దేశ సామర్ధ్యం ప్రపంచానికి చాటింది- జాతీయ ఐక్యతా దినోత్సవం స్పెషల్ : ప్రధాని మోదీ..!!
టీకా పంపిణీ కార్యక్రమం దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని వంద కోట్ల వ్యాక్సినేషన్ ఘనత పైన స్పందించారు. వంద కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసిన తర్వాత భారత్.. కొత్త శక్తితో ముందుకెళ్తోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలందరికీ టీకా అందించే క్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్నీ విడిచిపెట్టలేదని కొనియాడారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఈ సారి అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవం గురించి ప్రస్తావించారు.
జాతీయ ఐక్యతను చాటే విధంగా..
ప్రజలందరూ దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా కనీసం ఒక్క పనైనా చేయాలని పిలుపునిచ్చారు.శాంతి కోసం కృషి..ప్రపంచ శాంతి కోసం భారత్.. విశేషంగా కృషి చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షక దళాలకు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని మోదీ తెలిపారు. మెరుగైన జీవన విధానం కోసం సంప్రదాయ పద్ధతిని పాటించేలా ప్రోత్సహిస్తోందని వివరించారు. మ హిళా పోలీసుల సంఖ్య పెరగడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.

వోకల్ ఫర్ లోకల్
2014లో లక్షా 5 వేల మందిగా ఉన్న ఈ సంఖ్య... 2.15 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో మరో సారి వోకల్ ఫర్ లోకల్ పాటించాలని సూచించారు. ప్రజలంతా 'వోకల్ ఫర్ లోకల్'ను పాటించి.. పండగ సమయంలో స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. డ్రోన్ల వ్యవస్థ పైన ప్రధాని వివరించారు. దేశ వ్యాప్తంగా డ్రోన్ల వినియోగం పెరిగిందని..దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొంద గలుతున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు.