ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం : కాబూల్ ఎయిర్ పోర్ట్ ఆందోళనల్లో ఐదుగురు మృతి ; పరిస్థితి ఉద్రిక్తం
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను వశం చేసుకున్న నేపథ్యంలో ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితులు దారుణంగా తయారయింది. తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకు వస్తున్న క్రమంలో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసి వేస్తున్నాయి. తాలిబన్ల క్రూర పాలన నేపథ్యంలో చాలా మంది ఆఫ్ఘన్ వాసులు సైతం ఇతర దేశాలకు వలస వెళ్లడానికి కాబూల్ ఎయిర్పోర్టుకు క్యూ కట్టిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఎయిర్పోర్టుకు క్యూ కట్టి అక్కడ ఉన్న విమానాలను ఇష్టారాజ్యంగా ఎక్కడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో సైన్యం కాల్పులు జరిపినట్లుగా సమాచారం.
తాలిబన్లు ఎవరు ? ఎందుకు వారంటే ఆఫ్ఘన్ లకు భయం ? ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రస్థానం ఇలా !!

కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ఐదుగురు మృతి , కాల్పులా ? తొక్కిసలాటా ? రాని స్పష్టత
సునామినో, భూకంపమో, ప్రకృతి విపత్తు ఏదో సంభవించినట్లు గా ఆఫ్ఘన్ వాసులు విమానాలు ఎక్కడానికి పరుగులు పెడుతున్నారు . ఇక ఎయిర్పోర్టులో పరిస్థితి చేయి దాటడంతో తాజా పరిణామాలతో కాబూల్ ఎయిర్పోర్ట్ ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే కాబూల్ విమానాశ్రయంలో భారీ కాల్పుల నివేదికల మధ్య కనీసం ఐదుగురు మరణించారని తాజా నివేదికల ఆధారంగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన చివరి కొన్ని విమానాలు ఎక్కడానికి వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో వారు మృతి చెందినట్లుగా సమాచారం. అయితే బాధితులు తుపాకీ కాల్పులతో మరణించారా లేకా తొక్కిసలాటలో మరణించారా అనేది స్పష్టంగా తెలియదని రాయిటర్స్ తెలిపింది.

కాబూల్ లో అదుపు తప్పినా పరిస్థితులు ..యుఎస్ దళాలు గాలిలో కాల్పులు
అంతకుముందు, విమానాశ్రయంలో భారీ జనసమూహం ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లడానికి చేరుకుంది. రాత్రికి రాత్రి మారిన పరిణామాలతో వేలాదిమంది కాబూలీవాలా లు ఆఫ్ఘనిస్తాన్ వాసులు విమానాశ్రయానికి గుంపులుగుంపులుగా చేరుకున్నారు. కాబూల్ విమానాశ్రయం బస్ స్టాండ్ ను తలపించింది. జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో యుఎస్ దళాలు గాలిలో కాల్పులు జరిపాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో విమానాశ్రయంలో ఐదుగురు మరణించినట్లుగా వస్తున్న వార్తలు ఆప్ఘనిస్థాన్లో శాంతిభద్రతల సమస్యకు అద్దం పడుతున్నాయి. మరణించిన వారు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

కాబూల్ విమానాశ్రయం క్లోజ్ .. కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆందోళన
అధికారులు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం యొక్క పౌర భాగం మూసివేయబడిందని వెల్లడించారు. మరోవైపు ఎయిర్ ఇండియా సైతం ఆఫ్ఘన్ గగనతలంలో కార్యకలాపాలను నిలిపివేసింది. అన్ని ఢిల్లీ-కాబూల్-ఢిల్లీ విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ తన దౌత్యవేత్తలు, పౌరులను మరియు దాని మిత్రదేశాల ప్రజలను ఆఫ్ఘనిస్తాన్ నుండి తరలించడానికి కాబూల్ విమానాశ్రయంలో 6,000 మంది సిబ్బందిని నియమించింది. కాబూల్ విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు యుఎస్ మిలిటరీ భద్రత కొనసాగిస్తుంది. ఇది ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలకు యాక్టింగ్ కాన్సులేట్‌గా కూడా పనిచేస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం .. ఐదుగురు మృతితో టెన్షన్
తాలిబాన్లు రాజధాని నగరం కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రక్తపాతాన్ని నివారించాలని కోరుతూ ఆదివారం దేశం విడిచి పారిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికి తాను ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళుతున్నట్లుగా ఘనీ ప్రకటన చేసినా ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ప్రస్తుతం చోటు చేసుకున్న ఆందోళన, ఐదుగురు మృతి ఘటన ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలకు అద్దం పడుతున్నాయి. ఇక ఈ ఉద్రిక్తతలు మరెంత తీవ్ర పరిణామాలకు కారణం అవుతాయో అన్న ఆందోళన కొనసాగుతుంది.