శాంతి మాంఝి ఈ జనవరి లో మొదటిసారి అమ్మమ్మ అయింది. ఆమె వయస్సు 36 ఏళ్ళు. కానీ అదే రోజు రాత్రి ఆమె ఇంకొక పని మొదటిసారి చేసింది. రెండు దశాబ్దాలలో ఏడుగురు పిల్లలను ఒక డాక్టర్ గాని నర్స్ గాని లేకుండా ఇంటిలోనే ప్రసవించిన ఈ గట్టి మహిళ, ఈ సారి మాత్రం ఆసుపత్రికి వచ్చింది.

“నా కూతురు గంటల తరబడి నొప్పులు భరించింది కానీ గర్భంలో శిశువు బయటకు రాలేదు. అందుకని ఒక టెంపో ని పిలిపించాము.” ఆమె పెద్ద కూతురు మమతకి ఇంట్లోనే నొప్పులు మొదలైనప్పుడు అన్నదామె. టెంపో అంటే ఒక మూడు చక్రాల బండి, ఇది ఆమె గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న షియోహార్ పట్టణం నుండి ఆమె ఇంటికి రావడానికి ఒక గంట సమయం తీసుకుంది. మమతను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తరవాత ఎన్నో గంటలకు ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది.

“అతను 800 తీసుకున్నాడు”, శాంతి గుర్రుమంది. ఆమె ఇంకా టెంపోకి అయిన ఖర్చు గురించి కోపంగా ఉంది. “మా టోల (గ్రామం) లో ఎవరూ ఆసుపత్రికి వెళ్లరు. అసలు మాకు అంబులెన్సు అనేది ఉంటుందని కూడా తెలీదు.”

శాంతి ఆ రాత్రి ఇంటికి రావలసి వచ్చింది. ఆమె నాలుగేళ్ల చిన్నబిడ్డకు నిద్రపోయే లోపల ఏమన్నా తినిపించాలి. “నేనొక అమ్మమ్మని అయ్యాను.” అన్నదామె. “కానీ నాకు అమ్మ బాధ్యతలు కూడా ఉన్నాయి.” మమత, కాజల్ కాకుండా ఆమెకు ఇంకా ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.

మాంఝి కుటుంబం, ఉత్తర బీహార్ లోని  షియోహార్ జిల్లా, అదే బ్లాక్ లో, మధోపూర్ అనంత్ గ్రామంలోని కిలోమీటర్ దూరంలో గుంపుగా ఉన్న గుడిసెల మధ్య  ముసహర్ టోల అనే ప్రదేశం లో ఉంటారు. టోల లో దగ్గరగా 40 మట్టి, వెదురు ఇళ్లలో 300-400 మనుషులు ఉంటారు. అందరూ ముసహర్ కులానికి చెందినవారు. వీరు మహాదళిత్ వర్గం వారు- బీహార్ లో వీరిని అట్టడుగు వర్గానికి చెందినవారిగా పరిగణిస్తారు. వీరు తమ ఇరుకైన ఇళ్లల్లో ఒక మూల కొన్ని మేకలను, ఆవునూ కట్టేస్తారు.

PHOTO • Kavitha Iyer

శాంతి తన ఏడుగురు పిల్లలలో నలుగురితో (అమ్రిత, సయాలి, సాజన్, అరవింద్): వీరంతా ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లొనే పుట్టేసారని ఆమె అంటుంది

శాంతి అప్పుడే టోల కు ఒక చివరన ఉన్న బోరింగ్ పంప్ నుండి ఒక ఎర్ర ప్లాస్టిక్ బకెట్ తో నీళ్లు తీసుకుని వచ్చింది. అప్పటికే ఉదయం 9 గంటలైంది. ఆమె తన ఇంటి బయట ఉన్న సన్నని దారిలో నిలబడి ఉంది. ఆమె ఇంటి పక్కవారి ఆవు రోడ్ పక్కనే సిమెంట్ తో కట్టిన చిన్న హౌజులో నీళ్లు తాగుతోంది. ఆమె తన స్థానిక భాష లో మాట్లాడుతూ, తన కాన్పులకు ఏ ఇబ్బంది కలగలేదని అంటుంది : సాత్ గో లేదా ఏడు కాన్పులు, ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండానే జరిగాయి.

