విజయవాడలో మహిళా సీఏ ఉద్యోగిని అనుమానాస్పద మృతి: ప్రియుడే హంతకుడా?
అమరావతి: విజయవాడలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, ఆమెను ఆమె ప్రియుడే హత్య చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరిచయం ప్రేమగా మారడంతో..
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజుపాలేనికి చెందిన చెరుకురి సింధు(29) సీఏ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం క్రితం విజయవాడ సమీపంలో పోరంకికి చెందిన కే ప్రసేన్(అభి)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అయిేత, సింధు, ప్రసేన్ వివాహానికి ఇరుకుటుంబాలవారు అంగీకరించలేదు. ఈ క్రమంలో గత సంవత్సరం లాక్‌డౌన్ కాలం నుంచి సింధు గంగిరెద్దుల దిబ్బలోని ప్రసేన్ కుటుంబానికి చెందినర మరో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.

గాయాలతో విగతజీవిగా పడివున్న సింధు
రెండు రోజుల నుంచి సింధుకు ఆమె తల్లి ఫోన్ చేస్తుండగా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో ఆమె ప్రసేన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ క్రమంలో ప్రసేన్.. సింధు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్గగా ఎంతసేపటికీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా గదిలో గాయాలతో సింధు విగత జీవిగా పడివుంది. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ప్రసేన్. తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. ఘటనపై మాచవరం పోలీసులకు సమాచారం అందించారు.

సింధు ప్రియుడే హంతకుడా?
మృతురాలు సింధు తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రసేన్ మోసం చేశాడని సింధు తల్లిదండ్రులు ఆరోపించారు. కుటుంబసభ్యులతో కలిసి అతడే సింధును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని అన్నారు. ప్రసేన్ మరొకరితో వివాహేతర సంబందం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. గురువారం రాత్రి హత్య చేసివుంటారని సింధు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ప్రసేన్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సింధు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు నదిలో పడి ఓ వ్యక్తి మృతి
ఇది ఇలావుండగా, కృష్ణా నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యాధరపురం కబేళా సెంటర్ వద్ద నేరెళ్ల ఆంజనేయులు(40) తన భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. 11 నెలల క్రితం తల్లి వెంకట సుబ్బారత్నం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల మాసికం పెట్టేందుకు కృష్ణా నది వద్దకు వెళ్లున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం దుర్గాఘాట్ వద్ద మాసికం పెట్టేందుకు సోదరుడితో కలిసి వెళ్లారు. అక్కడ నీరు మురికిగా ఉండటంతో వారిద్దరూ పున్నమి వద్దకు బయల్దేరారు. మార్గమధ్యలో ఆయన సోదరుడు ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం కుటుంబసభ్యులు ఆంజనేయులుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో పున్నమిఘాట్ వద్దకు వెళ్లగా ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కనిపించాయి. వెంటనే దగ్గరలోని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నదిలో గాలించి ఆంజనేయులు మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.