చంద్రబాబు 36 గంటల దీక్షను మూడు ముక్కల్లో తేల్చేసిన పేర్ని నాని: అమిత్‌షా కాళ్లు పట్టుకోవడానికా
అమరావతి: తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనలకు పోటీగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి 36 గంటల దీక్ష కొనసాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు దీనికి సంఘీభావాన్ని ప్రకటించారు.

కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా, దోపిడీ
ఈ దీక్షపై రవాణాశాఖ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. చంద్రబాబే తన మనుషులతో ముఖ్యమంత్రిని బూతులతో తిట్టించి.. మళ్లీ ఆయనే నిరసన దీక్ష చేపట్టడం వింతల్లో కెల్ల వింతగా అభివర్ణించారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలు, కుతంత్రాలేనని అన్నారు. మోసం, దోపిడీ, దగా, దౌర్జన్యంతో నిండిపోయిందని, ఎంతటి నీచానికైనా ఒడిగట్టే మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. చంద్రబాబు దీక్ష ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బూతులను సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా..? అంటూ నిలదీశారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని డబ్బా కొట్టుకోవడం కాదు..
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని డబ్బాకొట్టుకునే చంద్రబాబు రాజకీయ జీవితంలో నక్క వినయాలు, కొంగ జపాలు, దొంగ మాటలు తప్ప ఇంకేమీ లేవని పేర్నినాని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో తన మనుషులతో తిట్టించి, మళ్లీ తానే దీక్ష చేయడం నక్క వినయానికి నిదర్శనమని అన్నారు. పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ముంచడానికి ఎవరూ అక్కర్లేదని నారా లోకేశ్ చాలని ఎద్దేవా చేశారు.

ప్రజలను మళ్లీ మోసగించడానికే..
36 గంటల దీక్ష అని దొంగ జపాన్ని మొదలుపెట్టాడని, ప్రజలను మరోసారి మోసగించడానికే ఈ నాటకం ఆడుతున్నాడని విమర్శించారు.74 ఏళ్ల చంద్రబాబు జీవితంలో కుట్రలు, కుతంత్రాలు, ఏమార్చడాలు, మనుషులను కొనుగోలు చేయడాలు, చెప్పిన అబద్ధం చెప్పకుండా నమ్మించి మోసం చేయడం, కనురెప్ప వేసి తెరిచేలోపు ఆకృత్యాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. బీజేపీకి దగ్గర కావడానకే ఇలాంటి కుటిల ప్రయత్నాలకు మళ్లీ తెరతీశారని అన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని తిడతారా?
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నేర్చుకున్నది కోట్లాదిమంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని హేయమైన పదజాలంతో దూషించడం మాత్రమేనని పేర్ని నాని అన్నారు. రాయడానికి కూడా వీల్లేని పదజాలంతో ముఖ్యమంత్రిని తిట్టిన పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకోకుండా.. ఆ బూతులను సమర్థిస్తూ దీక్ష చేయడాన్ని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేర్పించిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం పాలన సాగిస్తోండటం వల్లే తండ్రీకొడుకుల ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయని అన్నారు.

ఎవరి కాళ్లు పట్టుకోవడానికి..
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో తన మనుషులతో మాట్లాడించి.. అల్లరు, అలజడులను సృష్టించింది చాలక చంద్రబాబు ఆర్టికల్ 356 కోసం డిమాండ్ చేయడం చూస్తోంటే.. బీజేపీకి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఎవరి కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నాడని నిలదీశారు. అమిత్‌షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెడ్ ప్లస్ కేటగిరితో తిరుపతికి వస్తే ఆయన కారును అల్లరిమూకలతో ధ్వంసం చేయించినప్పుడు 356 పెట్టాలని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

ముసలి జంబూకం..
ముసలి జంబూకం లాంటి చంద్రబాబు సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో 356ను అమలు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండంటూ అప్పుడు ఎందుకు మోడీని అడగలేదని నిలదీశారు. అమిత్‌షా దగ్గరకువెళ్తే నోట్లో గడ్డిపెట్టడా? అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వినాశనమే లక్ష్యంగా ఉద్భవించిన తెలుగుదేశం పార్టీని, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన నాటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. చంద్రబాబు అదే కాంగ్రెస్‌కు పార్టీని తాకట్టు పెట్టాడని విమర్శించారు.

నాటి సూక్తులు ఏమయ్యాయి బాబు..
2016లో ప్రజాసంఘాలన్నీ కలిసి ప్రత్యేక హోదా కావాలని బంద్ ప్రకటిస్తే.. రాష్ట్రంలో ఉత్పాదకత తగ్గిపోతుందని, చెడు ముద్రపడుతుందని, దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీకి వెళ్లి బంద్ చేయాలంటూ చంద్రబాబు ఎద్దేవా చేశాడని, ఇప్పుడు అదే చంద్రబాబు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం ద్వంద్వ విధానానికి నిదర్శనమని పేర్నినాని అన్నారు. ప్రజలు బంద్ చేస్తే జైళ్లో పెట్టండంటూ పోలీసులను ఆదేవించిన చంద్రబాబు నీతి సూక్తులు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఛీ కొట్టినా..
2019 ఎన్నికల్లో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఛీ కొట్టి 23 సీట్లకు పరిమితం చేశారని, అయినా కుట్ర రాజకీయాలను మానుకోవట్లేదని అన్నారు. ఎంసీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చివాతపెట్టారని, మున్సిపాలిటీల్లోనూ వాతపెట్టి పంపించారని గుర్తు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అట్లకాడతో వాతపెట్టారని పేర్ని నాని అన్నారు. ఇవాళ బంద్‌కు పిలుపునిస్తే కనీసం ఒక్క సానుభూతిపరుడు కూడా తమ దుకాణాలను మూసివేయలేదని చెప్పారు. ఆఖరికి చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ హెరిటేజ్ కూడా మూత పడలేదని అన్నారు. ప్రజల్లో చంద్రబాబు పరపతి చనిపోయిందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలని పేర్నినాని చెప్పారు.

టీడీపీలో ఉన్నదంతా దెయ్యాలే..
వెనుకబడిన తరగతులకు వైఎస్ జగన్ వెన్నుముకగా ఉన్నారని, వారుకూడా ముఖ్యమంత్రికి అండగా నిలిచారని పేర్ని నాని అన్నారు. 2024లో కూడా చంద్రబాబుకు ఇదే దుస్థితి దాపరించబోతుందని జోస్యం చెప్పారు. బంద్‌లో ప్రజలు పాల్గొనకపోవడం, కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలపై తిరగబడటం ఇవన్నీ టీడీపీ స్థాయి ఏంటో తేల్చేశాయని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని, సిద్ధాంతాలు లేని దిక్కుమాలిన రాజకీయాలు చేసేది చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ తప్ప మరొకటి లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి లాక్కున్నతరువాత నీ పార్టీలో ఉన్నదంతా దెయ్యాలేనని పేర్కొన్నారు.