భార్యపై బలవంతపు శృంగారం నేరం కాదు: భర్తకు ముందస్తు బెయిల్ ఇస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబై: భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అనే అంశంపై ఇప్పటికే పలు కోర్టులు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. భార్యపై బలవంతంగా శృంగారం చేయడం నేరమేనని పలు కోర్టులు వ్యాఖ్యానించాయి. అయితే, ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు మాత్రం ఇందుకు భిన్నంగా తీర్పునివ్వడం చర్చనీయాంశంగా మారింది. భార్యపై బలవంతపు శృంగారం నేరం కాదని పేర్కొంది. అంతేగాక, బాధితురాలి భర్త, అత్తామామలకు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

అదనపు కట్నం కోసం వేధింపులు..
ఈ కేసు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళకు నిందితుడితో నవంబర్ 2020లో వివాహం జరిగింది. వివాహమైన కొద్ది రోజులకే అత్తింటివారు అదనపు కట్నం కోసం తనను వేధించారని బాధిత మహిళ ఆరోపించింది. అంతేగాక, తనపై ఆంక్షలను విధించారని తెలిపింది. తన భర్త కూడా తనను శారీరకంగా హింసించాడని తెలిపింది.

భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త బలవంతపు శృంగారం..
అంతేగాక, తన ఇష్టానికి వ్యతిరేకంగా.. తన భర్త తనపై బలవంతంగా శృంగారంలో పాల్గొన్నారని మహిళ తెలిపింది. జనవరి నెలలో కూడా మహబలేశ్వరంకు వెళ్లిన సమయంలోనూ తనపై బలవంతపు శృంగారానికి పాల్పడ్డాడని భర్తపై ఆరోపణలు చేసింది. దీంతో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది.

భర్త బలవంతపు శృంగారంతో తనకు పక్షవాతం వచ్చిందని భార్య
ఈ క్రమంలో తాను వైద్యులను సంప్రదించగా.. తన నడుం కింది భాగం పక్షవాతానికి గురైందని వారు వెల్లడించారని వివాహిత చెప్పింది. భర్త తనపై చేసిన బలవంతపు శృంగారం వల్లే తనకు ఈ సమస్య వచ్చిందని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధితురాలి భర్త, అత్తామాలు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. వరకట్నం కోసం తాము ఎప్పుడూ వేధించలేదని కోర్టుకు ఆమె భర్త తెలిపాడు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నాడు. అంతేగాక, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్య, ఆమె కుటుంబంపై ఫిర్యాదు చేశాడు.

భార్యపై బలవంతపు శృంగారం నేరం కాదంటూ జడ్జీ కీలక వ్యాఖ్యలు
కాగా, కేసు విచారణ సందర్భంగా సెషన్స్ కోర్టు జడ్జీ సంజశ్రీ ఘరాత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సదరు మహిళ చిన్నవయస్సులోనే పక్షవాతానికి గురికావడం బాధాకరమే. అయినప్పటికీ దీనికి భర్తే కారణమని చెప్పడం సరికాదు. పెళ్లి తర్వాత భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా.. అది చట్ట విరుద్ధం కాదని న్యాయమూర్తి సంజశ్రీ ఘరాత్ వెల్లడించారు. అదనపు కట్నం కోసం వేధించారని చెబుతున్న మహిళ.. ఎంత మొత్తం డిమాండ్ చేశారనే విషయం వెల్లడించలేదన్నారు. ఇరువైపులా వాదనలు విన్నన్యాయమూర్తి బాధిత మహిళ భర్త, అత్తామామలకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, న్యాయమూర్తి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కోర్టు తీర్పుపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగలేదని వాపోయారు. తనకు పక్షవాతం వచ్చి జీవితంలో ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయినా.. తనకు అండగా న్యాయం నిలబడలేదని ఆవేదనకు గురయ్యారు.