చనిపోయిన తరువాత కూడా బతికేయవచ్చు
డాక్టర్. కె. అనంతరావు
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు.
ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీన అవయవదాన దినోత్సవం నిర్వహిస్తారు. అవయవదాన ప్రాముఖ్యత, మనం మరణించిన తర్వాత శరీరంలోని వివిధ అవయవాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, అవయవాలు దానం చేయమని ప్రతిజ్ఞ చేయాలని ప్రజల్లో అవగాహాన కల్పించి చైతన్యపరచడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. అవయవదాతలు అందుబాటులో లేకపోవడం వల్ల భారతదేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం డయాలసిస్‌పై రెండు లక్షల మంది రోగులు మరణిస్తున్నారు మరియు ఐదు వేల మంది రోగులు మాత్రమే మూత్రపిండ మార్పిడిని పొందుతున్నారు. అందువలన అవసరమైన అవయవాల సంఖ్య మరియు దాతల సంఖ్య మధ్య పెద్ద అంతరం ఉంది. మూత్రపిండల వైఫల్యం ఉన్న రోగులకు కిడ్నీ మార్పిడి ఉత్తమ చికిత్స. మూత్రపిండ మార్పిడికి ప్రధాన అడ్డంకి ఒకటి దాతల కొరత. మూత్రపిండ మార్పిడి కోసం రెండు రకాల దాతలు ఉన్నారు -1) లైవ్ 2) చనిపోయిన (కాడెవరిక్) వారు/ బ్రెయిన్ డెడ్. ప్రత్యక్ష దాతలు సాధారణంగా రోగి యొక్క సొంత కుటుంబ సభ్యులు. బంధువులు అనర్హులు అయితే, రోగి ఆంధ్రప్రదేశ్‌లో జీవన్‌దాన్‌లో, కాడెవరిక్ మూత్రపిండల మార్పిడి కోసం నమోదు చేసుకోవచ్చు.
అవయవ దానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అవయవాలు దానం చేస్తే తాము అనారోగ్యం చెందుతామనే భయంతో అవయవాలు దానం చేయడానికి వెనుకాడుతారు. ఇది నిజం కాదు. ఉదాహరణకు, కిడ్నీ దానం పూర్తిగా సురక్షితం మరియు దాతలు సాధారణంగా దానం చేసిన తర్వాత పెద్దగా ఎటువంటి అనారోగ్యానికి గురికారు. దాతను పూర్తిగా పరీక్షలు చేసిన తరువాతే అవయవదానంకి అనుమతిస్తారు. అనేక రకలైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, గుండె పరీక్షలు, మానసికంగా సిద్దంగా ఉన్నారా లేదా అనే పరీక్షలు మరియు ఇతర అనేక పరీక్షలు చేస్తారు. పరీక్షల్లో ఎటువంటి అసాధారణ వ్యత్యాసాలు ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారు. ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని గడపడానికి ఒకే కిడ్నీ కూడా సరిపోతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. పెయిన్ కిలర్స్ వంటి మాత్రలు వేసుకోవద్దు. అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి, బిపిని అదుపులో ఉంచుకోవాలి.
కొంతమంది రోగులు రోడ్డు ప్రమాదాల్లో లేదా బ్రెయిన్ హెమరేజ్ వల్ల ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతారు. వారిలో కొంతమంది దురదృష్టవశాత్తు మెదడు పనిచేయకుండా పోతుంది, కానీ వారి గుండె కొట్టుకుంటుంది. బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ, మూత్రపిండాలు, గుండె, కాలేయం, కళ్ళు వంటి ఇతర అవయవాలు పనిచేస్తాయి. వాటిని మనం మార్పిడి కోసం ఉపయోగించవచ్చు. అలాంటి రోగులను కాడవెరిక్ దాతలు అంటారు. ఒక కాడవెరిక్ డోనర్ ఎనిమిది మందిని బతికించవచ్చు. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్రేగు, క్లోమం, కళ్ళు (కార్నియా), గుండె కవాటాలు, చర్మం, ఎముక, స్నాయువులు మరియు సిరలు మార్పిడి చేసుకోవచ్చు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. వారు మరణించిన తర్వాత వారిని ఖననం లేదా, కాల్చివేయడం జరుగుతుంది. దీంతో ఇతరులను బతికించకలిగే అవయవాలు వృధా అవుతున్నాయి. భారతదేశంలో అవయవాల మార్పిడికి చేయలేకపోడానికి వివిధ కారణాలు ఉన్నాయి.
