క్రికెట్ ఆట - టెర్రర్ గేమ్ ఒకే సారి ఆడలేం : రాజధర్మానికి వ్యతిరేకం- బాబా రాందేవ్..!!
టీ20 ప్రపంచ కప్ లో మరి కాసేపట్లో కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు దుబాయ్ వేదికగా తల పడనున్నాయి. ఇప్పటికే క్రికెట్ మేనియాతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారు. అయితే, ఈ మ్యాచ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇద సమయంలో కొద్ది రోజులుగా ఈ మ్యాచ్ పైన భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఐఎం అధినేత అసద్... కేంద్ర మంత్రులు కొందరు పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.

రాందేవ్ బాబు కీలక వ్యాఖ్యలు
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పైన వారు ప్రతికూలంగా స్పందించారు. దీని పైన కేంద్రం స్పందించకపోయినా..బీసీసీఐ స్పందించింది. ఇక, ఇప్పుడు తాజాగా యోగా గురువు బాబా రామ్‌దేవ్ రియాక్ట్ అయ్యారు. ఈ మ్యాచ్ దేశ ప్రయోజనాలకు..రాజ ధర్మానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితిలో క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజధర్మానికి వ్యతిరేకమని చెబుతూ... ఇది దేశ ప్రయోజనాల కోసం ఆడుతున్నది కాదన్నారు.

రెండు ఆటలు ఒకే సారి ఆడలేమంటూ
క్రికెట్ ఆట..టెర్రర్ గేమ్‌ని ఒకేసారి ఆడలేమంటూ రాం దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాలపైనా బాబా రామ్‌దేవ్ స్పందించారు. దేశంలోని యువతరానికి ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘మాదకద్రవ్య వ్యసనం గ్లామరైజ్ చేసే విధానం. రోల్ మోడల్స్, ఆదర్శాలు లేదా చిహ్నాలుగా పరిగణించే ప్రముఖులు ఈ కుట్రలో పాలుపంచుకోవడం ప్రజలకు తప్పుడు స్ఫూర్తిగా అభిప్రాయపడ్డారు. ఈ గందరగోళం నుంచి చిత్ర పరిశ్రమను క్లియర్ చేయాని వ్యాఖ్యానించారు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపైనా బాబా రామ్‌దేవ్ మాట్లాడారు.

పన్నుల విధింపు పైనా సూచనలు
నల్లధనాన్ని దేశానికి రప్పించడం వల్ల ఇంధన ధరలు తగ్గుతాయని చెప్పారు. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధర ఉండాలన్నారు. తక్కువ పన్ను విధించాలని ప్రభుత్వానికి సూచించారు. జాతీయ ప్రయోజనాల కోసం సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగించాల్సి ఉందటుందని రామ్ దేవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఈ కారణాల వల్ల ప్రభుత్వం పన్నులను తగ్గించలేకపోతుందని చెప్పారు. అయితే ఈ కల ఏదో ఒక రోజు నెరవేరుతుందని ఆయన అన్నారు.

మ్యాచ్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు
ఎంత మంది ప్రముఖులు ఎన్ని రకాలుగా స్పందించినా.. ఈ సాయంత్రం జరిగే భారత్ - పాక్ మ్యాచ్ పైన మాత్రం ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు కోసం అనేక ప్రాంతాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా బార్లు..రెస్టారెంట్స్ లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసారు. గతంలో ప్రపంచ కప్ వేదికల పైన పాకిస్థాన్ ను ఓడించిన ట్రాక్ రికార్డు కొనసాగుతుందనే అంచనాలు భారత్ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే, పాకిస్థానం కెప్టెన్ మాత్రం అది చరిత్ర అని.. ఇప్పుడు కొత్త రికార్డు క్రియేట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.