తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు... ఆ ఏడుగురి పేర్లు...
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులు,ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కి చెందిన సభ్యురాలు ఉన్నారు. మంగళవారం(ఆగస్టు 17) జరిగిన సమావేశంలో ఈ సిఫారసుకు ఆమోదం తెలిపినట్లు సుప్రీం కోర్టు కొలీజియం వెల్లడించింది.ఇటీవల తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచిన నేపథ్యంలో... తదనుగుణంగా ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.
కొలీజియం సిఫారసు చేసిన పేర్లు :
సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ పి.శ్రీరాధ,
జ్యూడీషియల్ అకాడమీ డైరక్టర్ సి.సుమలత,
తెలంగాణ వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్ జి.రాధారాణి,
ఖమ్మం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్,
తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి తుకారాంజీ,
రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి,
ఇన్‌కంట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జ్యుడీషియల్ సభ్యులు పి.మాధవిదేవి

సీజేఐ ఎన్వీ రమణ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచిన సంగతి తెలిసిందే. జడ్జిల సంఖ్యను ఏకంగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు, మిగిలిన 10 మంది అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు. 42మందిలో 28 మంది బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులను ఎలివేషన్ చేస్తారు. మిగిలిన 14 మందిని జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఎంపిక చేస్తారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే జడ్జిల సంఖ్యను పెంచినట్లు ఎన్వీ రమణ వెల్లడించారు.
ఇదిలా ఉంటే,కొత్త జడ్జిల నియామకంపై మీడియాలో వచ్చిన వార్తలపై సీజేఐ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు కొలీజియం సమావేశంపై ఊహాగానాలు ప్రచురించడం దురదృష్టకరమన్నారు. జడ్జిల నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.జడ్జీల నియామక ప్రక్రియకు ఓ పవిత్రత, హుందాతనం ఉంటాయని... మీడియా దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. 2027లో దేశానికి తొలి మహిళా సీజేఐగా కర్ణాటక జడ్జి నాగరత్నే నియమితులయ్యే అవకాశం ఉందని మీడియాలో ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్వీ రమణ ఇలా స్పందించారు.