అగ్రిగోల్డ్ సాయంతో జగన్ కొత్త ట్రెండ్- హైకోర్టు ఆదేశాలతో చెల్లింపులు-పథకాల్లా ప్రచారం
ఏపీలో ఇవాళ ఉదయాన్నే ప్రధాన వార్తాపత్రికలు తిరగేసిన వారికి ఓ భారీ ప్రకటన దర్శనమిచ్చింది. అందులో సీఎం జగన్ బొమ్మతో పాటు అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం సాయంతో చరిత్ర సృ,ష్టించబోతోందన్న ప్రచారం కనిపించింది. గత రెండేళ్లుగా నిత్యం ఏదో ఒక పథకం డబ్బులు విడుదల చేస్తూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ సర్కార్ పథకమేమో అన్నట్లు దీన్నీ కొందరు భావించారు. మరికొందరు అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా సాయం అందుతుందని సంతోషించారు. అసలు బాధితులైతే తమ పోరాటం ఫలించిందని సంబర పడుతున్నారు. దీంతో సీఎం జగన్ తాను అనుకున్న ఫలితం రాబడుతున్నట్లు కనిపిస్తోంది.

అగ్రిగోల్డ్ బాధితుల వ్యధ
ఏపీలో గత టీడీపీ సర్కార్ హయాంలో ఆర్దిక అక్రమాలతో కుదేలైన అగ్రిగోల్డ్ సంస్ధ తమపై ఖాతాదారులు పెట్టుకున్న నమ్మకాన్ని నిండా ముంచింది. బాధితులకు సాయం చేసేందుకు కోట్లాది రూపాయలు ఆస్తులు కనిపిస్తున్నా చట్టపరమైన అడ్డంకులు ఉండటంతో వారికి న్యాయం జరగలేదు. దీంతో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు అనారోగ్యం పాలై చనిపోయారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఇదో వ్యధగా మిగిలిపోయింది. ఈ సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ తాము అధికారంలోకి రాగానే బాధితుల్ని ఆదుకుంటామని ముందుకొచ్చింది. అంతే కాదు అగ్రిగోల్డ్ పోరాటం కోసం బాధితుల కమిటీలకు పోటీగా.. వైసీపీ తరఫున కూడా కమిటీలు నియమించింది.

అగ్రిగోల్డ్ పోరులో వైసీపీ
అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు, వారి తరఫున పోరాడేందుకు కమ్యూనిస్టులు ముందుగా రంగంలోకి దిగారు. దీంతో విపక్షంలో ఉన్న వైసీపీ కూడా మైలేజ్ కోసం వారితో కలిపి మొదట్లో పోరాటాలు చేసింది. ఆ తర్వాత ఎలాగో వచ్చేది తమ ప్రభుత్వమే అని తేలిపోవడంతో వారికి న్యాయం జరిగితే తమ ఖాతాలోకి వేసుకోవాలన్న ఆశతో వైసీపీ తరఫునే అగ్రిగోల్డ్ పోరాట కమిటీలు ఏర్పాటు చేసింది. జిల్లాకో కమిటీ తరఫున వేసి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అందేలా చూస్తామని హామీలు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని పదే పదే చెప్పినా చేసింది మాత్రం గోరంతే. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు పోరుకు సిద్ధమయ్యారు. హైకోర్టులో కేసులు వేయడంతో పాటు వీధి పోరాటాలకు కూడా దిగారు.

వైసీపీ సర్కార్ లో చెల్లింపులు
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల జాతర మొదలుపెట్టేసింది. దీంతో ప్రభుత్వానికి తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో గతంలో తమకు ఇచ్చిన హామీ నెలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులు వీధి పోరాటాలకు దిగడం మొదలుపెట్టారు. చివరకు హైకోర్టులోనూ వారు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు అగ్రిగోల్డ్ బాధితులకు ఆస్తులు అమ్మి చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల్ని అమలు చేసే క్రమంలో వైసీపీ సర్కార్ తొలి విడతలో రూ.10 వేల కంటే తక్కువ డిపాజిట్లు చేసిన వారికి చెల్లింపులు చేసింది. ఆ తర్వాత మరో విడతలో రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న వారికి చెల్లింపులు చేస్తామని చెప్పింది. కానీ ఆ చెల్లింపులు జరక్కపోవడంతో నిన్న మొన్నటి వరకూ ఆగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. చివరికి చెల్లింపులకు సర్కార్ సన్నద్దమైంది. ఇవాళ ఆ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయం నుంచే చెల్లింపుల్ని ప్రారంభించారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత సాయం అందుతున్నట్లయింది.

సంక్షేమ పథకాన్ని తలపించేలా
అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాల ప్రకారం రెండో విడత సాయం చేయాలని నిర్ణయించిన వైసీపీ సర్కార్.. ఈ చెల్లింపుల్ని కూడా ఏడాది పొడవునా జరిపే సంక్షేమ పథకాల తరహాలోనే మార్చేసింది. సంక్షేమ పథకాలకు క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ప్రారంభించే సీఎం జగన్ ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల సాయాన్ని కూడా ఇదే తరహాలో విడుదల చేశారు. అంతకు ముందే ప్రధాన వార్తాపత్రికల్లో అగ్రిగోల్డ్ సాయాన్ని కూడా కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లుగా భారీగా ప్రకటనలు కూడా ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సాయం కాస్తా మరో ప్రభుత్వ పథకంగా జాబితాలోకి చేరిపోయింది. ఇవాళ చెల్లింపులపై స్పందించిన సీఎం జగన్, మంత్రులు అగ్రిగోల్డ్ సాయంతో ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. దీంతో విపక్షాలు ఈ వ్యవహారంపై విమర్శలు మొదలుపెట్టేశాయి.

జగన్ కొత్త ట్రెండ్ పై చర్చ
ఏ రాష్ట్రంలో అయినా సంక్షేమ పథకాల ప్రకటన, అమలును ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం సహజమే. కానీ ఏపీలో వైసీపీ సర్కార్ మాత్రం హైకోర్టు ఆదేశాలతో అమలు చేస్తున్న సాయం విడుదలను కూడా సంక్షేమ పథకంలా ప్రచారం చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టించిందని విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులకు సాయం విడుదల ను కూడా తమ ప్రచారానికి వాడేసుకుంటున్న సీఎం జగన్ కొత్త ట్రెండ్ పై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇకపై రోడ్డు ప్రమాదాల్లో బాధితుల్ని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సాయాన్ని కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటారా అని విపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా జగన్ సృష్టించిన కొత్త ట్రెండ్ పై మాత్రం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకెన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందో చూడాలంటున్నారు.