ఆమె పేగు ఎవరు కోశారని అడిగితే, “మేరీ దేయాదీన్ ”, ఆమె భుజాలు ఎగరేసి చెప్పింది. దేయాదీన్ అంటే భర్త సోదరుడి భార్య. పేగు కత్తిరించడానికి ఏమి వాడేవారు?  ఆమె తల అడ్డంగా ఊపి, తనకు తెలీదని చెప్పింది. టోల లో ఉన్న 10-12 మంది ఆడవాళ్లు చుట్టూ చేరి ఇంట్లో ఉన్న కత్తిని కడిగి వాడతారని చెప్పారు - అది పెద్దగా ఆలోచించే విషయం కాదని  అందరూ అనుకున్నారు.

ముసహర్ అనంత్ టోల లో చాలా మంది ఆడవారికి ఈ పద్ధతిలోనే వారి ఇళ్లలో కాన్పులు జరిగాయి. కానీ కొందరు మాత్రం ఆ సమయంలో ఇబ్బందులు రావడం వలన ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఆ కుగ్రామంలో నైపుణ్యంగా కాన్పులు చేయగలిగిన వారెవరు లేరు. చాలామంది ఆడవారికి కనీసం 4-5 పిల్లలు ఉన్నారు, వారికి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్(PHC) ఎక్కడ ఉందో తెలీదు, కాన్పులు అక్కడ చేస్తారనీ తెలీదు.

ప్రభుత్వం నడిపే ఆసుపత్రి గురించి, గ్రామ ఆరోగ్య కేంద్రం గురించి అడిగితే “నాకు సరిగ్గా తెలీదు”, అన్నది శాంతి,.  68 ఏళ్ళ బాగులనీయ దేవి మధోపూర్ అనంత్ లో కొత్త క్లినిక్ గురించి తాను విన్నానని చెప్పింది. “కానీ నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ మహిళా డాక్టర్ ఉంటుందో లేదో తెలీదు.” అని చెప్పింది 70  ఏళ్ళ శాంతి చూలై మాంఝి. పైగా టోల లో మహిళలకి ఎవరు ఎన్నడూ క్లినిక్ ఉందని చెప్పలేదు, కాబట్టి, “ కొత్త క్లినిక్ పెడితే మాకెలా  తెలుస్తుంది?”, అని అడిగింది.

మధోపూర్ అనంత్ లో PHC లేదు కానీ ఒక సబ్ సెంటర్ ఉంది. గ్రామస్తులు అది మధ్యాహ్నం అవడం మూలంగా ఎక్కువ శాతం మూసే ఉంటుందని చెప్పారు. 2011-12 లో డిస్ట్రిక్ట్ ఆక్షన్ ప్లాన్, షియోహార్ బ్లాక్ కు 24 సబ్ సెంటర్లు అవసరమని చెప్పింది, కానీ ఇక్కడ  10 మాత్రమే ఉన్నాయి.

శాంతి తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు అంగన్వాడీ నుండి ఐరన్, కాల్షియమ్ మాత్రలు ఏమి లభించలేదు, అని చెప్పింది. ఆమె కూతురుకు కూడా ఇవ్వలేదు. ఆమె చెక్ అప్ ల  కోసం ఎక్కడికి వెళ్ళలేదు.

పైగా ఆమె గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలలు, కాన్పు వచ్చేదాకా పని చేస్తూనే ఉంది. “కాన్పు అయిన పది రోజులకు నేను మళ్లీ పనికి వెళ్ళిపోయేదాన్ని”, అని చెప్పింది.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ధోగారి దేవి (ఎడమ), తాను ఎప్పుడూ వితంతువు పింఛను తీసుకోలేదని  అని చెప్పింది. బాగులనియ (కుడి వైపు ఆమె భర్త జోగిందర్ సా) అకౌంటులో ప్రతి నెల 400 రూపాయిలు పడుతున్నాయి- ఎందుకో ఆమెకి తెలియదు

ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ICDS) స్కీం కింద అంగన్వాడీ నుంచి గర్భవతులకు, బిడ్డకి పాలిచ్చే తల్లులకు,  చంటి పిల్లలకు  పోషక పదార్ధాల సప్లిమెంట్లు పొట్లాలుగా ఇవ్వడం కానీ, లేదంటే వండి పెట్టడంగాని చేయాలి. గర్భవతులకు ఐరన్, ఫోలిక్ టాబ్లెట్లు, ఇంకా కాల్షియమ్ సప్లిమెంట్లు కనీసం 180 రోజులు వేసుకోవాలి. ఆమెకు ఏడుగురు పిల్లలూ ఒక మనవడున్నా, శాంతి అలాంటి స్కీం గురించి వినలేదని చెప్పింది.

