టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ: నారా లోకేష్‌తో భేటీ: సంఘీభావం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మినేని పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించిన అనంతరం నెలకొన్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఒకవంక.. టీడీపీ నాయకులు పిలుపునిచ్చిన ఆందోళనలు, రాష్ట్ర బంద్ మరోవంక ఉద్రిక్తతలకు దారి తీశాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలో గల తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపైనా వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేశారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. ఈ దాడుల సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్క్ చేసి ఉంచిన వాహనాలు, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. పోలీసుల సమక్షంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ దాడులకు తెగబడ్డారని మండిపడుతున్నారు. పోలీసు వ్యవస్థను అధికార పార్టీ నిర్వీర్యం చేసిందని విమర్శిస్తున్నారు.

ఈ ఉదయం నారా లోకేష్.. పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన నేరుగా మంగళగిరికి చేరుకున్నారు. ధ్వంసమైన గదులను పరిశీలించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, ఇతర నాయకులు ఆయన వెంట ఉన్నారు. దాడి వివరాలను నారా లోకేష్‌కు వివరించారు.

ఆ కొద్దిసేపటికే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ- తన అనుచరులతో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. నారా లోకేష్.. ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. దాడి చోటు చేసుకున్న ప్రదేశాన్ని, దానికి సంబంధించిన సమాచారాన్ని దగ్గరుండి వివరించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భౌతికదాడులు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే ప్రయత్నమని, ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. (2/2) pic.twitter.com/ofXwAqvyys
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) October 20, 2021
మరోవంక టీడీపీ-వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంటోంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత దూషణలకు దారి తీస్తున్నాయి. దీనితో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన ప్రదర్శనల సందర్భంగా పట్టాభిరామ్ నివాసం ధ్వంసమైందని, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.