నారా లోకేష్ తో పాటు 33 మందిపై కేసులు నమోదు ; ఏపీ తాలిబన్ రాజ్యంగా మారిందన్న కూన రవి కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతి రమ్యను ప్రేమోన్మాది అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. పట్టపగలు అందరూ చూస్తుండగా గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న టిడిపి నేతలు వెళ్లిన విషయం తెలిసిందే. పరమాయకుంటలోని రమ్య ఇంటికి వెళ్లిన నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు రమ్య కుటుంబాన్ని పరామర్శించారు. రమ్య మృతదేహానికి నివాళులర్పించారు. ఇక టిడిపి నేతలు రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో వైసిపి నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టిడిపి వైసిపి నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి టిడిపి నేతలను అరెస్టు చేశారు.

టీడీపీ నేత లోకేష్ తో పాటు 33 మందిపై కేసులు నమోదు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వివిధ సెక్షన్ల కింద పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం పోలీసులు లోకేష్ ను అదుపులోకి తీసుకొని 151 సిఆర్పిసి చట్టం కింద నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో నారా లోకేష్ తో పాటు, మొత్తం 33 మంది టిడిపి నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, అనిత, తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులపై కేసు నమోదు చేశారు.

కరోనా నిబంధనలు పాటించకుండా ఉల్లంఘన ; వివిధ అభియోగాలు
అనధికారికంగా గుమికూడారు అని, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అన్న అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని నక్క ఆనంద్ బాబు, దూళిపాళ్ల నరేంద్ర తో పాటు మరో పదిమంది నేతలపై గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీ తాలిబన్ రాజ్యంగా మారిందన్న కూన రవి కుమార్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారిందని, మహిళలపై దాడులు జరుగుతుంటే, పట్టపగలు హత్యాకాండలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలియ చేసే హక్కు కూడా లేదా అని టిడిపి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి నేతల అరెస్టులపై, వారిపై కేసులు నమోదు చేయడంపై మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత కూన రవికుమార్ ఏపీ తాలిబన్ రాజ్యంగా మారిందని నిప్పులు చెరిగారు. పోలీసుల గన్నులు పెట్టి జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని కూన రవికుమార్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. నిరసనలు, పరామర్శలు చేస్తే అరెస్టులు చేస్తారా అంటూ ద్వజమెత్తారు.

టీడీపీ నేతలు చేసిన తప్పేంటి ? అసలు కేసు పెట్టాల్సింది జగన్ మీదే : కూన ధ్వజం
పోలీసులు కేసులు పెట్టడానికి, అరెస్టు చేయడానికి నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు చేసిన తప్పేంటి అని నిలదీశారు కూన రవికుమార్. అసలు రాష్ట్రంలో దిశ చట్టం ఉందా అని ప్రశ్నించిన ఆయన లేని చట్టాన్ని ఉన్నట్టు మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పిచ్చి పట్టి ఏం మాట్లాడితే వైసీపీ నేతలు కూడా అదే మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. లేని చట్టాన్ని ఉన్నట్టు భయపెడుతున్న సీఎం జగన్ ను తక్షణమే అరెస్టు చేయాలని కూన రవికుమార్ పేర్కొన్నారు.