ముసహర్ టోలలో ఆడవాళ్లు ఏ అంగన్వాడీ లోను తమను తాము నమోదు చేసుకోలేదు అని, ఆ  పక్కనే ఉన్నమాలి పోకర్ భీండా గ్రామంలో, ఆశావర్కర్ కళావతి దేవి అన్నది. “ఇక్కడ రెండు అంగన్వాడీ లు ఉన్నాయి. ఒకటి మాలి పోకర్ భీండా లో, ఇంకోటి ఖైర్వా దారప్ లో - ఇది ఒక పంచాయితీ ఉన్న గ్రామం. అయితే ముసహర్ ఆడవారికి ఎక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలో తెలీదు, అందుకని ఇక  నమోదు చేసుకోకుండా  ఊరుకుంటారు.” ఈ రెండు ఊర్లు ముసహర్ టోల నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. భూమి లేని శాంతి వంటి ఇతర ఆడవారికి, వారు పని చేసే  ఇటుకబట్టీల పనికోసం 4-5 కిలోమీటర్లు నడవడమే కాకుండా, ఇంకా ఇక్కడవరకు రావడానికి చాలా నడవవలసి ఉంటుంది.

శాంతి చుట్టూ చేరిన ఆడవారు వారికి సప్లిమెంట్లు కానీ సమాచారం కాని అందలేదని, అంగన్వాడీ నుంచి తీసుకునే హక్కు ఉందని కూడా వారికి తెలీదని చెప్పారు.

ఇక్కడ ఉన్న వృద్ధ మహిళలు వారికి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను అందుకోవడం దాదాపు అసాధ్యమవుతుందని ఆరోపించారు. 71 ఏళ్ళ ధోగారి  దేవి, తన జీవితంలో ఎప్పుడు వితంతువు పెన్షన్ అందుకోలేదని చెప్పింది. వితంతువు కాని బాగులనిదేవి నెలకు 400 రూపాయిలు తన బ్యాంకు అకౌంట్ లో పడతాయని, కానీ  దేనికి సబ్సిడీగా ఇది తనకు చేరుతుందో తెలీదని చెప్పింది.

ఆశావర్కర్ కళావతి, ఈ మహిళలకు ఉన్న అస్పష్టతకు వారే కారణం అంటుంది. కనీసం గర్భవతులుగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో తెలియకపోవడానికి వారికి చదువులేకపోవడమే కారణం. “ప్రతి ఒక్కరికి ఆరేడుగురు పిల్లలున్నారు. పిల్లలు చుట్టూ ముసురుతూనే ఉంటారు. నేను చాలాసార్లు వాళ్ళని ఖైర్వా దారపు అంగన్వాడీ లో నమోదు చేసుకోమని చెప్పాను, కానీ వాళ్ళు వినలేదు.” అన్నది.

పేగు కత్తిరించడానికి ఏమి వాడేవారు? టోల లో ఉన్న 10-12 మంది ఆడవాళ్లు చుట్టూ చేరి ఇంట్లో ఉన్న కత్తిని కడిగి వాడతారని చెప్పారు - అది పెద్దగా ఆలోచించే విషయం కాదని  అందరూ అనుకున్నారు

మాదాపూర్ అనంత్ లో ఒక ప్రభుత్వ పాఠశాల టోల కు దగ్గరగా ఉన్నది, కానీ ముసహర్ నుండి అక్కడికి వచ్చే పిల్లలు చాలా తక్కువమంది. శాంతి పూర్తిగా నిరక్షరాస్యురాలు. ఆమె భర్త, ఏడుగురు పిల్లలు కూడా అంతే. “ఏదైతేనేం వాళ్ళు రోజు కూలి కోసం పనిచేయాల్సిందే,” తేల్చింది ధోగరి దేవి అనే వృద్ధ పౌరురాలు.

