జగన్ ను ఏమైనా అంటే చంద్రబాబును, అయ్యన్నపాత్రుడిని గుండెల మీద తంతా: గుడివాడ అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శల డోసు మరింత పెరిగింది. తంతాం, కొడతాం, తాటతీస్తామంటూ నేతలు మాటలు జారుకున్నారు. మీరంత.. మీ బతుకెంత అంటూ విరుచుకుపడుతున్నారు. టిడిపి నేతలు సవాల్ చేస్తుంటే, వైసీపీ నేతలు ప్రతి సవాల్ చేస్తున్నారు. మగాళ్ళయితే తేల్చుకుందాం రమ్మని టిడిపి నేతలు, తాము మగాళ్లతోనే కొట్లాడతాం, అటు ఇటు కాని వాళ్లతో యుద్ధం చెయ్యమని చెప్తూ వైసీపీ నేతలు రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు.
ఏపీలో ముందుముందు ముష్టి యుద్ధాలేనా? రాం గోపాల్ వర్మ షాకింగ్ పోస్ట్ లో చెప్పిందే జరుగుతుందా?

ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య సాగుతున్న సవాళ్ళ పర్వం
ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన, నోటికొచ్చినట్టు బూతులు తిట్టిన పట్టాభిని, పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించిన చంద్రబాబును అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో వైసిపి గుండాల దాడుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇదే సమయంలో టిడిపి నేతలు దేవాలయం లాంటి టిడిపి కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. పోలీసుల అండతో ఆఫీసుల మీద దాడి చేయటం కాదు అని మండిపడుతున్న టిడిపి నేతలు వైసీపీ నేతలకు దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్ విసురుతున్నారు.

అయ్యన్నపాత్రుడు వర్సెస్ గుడివాడ అమర్నాథ్
టిడిపి పార్టీ ఆఫీస్ పై దాడి పై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా కొలిచే టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి వైసిపి భయానికి పరాకాష్ఠ పేర్కొన్న ఆయన అధికారమనే బలుపుతో వచ్చి మా కార్యాలయాలపై దాడులు చేశారు కదా.. అధికారం మత్తు దిగుతుంది అప్పుడు మా బిపి ఎలా ఉంటుందో చూపిస్తాం వైయస్ జగన్ అంటూ విరుచుకుపడ్డారు. ఇక తాజాగా గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపైనా అయ్యన్న కౌంటర్ వేశారు. చంద్రబాబు కాలు అంత లేడు.. చంద్రబాబును ఇంటికెళ్ళి తంతా అని చెప్తున్నాడు అంటూ అయ్యన్న ఎద్దేవా చేశారు. చంద్రబాబు దాకా ఎందుకు... నువ్వు నేను తేల్చుకుందాం రా అంటూ గుడివాడ అమర్నాథ్ కు సవాల్ విసిరారు.

చంద్రబాబు దాకా ఎందుకు నువ్వు నేను తన్నుకుందాం రా అంటున్నాడు అయ్యన్న
ఇక మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. నాతో తగువుకు అయ్యన్న సిద్ధం అంటున్నాడు. డేటు టైము నీ ఇష్టమే.. అనకాపల్లి నెహ్రూచౌక్ కి వచ్చినా, నర్సీపట్నం అభి సెంటర్ కు రమ్మన్నా నేను సిద్ధమంటూ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరోమారు ముఖ్యమంత్రిపై నోరు జారి మాట్లాడితే చంద్రబాబు ఇంటికెళ్లి మరీ తంతామని, ఇక ఈ మాట అంటే అయ్యన్నపాత్రుడుకి బాగా కోపం వస్తుందని , చంద్రబాబు దాకా ఎందుకు నువ్వు నేను తన్నుకుందాం రా అని పిలుస్తున్నాడు అంటూ గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబును,అయ్యన్నపాత్రుడుని గుండెల మీద తంతా
తాను చంద్రబాబు కాలు అంతా కూడా ఉండనని అయ్యన్నపాత్రుడు చెబుతున్నాడని పేర్కొన్న అమర్నాథ్ నా కాలు సైజు దగ్గర్నుండి అయ్యన్న చూసినట్లు లేడు మరోసారి ముఖ్యమంత్రి ని ఏమన్నా అంటే చంద్రబాబును, అయ్యన్నపాత్రుడుని గుండెల మీద తంతానంటూ గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అప్పుడు నా కాలు సైజు ఎంతో అయ్యన్నపాత్రుడుకి తెలుస్తుంది అంటూ గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిట్టుకోవడం నుండి తన్నుకుందాం రా అనే దాకా వెళ్లాయి. ముందు ముందు ఇంకెలా మారుతాయో అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలను ఆందోళన కలిగిస్తుంది.