సృజన సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వ విభాగంలో పనిచేసినా తనదైన ముద్ర వేసిన సృజన.. విశాఖలోనూ తనదైన శైలిలో దూసుకుపోయారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రసవమైనా చంటిబిడ్డను ఒళ్లో పెట్టుకుని విధులు నిర్వహించిన చరిత్ర ఆమెది.
విధి నిర్వహణలో ఆమె నిబద్ధతకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నిబందనలకు విరుద్ధంగా వ్యవహించరు, అవినీతిని దరి చేరనివ్వరన్న పేరు సృజనకు ఉంది. జీవీఎంసీ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రాజకీయ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఆమె సంయమనం పాటించారే తప్ప ఎక్కడా ధిక్కారం ప్రదర్శించలేదు. అలాంటి ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం తాజాగా బదిలీల్లో అక్కడి నుంచి మార్చేసింది.

వైసీపీ నేతలకు సింహస్వప్నం
వైజాగ్ లో అధికార వైసీపీ నేతలకు సృజన పేరు చెబితే చాలు భయపడే పరిస్ధితికి తెచ్చారు గుమ్మళ్ల సృజన. విధి నిర్వహణలో భాగంగా అధికార, విపక్షాలన్న తేడా లేకుండా ఆమె నిబంధనల్ని అమలు చేయడంతో విశాఖలో కార్పోరేటర్లు, ఇతర అధికారులకు చెమటలు పట్టేవి. ముఖ్యంగా అధికారులతో సంబధం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కార్పోరేటర్లకు ఆమె చుక్కలు చూపించారు. తమ విధుల్లో జోక్యం చేసుకునేందుకు రాజకీయ నేతల్ని అనుమతించే వారు కాదు. దీంతో వైసీపీ నేతలకు ఆమె కంటగింపుగా మారిపోయారు.

సాయిరెడ్డి, అవంతికి ఫిర్యాదుల వెల్లువ
కీలకమైన జీవీఎంసీ కమిషనర్ గా ఉంటూ రాజకీయ నేతల్ని తమ విధి నిర్వహణకు అఢ్డుపడకుండా నియంత్రిస్తూ, మరోవైపు నిబంధనలు పాటించేలా చేసేందుకు సృజన చేసిన ప్రయత్నాలు వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారిపోయాయి. దీంతో వారంతా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు స్ధానిక మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. దీంతో వారు కూడా సృజన తీరుపై ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు. అయినా విధి నిర్వహణలో ఆమెకున్న పేరును దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటిస్తూ వచ్చారు. మరోవైపు ఆమెను బదిలీ చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు.

ఎట్టకేలకు సృజన బదిలీ
నిబంధనల పేరుతో తమను అడుగడుగునా ఇబ్బందిపెడుతున్న సృజనను బదిలీ చేసేందుకు వైజాగ్ వైసీపీ నేతలు తీవ్రంగానే ప్రయత్నించారు. వీరికి స్ధానిక వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ సాయిరెడ్డి సహకారం కూడా తోడైంది. దీంతోఎట్టకేలకు వైసీపీ నేతల ఫిర్యాదులు ఫలించాయి. జీవీఎంసీలో సంస్కరణల్ని నిక్కచ్చిగా అమలు చేస్తూ, సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న గుమ్మళ్ల సృజనను ప్రభుత్వం తాజా బదిలీల్లో మార్చేసింది. జీవీఎంసీ కమిషనర్ పదవి నుంచి తప్పించి పరిశ్రమలశాఖ డైరెక్టర్ గా ఆమెను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో ఉన్నంతకాలం వైసీపీ నేతలకు చుక్కలు చూపించిన సృజన ఇప్పుడు పరిశ్రమల శాఖలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.