బీహార్ లో షెడ్యూల్డ్ కులాల వారిలో నిరక్షరాస్యత ఎక్కువ. 28.5 శాతం వద్ద ఉన్నబీహార్ షెడ్యూల్ కులాల అక్షరాస్యత, మొత్తం భారతదేశ షెడ్యూల్డ్ కులాల (సెన్సస్ 2001 లో పేర్కొన్నట్లుగా) అక్షరాస్యతలో 54.7 శాతం మాత్రమే. ఈ సమూహాలలో, ముసహర్‌ల అక్షరాస్యత రేట్లు అత్యల్పంగా 9 శాతం మాత్రంగానే ఉన్నాయి.

ముసహర్ కుటుంబాలకు వ్యవసాయ ఆస్తులు లేవు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సామాజిక అభివృద్ధిపై నీతి ఆయోగ్ సర్వే నివేదికలో బీహార్‌లోని ముసహర్లలో కేవలం 10.1 శాతం మంది మాత్రమే పశువులను కలిగి ఉన్నారని, ఇది ఎస్సీ సమూహాలలో అతి తక్కువ అని తేలింది. ఇదే కాక, 1.4 శాతం ముసహర్ కుటుంబాలు మాత్రమే ఎద్దును కలిగి ఉన్నాయి.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, కొంతమంది ముసహార్లు పందులను పెంచుతారు. ఇది వారి సంప్రదాయ వృత్తి. ఇతర కులాలు వారు ఈ వర్గాన్ని ఈ కారణంగా కూడా ఇష్టపడరు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాలలో సైకిల్, రిక్షాలు, స్కూటర్లు లేదా మోటార్‌సైకిళ్ల యాజమాన్య నివేదిక కోసం సర్వే చేయగా, ముసహర్ కుటుంబాలకు అసలు స్వంత వాహనాలే లేవని తెలిసింది.

శాంతి కుటుంబం పందులను పెంచదు. వారికి కొన్ని మేకలు, కోళ్లు ఉన్నప్పటికీ, వీటిని వారు వండుకుని తింటారు కానీ అమ్మరు. "మేము ఎప్పుడు బ్రతకడం కోసమే పని చేశాము. మేము బీహార్‌లోని వేరే ప్రాంతాలలో, అలాగే వేరే రాష్ట్రాలలో కూడా చాలా సంవత్సరాలు పనిచేశాము,” అన్నది శాంతి. ఆమె, ఆమె భర్త  ఇటుక బట్టీల పని చేస్తూ, ఊర్లు మారినప్పుడు పిల్లలు కూడా వారితోనే ఉండి పనిచేసేవారు.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ముసహర్ తోలా (కుడివైపు) లో కొన్ని పశువుల కోసం పంచాయితీ నిధులతో రహదారి పక్కన నిర్మించిన ఒక భాగస్వామ్య తాగునీటి తొట్టి (ఎడమ)

“మేము అక్కడ నెలల తరబడి ఉండేవాళ్ళం, కొన్నిసార్లు ఆరునెలల పాటు. ఒకసారి మేము ఒక సంవత్సరం పాటు కాశ్మీర్ లోనే ఉన్నాము. అక్కడ ఇటుక బట్టిలలో పని చేశాము.” చెప్పింది శాంతి. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. కానీ గర్భంలో ఎన్నో బిడ్డను మోసిందో గుర్తులేదు. “అది ఆరేళ్ల క్రితం జరిగింది.” కాశ్మీర్ లో ఏ ప్రాంతంలో పనిచేశారో కూడా ఆమెకు గుర్తులేదు, గుర్తున్నదంతా అదొక పెద్ద ఇటుక బట్టి అని, వచ్చిన కూలీలంతా బీహార్ నించే అని.

