రేవంత్ -ఈటల రహస్య భేటీ : ఒప్పందం ఇదే -సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి : కేటీఆర్ సంచలనం..!!
హుజూరాబాద్ బై పోల్ లో రెండు జాతీయ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని తెలంగాణ మంత్రి..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గోల్కొండ రిసార్ట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్ రహస్యంగా కలుసుకున్నారని చెప్పారు. ఈటల రాజేందర్‌ను గెలిపించడం కోసం కాకుండా, టీఆర్‌ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఒక ఇంటర్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రహస్య భేటీ జరగలేదని వారు ఖండిస్తే ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా ఇస్తామని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కదు
ఆ భేటీలో జరిగిన నిర్ణయం మేరకే గుర్తించని అనామకుడిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పుకొచ్చారు. చేతనైతే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి సవాలు చేసారు. నాగార్జునసాగర్‌లో బీజేపీకి డిపాజిట్ దక్కనట్లే, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పుట్టిన పార్టీలు కేసీఆర్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, షర్మిల హుజూరాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

గాంధీభవన్‌లో గాడ్సే దూరాడంటూ
టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును ఒక పథకం ప్రకారం చీల్చేందుకు ఢిల్లీ పార్టీలు చేస్తున్న పన్నాగాల్లో వీళ్లు పాచికలంటూ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పటం హాస్యాస్పదమన్నారు. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్ అన్నారని గుర్తు చేసారు. సీనియర్లను పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్న ‘గట్టి అక్రమార్కుడు' అంతా నడిపిస్తున్నాడని విమర్శించారు.

ఈటల విషయంలో చట్టం తన పని తాను..
టీఆర్‌ఎస్ నేతల అక్రమ చిట్టా అంటూ బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐని వాళ్లు ఎలా వాడుకుంటున్నారో దేశమంతా చూస్తోందన్నారు. ఇలాంటి వాటికి తాము భయపడమని... ఏం చేసుకుంటారో చేసుకోండి.. చూస్తామని స్పష్టం చేసారు. ఈటల తప్పుచేయక పోతే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర సీఎంను దూషించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూస్తున్నారని అక్కడి పరిణామాలను ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి పైన ఆ బూతులేంటి..
తెలంగాణ కూడా సీఎంను పట్టుకుని కొందరు 420 గాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసారు. రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలన్నారు. తాజాగా ఏపీలో జరిగిన సంఘటన పైన స్పందించారు. ఒక సీఎంని పట్టుకుని ఆ బూతులేంటని ప్రశ్నించారు. అక్కడ టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడులు ఎవరు చేశారు అనేది పక్కన పెడితే.. దానికి మూలం ఎక్కడుందో చూడాలన్నారు. రాజకీయాల్లో ఎందుకు అసహనం అంటూ ప్రశ్నించారు. నువ్వు రాజకీయాల్లో ఓడిపోయావు.. సహనం పాటించమని పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి సూచించారు.

టీడీపీ అక్కడ అధికారం పోయింది..ఇక్కడ
ఐదేళ్ల తర్వాత మళ్లీ జనం వద్దకు వెళ్లు.. బ్రతిమిలాడుకో.. నీకు ఎందుకు ఓటు వేయాలో వివరించు.. అంతే తప్ప దుగ్ధ ఎందుకని వ్యాఖ్యానించారు. టీడీపీకి అక్కడ అధికారం పోయింది.. ఇక్కడ అంతర్థానమైందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేండ్లు కాదు.. ఇరవై ఏండ్లు ఉండాలన్నదే తమ కల అని చెప్పారు. రేవంత్‌రెడ్డి చెప్పినా సరే.. ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసారు. డీఎంకే తరహాలో ఏడెనిమిది దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా ఉండేలా టీఆర్‌ఎస్ పార్టీని నిర్మించుకునే దిశగా ముందుకు సాగుతామన్నారు. రాబోయే 6 నుంచి 9 నెలల పాటు చురుకుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ వివరించారు.