తాలిబన్లు ఎవరు ? ఎందుకు వారంటే ఆఫ్ఘన్ లకు భయం ? ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రస్థానం ఇలా !!
తాలిబన్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న పదం. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మిలిటెంట్ ముఠా. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు తాలిబన్లు ఎవరు? వారి విషయంలో ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? గతంలో ఆఫ్ఘనిస్థాన్లో పాలన సాగించిన తాలిబన్లు ఏం చేశారు ? వారు ఎలా ఆఫ్ఘనిస్థాన్ పై పట్టు సాధించారు వంటి అనేక విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం : శాంతి స్థాపన సాధ్యమేనా? సంయమనం పాటించాలని తాలిబన్లకు యూఎన్ చీఫ్ విజ్ఞప్తి !!

ఆఫ్ఘనిస్థాన్ లో ముజాహిదీన్ నాయకుల అరాచక పాలనతో రంగంలోకి తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్లో 1990లో సోవియట్ సేనలపై పోరాడిన వివిధ ముజాహిద్దీన్ వర్గాలు, రష్యా నిష్క్రమణ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు పాలనపై దృష్టి సారించకుండా నిరంతరం కలహాల లో మునిగి తేలుతూ ఉండేవారు. ఇక ముజాహిదీన్ నాయకుల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ లో చోటుచేసుకున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్ లకు పాల్పడటం వంటి ఘటనలకు ముజాహిదీన్ నాయకులు పాల్పడడంతో దేశంలో అరాచకం తాండవించింది. ఇక ఈ సమయంలో 1994వ సంవత్సరంలో తాలిబన్లు ముల్లా ఉమర్ నెట్ నాయకత్వంలో దేశంలో సుస్థిరత నెలకొల్పడానికి రంగంలోకి దిగారు.

ఇస్లామిక్ విద్యాసంస్థలలో చదువుకున్న తాలిబన్లు .. ఆఫ్ఘనిస్థాన్ లో ముజాహిదీన్ పాలనకు చెక్
తాలిబన్ అంటే పష్టో భాషలో విద్యార్థి అని అర్థం. సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్తాన్ లో నిర్వహించిన ఇస్లామిక్ విద్యాలయాలలో తాలిబన్లు చదువుకునే వారు. ఇక వ్యవస్థాపక సభ్యులు అందరూ ఒమర్ విద్యార్థులే కావడంవల్ల ముఠాకు తాలిబన్ అని పేరు పెట్టారు. మొదట్లో ముజాహిదీన్ ఫైటర్లు ఉండే తాలిబన్ ముఠాకు తర్వాతి కాలంలో క్రమంగా పాకిస్తాన్ సైన్యం, సైనిక గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారం పెద్దఎత్తున అందడంతో తాళి వాళ్ళు ఆఫ్ఘన్ ముజాహిదీన్ వర్గాలను ఓడించి 1998కి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ పాలన కిందకు తెచ్చుకున్నారు. అయితే ముజాహిదీన్ నాయకుల అరాచకాలు నుండి తమకు విముక్తి లభించిందని ఆఫ్ఘన్ లకు తాలిబన్ల అరాచక పాలన సైతం వెన్నులో వణుకు పుట్టించింది.

తాలిబన్లు చెప్పిందొకటి, కానీ చేసింది ఆటవిక పాలన
మొదటి శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలను కు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు.

మహిళలపై తాలిబన్ల నిరంకుశత్వం , ముజాహిదీన్ నాయకులను మించి రాక్షసత్వం
మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా, ఇతర మతస్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. తాలిబన్లకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ మదర్సాలలో చదివే వీరంతా ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు దిగారు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రశాంతంగా పాలన సాగిస్తారనుకుంటే ముజాహిదీన్ నాయకులను మించి తాలిబన్ల ఆటవిక పాలన సాగించారు.

మళ్ళీ తాలిబన్ల క్రూర పాలనకు వణికిపోతున్న ఆఫ్ఘనిస్థాన్
అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడి జరిగిన తరువాత ఆఫ్ఘనిస్థాన్లో ఒసామా బిన్ లాడెన్ తలదాచుకున్నాడు అని తన పై ఫోకస్ పెట్టిన యూఎస్ మిలటరీ బలగాలను రంగంలోకి దించి గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాటం సాగిస్తోంది. ఇక ఇటీవల యూఎస్ బలగాల ఉపసంహరణ తో రెచ్చిపోయిన తాలిబన్లు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారని వార్తలతో ప్రజల కళ్ళముందు తాలిబన్ల క్రూర పాలన కనిపిస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజలు కన్నీరుమున్నీరు.. దేశం వదిలి వలసపోయేందుకు రెడీ
ఇంతకాలం టీషర్ట్ లు , జీన్స్ వేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ యువకులు వాటిని తీసివేసి సంప్రదాయ దుస్తులను ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థినులు ఇక తాము చదువుకునే అవకాశం ఉండదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో మహిళలు బుర్ఖాలు ధరించాల్సిన పరిస్థితిలో, తాలిబన్ల పాలన అంటే మహిళలు వణికిపోతున్నారు. 12 ఏళ్లు దాటిన బాలికలు స్కూళ్లకు వెళ్లకూడదని నిషేధం మళ్లీ అమలు చేస్తారేమో అని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భయపడుతున్నారు. షియా ముస్లింలైన హజరా మైనార్టీలు రాష్ట్రం తాలిబన్ల చేతిలో కి వెళ్లడంతో వణికిపోతున్నారు. తమపై సున్నీ తీవ్రవాదులు దాడులు చేస్తారేమోనని, ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

తాలిబన్లకు వణికిపోతున్న ప్రజలకు సాక్ష్యంగా కాబూల్ ఎయిర్ పోర్ట్ లో పరిస్థితి
ఇక తాలిబన్ల పాలనలో విధించే కఠిన శిక్ష లపై ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది. బహిరంగంగా తలలు నరకటం, చేతులు కాళ్లు నరికి వేయడం వంటి ఆటవిక శిక్షల నేపథ్యంలో తాలిబన్ల పాలన మా వల్ల కాదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాలిబన్లను నమ్మబోమని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు ఆఫ్ఘన్ ప్రజలలో తాలిబన్ల పట్ల ఉన్న భయాందోళనలకు అద్దంపడుతున్నాయి. ఆఫ్ఘన్లో ప్రాణ భయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్టులో దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్ పోర్టుకు క్యూకడుతున్నారు.