బీహార్ లో వచ్చే కూలి డబ్బులకంటే ఇక్కడ ఆదాయం ఎక్కువ ఉండేది. ప్రతి వెయ్యి ఇటుకలకి బీహార్ లో 450 రూపాయిలు వస్తే ఇక్కడ 600 నుంచి 650 రూపాయిల వరకు వచ్చేవి. ఆమె పిల్లలు కూడా ఆ ఇటుక  బట్టీలలో  పని చేసేవారు. శాంతి, ఆమె భర్త సులువుగా వెయ్యికన్న ఎక్కువ ఇటుకలు చేసేవారు కానీ అప్పట్లో వారు ఆ పని ద్వారా ఎంత సంపాదించారో ఆమెకు గుర్తులేదు. “మేము ఇంటికి వచ్చేయాలి, అనుకున్నాం అంతే, తక్కువొచ్చినా పర్లేదు అనుకున్నాం.” అంది శాంతి.

ప్రస్తుతం ఆమె భర్త, 38 ఏళ్ళ దొరిక్ మాంఝి పంజాబ్ లో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. నెలకు 4000 నుండి 5000 వరకు ఇంటికి పంపిస్తాడు. ఈ మహారోగం, లాక్ డౌన్ ల వలన పని తక్కువగా దొరుకుతుంది, కూలి కాంట్రాక్టర్ కూడా ఈ సమయంలో  పని చేయడానికి  మగవాళ్లనే ఎంచుకుంటాడు. భర్త తో పాటు వెళ్లకుండా ఇక్కడ వరి పొలాల్లో ఆమె ఎందుకు పని చేయవలసి వస్తున్నదో  వివరించింది శాంతి. “కూలి డబ్బులు అందుకోవడం ఒక పెద్ద సమస్య. మాకు డబ్బులు ఇవ్వడానికి యజమాని వారంలో ఒక రోజును ఎంచుకుంటాడు.” అని ఆమె చెప్పింది. ఆమె బన్హరి లేదా కూలి డబ్బుల కోసం చాలా సార్లు అతని ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుంది. “కానీ కనీసం మా ఇంట్లోనే ఉంటున్నాం”, అన్నది.

ఆమె కూతురు కాజల్ రోడ్డు పక్కనే చుట్టుపక్కల పిల్లలతో ఆడుతోంది. బాగా ముసురు పట్టి ఉంది. అందరూ తడిసిపోయి ఉన్నారు. శాంతి కాజల్ ని ఫోటో దిగడం కోసం, ఉన్నవాటిలో మంచి గౌను వేసుకుని రమ్మంది,. కాసేపట్లోనే, ఆ పాప మళ్లీ ఆ గౌను విప్పేసి, ఆ బురద రోడ్డు మీద పిల్లలతో కలిసి ఒక  గుండ్రని రాయిని  కర్రలతో తోసుకుంటూ ఆడుతోంది.

పరిమాణంలో,  జనాభాను బట్టి షియోహార్ జిల్లా, బీహార్ రాష్ట్రంలోని జిల్లాలలోకెల్లా చిన్నజిల్లా. ఇది సీతామాడి నుండి 1994 లో విడిపోయింది. షియోహార్ జిల్లా హెడ్ క్వార్టర్ మాత్రమే ఇక్కడ ఉన్న పట్టణం. గంగా నదికి ఉపనది అయినా బాగమతి నది ఈ జిల్లాలో ఉన్న నదులలో పెద్ద  నది. దీని జన్మ స్థానమైన నేపాల్ లో వర్షం పడినప్పుడు ఈ నది పొంగిపోయి ఉత్తర బీహార్లోకి నీళ్లు వచ్చేస్తాయి. కోసి ఇంకా వేరే నదుల పాయలు ప్రమాదపు అంచువరకు చేరుకుంటాయి. వరి, చెరకు ఇక్కడ  చాలా ప్రసిద్ధి పొందిన పంటలు. రెండూ నీటి ఆధారంగా పెరిగే పంటలే.

ముసహర్ టోల- మధోపూర్ అనంత్ లో ప్రజలు స్థానిక వరి పొలాలలో, ఇంకా దూరంగా ఉన్న బిల్డింగ్ కట్టడాల పనులలో, ఇటుక బట్టీలలో  పనిచేస్తారు. కొందరికి చిన్నచిన్న భూములు ఉన్న  బంధువులు ఉన్నారు. వీరికి కత్తాన్(ఎకరం లో కొంత భాగం)లు ఉన్నా, కానీ ఎవరూ భూమికి హక్కుదారు కాదు.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

తన కూతురికి కూడా ఇంత మంది పిల్లలు ఉంటారా అని నేను అడిగినప్పుడు శాంతి నవ్వింది: 'అది నాకు తెలియదు...'

