ఇండియాలో కరోనా క్షీణత : 34,457 కొత్త కేసులు, 375 మరణాలు, కేసుల నమోదులో టాప్ 10 రాష్ట్రాలివే
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా ఇండియాలో 30 వేలు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కాస్త కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తుంది. తాజాగా 5.7 శాతం మేర కొత్త కేసులు తగ్గినట్లుగా సమాచారం. భారతదేశంలో గత 24 గంటల్లో 34,457 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 400 దిగువకు మరణాలు నమోదయ్యాయి.

గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు .. 375 మృతి
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3.23 కోట్ల మార్కును దాటగా, క్రియాశీల కేసులు 3,61,340 గా నమోదయింది. గత 24 గంటల్లో 375 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన మరణాల సంఖ్య 4.33 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 36 వేల మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ ను జయించిన వారి సంఖ్య 3.15 కోట్లుగా నమోదయింది.

క్రియాశీల కేసుల రేటు 1.12 శాతం
నిన్న ఒక్క రోజే కరోనా నిర్ధారణ పరీక్షలను 17,21,205 మందికి నిర్వహించారు. ఇదిలా ఉంటే క్రియాశీల కేసుల రేటు 1.12 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.54 శాతంగా ఉంది. మరోపక్క నిన్న ఒక రోజు 36.36 లక్షల మంది కరోనా ను నియంత్రించడానికి కోవిడ్ వాక్సినేషన్ చేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పంపిణీ అయిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 57,61,17,350 కి చేరుకుంది. ఇక వివిధ రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే నమోదైన కరోనా కేసులు వివరాలు చూస్తే టాప్ 10 రాష్ట్రాలుగా నిన్న నమోదైన రాష్ట్రాలలో పరిస్థితి ఇలా ఉంది.

కేరళలోనే రోజువారీ కేసులు ఎక్కువ ..గత 24 గంటల్లో రోజువారీ కేసుల్లో టాప్ 10 కేసులివే
దేశంలోనే అత్యధికంగా రోజువారి కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,224 కరోనా కేసులు నమోదయ్యాయి, 99 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 4,365 కరోనా కేసు నమోదు కాగా 105 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 1,668 మందికి కరోనా సోకగా 24 మంది కరోనా కారణంగా మృతి చెందారు . కర్ణాటక రాష్ట్రంలో 1,453 కరోనా కేసు నమోదు కాగా 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1435 మంది కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు.

టాప్ 10 లో ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు
తర్వాతి స్థానంలో ఒడిశా నిలిచింది. ఒడిశా రాష్ట్రంలో 986 కరోనా కేసులు నమోదు కాగా 69 మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఆపై అస్సాంలో 708 కరోనా కేసులు నమోదయ్యాయి, 13 మంది మరణించారు. తర్వాతి స్థానంలో మిజోరాంలో 522 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు మహమ్మారికి బలయ్యారు. ఆ తర్వాత మణిపూర్లో 372 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. ఆపై తెలంగాణ రాష్ట్రంలో 359 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. టాప్ 10లోనే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలున్నాయి.