ఎ) అవయవ దానం గురించి సాధారణ ప్రజలలో అవగాహన లేకపోవడం,
బి) మతపరమైన ఆంక్షలు,
సి) తదుపరి జన్మ గురించి తప్పుడు మూఢ నమ్మకాలు
డి) మరికొన్ని వైద్య వ్యవస్థపై విశ్వాసం లేదు.
ఈ) ప్రధానంగా వైద్యులు మరియు ఆసుపత్రులు ప్రతికూలంగా చూపబడే సినిమాల ప్రభావం. వాస్తవానికి ఇది నిజం కాదు.
మరణించన తర్వాత అవయవదానం చేసే క్రమాన్ని పెంచాలి. అంటే మరణించిన తర్వాత అవయవదానం చేయాలని ప్రతిజ్ఞ చేయాలి. ఇది మనం ఎవరికైనా ఇవ్వగల ఉత్తమ బహుమతి. మనం జీవిస్తున్న సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఇది ఒక మార్గం. మీ ఇంట్లో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉండి, అతను/ఆమె మార్పిడి కోసం ఎదురుచూస్తుంటే ఒక్కసారి ఊహించండి. అతను/ఆమె ఎవరిదైనా కిడ్నీ అందుకుంటే మీరు సంతోషిస్తారు కదా ?. ఈ కార్యక్రమానికి ఒక అడ్డంకి ఏమిటంటే, బ్రెయిన్ డెడ్ అయిన రోగి యొక్క బంధువులు అవయవ దానానికి అంగీకరించరు మరియు చాలాసార్లు కుటుంబ సభ్యులు బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవ దానం కోసం నమోదు చేసుకున్నారని తెలియదు. కాబట్టి అవయవ దాతగా నమోదు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మరణానంతరం తమ అవయవాలను దానం చేయాలనే కోరిక గురించి వారి తక్షణ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.
అవయవ మార్పిడి అన్ని ఆసుపత్రులు చేయలేవు. ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆసుపత్రుల్లోనే మార్పిడి చేయించుకోవాలి. మానవ అవయవాల మార్పిడి చట్టం (THOA) 2014 భారతదేశంలో మార్పిడి కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. బ్రెయిన్ డెత్ తరువాత, ఆ ఆసుపత్రిలో ఈ సౌకర్యం ఉన్నట్లయితే బంధువులు డాక్టర్ లేదా హాస్పిటల్‌తో చర్చించవచ్చు. కాకపోతే రోగిని సౌకర్యం ఉన్న మరొక ఆసుపత్రికి తరలించవచ్చు. అవయవ దానం అనేది చివరి దశలో అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగుల మనుగడను మెరుగుపరచడానికి తక్షణ అవసరం. దీనిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత.
ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు అవయవాల మార్పిడి కేంద్రంగా ఆమోదించబడింది. అవయవాల కోసం ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. లైవ్, కాడవెరిక్ మరియు ఏబిఓ అన అననుకూల మార్పిడితో సహా అన్ని రకాల మూత్రపిండ మార్పిడి ఇక్కడ జరుగుతన్నాయి. డయాలసిస్ రోగులు కాడవెరిక్ మూత్రపిండ మార్పిడి కోసం జీవన్‌దాన్ కార్యక్రమం కింద కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో నమోదు చేసుకోవచ్చు. మరియు అవయవ దాతగా నమోదు చేసుకోవాలనుకునే వారు https://www.jeevandan.ap.gov.in/ కు లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు. అవయవ దానం/ జీవన్‌దాన్/ మూత్రపిండల మార్పిడి గురించి ఏవైనా సందేహాల కోసం, నెఫ్రాలజీ విభాగాన్ని సంప్రదించండి, కిమ్స్ ఆసుపత్రి కర్నూలు. లేదా 9121299047 లలో సంప్రదించండి.