శాంతి జుట్టు జటలు గట్టి ఆమె మెరిసే నవ్వుతో పోటీపడుతోంది. కానీ దాని గురించి ఆమెని అడిగినప్పుడు, ఇంకో ఇద్దరు ఆడవారు వారి  నెత్తి మీద కొంగుని తీసి వారి జుట్టు కూడా అలానే ఉందని చూపించారు. “ఇది అఘోరి శివ కోసం,” అన్నది శాంతి, కానీ వారు గుండు గీయించుకోము అని చెప్పారు. “అది ఒక రాత్రి దానంతట అదే అలా అయిపోయింది.” అని చెప్పింది శాంతి.

ముసహర్ టోలలో ఆడవారు శారీరిక పరిశుభ్రతను అసలు పాటించరని కళావతి చెప్తుంది. ఆమెలాంటి ఆశాలు ప్రతి వ్యవస్థాపక ప్రసవానికి 600 రూపాయిలు తీసుకోవచ్చు, కానీ ఈ మహారోగం వలన ఇందులో కొంత సొమ్ము మాత్రమే వారికి వస్తోంది. “వీరిని ఆసుపత్రికి వెళ్ళడానికి ఒప్పించడం చాలా కష్టం, పైగా నాకు డబ్బులు కూడా సరిగ్గా రావు,” అన్నది కళావతి.

ముసాహరుల పద్ధతులు మొండిగా ఉంటాయని బయటివారు అనుకుంటారని తెలియడం వలన శాంతి నాతో వారి ఆచారవ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. ఆమె పోషకాహారం గురించి మాట్లాడలేదు. నేను ప్రత్యేకంగా ముసాహరుల మీద ఉన్న చిన్నచూపును గురించి మాటలాడినప్పుడు, “మేము ఎలుకలను తినము”, అన్న మాట ఒక్కటే అన్నది.

కవిత ఒప్పుకుంటుంది- ఈ ముసహర్ టోలలో భోజనం అంటే మామూలుగా అన్నం, బంగాళా దుంపలు మాత్రమే తింటారని. “ఎవరూ ఆకుకూరలు తినరని మాత్రం ఖచ్చితంగా తెలుసు.” అన్నది కళావతి. రక్తహీనత అనేది ఇక్కడ ఆడవారిలో, పిల్లలలో చాలా ఎక్కువ అని చెప్పింది.

శాంతి అక్కడి రేషన్ దుకాణంలో ప్రతి నెల బియ్యం, గోధుమ కలిపి 27 కిలోలు కొంటుంది. “పిల్లలందరి పేరు రేషన్ కార్డులో నమోదు చెయ్యలేదు అందుకని చిన్న పిల్లల కోటలో బియ్యం, గోధుమ తెచ్చుకోలేను,” అన్నది. ఈ రోజు వారి ఇంట్లో అన్నం, బంగాళా  దుంప, పెసరపప్పు వండారు . రాత్రుళ్ళు రోటీలు ఉంటాయి. ఈ ఇంట్లో గుడ్లు, పాళ్ళు, ఆకుకూరలు ఈ ఇంట్లో చాలా అరుదుగా వండుతారు, ఇక పండ్లయితే అసలు కొనరు.

ఆ కూతురు కూడా ఆమె లాగానే ఇంతమంది పిల్లల్ని కంటుందా అని అడిగితే ఆమె నవ్వింది. మమత అత్తగారిల్లు నేపాల్ బోర్డర్ లో ఉంది. “నాకు తెలీదు, కానీ ఆమెకు ఆసుపత్రి అవసరం పడితే, ఇక్కడికే వస్తుంది.” అని చెప్పింది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? ఐతే  [email protected] కు మెయిల్ రాసి, అందులో [email protected] కు కాపీ పెట్టి పంపండి.

అనువాదం: అపర్ణ తోట

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota