కొడుకుకి జ్వ‌రం వ‌స్తే… 20 ఏళ్ల అక్ర‌మ సంబంధ బ‌య‌ట‌ప‌డింది

ఈ వార్త‌ను చ‌దివితే కాస్త వింత‌గానే అనిపిస్తుంది. కానీ ఇది ముమ్మాటికి నిజ‌మే. వివ‌రాల్లోకి వెళ్తే..కుమారుడి అనారోగ్యం భార్య వివాహేతర సంబంధాన్ని బట్ట బయలు చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో భార్యకున్న వివాహేతరసంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు(18) కొన్ని నెలల క్రితం నుంచి తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడు. చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చూపించినప్పటికి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కుమారుడి అనారోగ్యానికి కారణాలు తెలియలేదు. ఈ క్రమంలో సదరు వ్యక్తి తన కుమారుడిని ఢిల్లీ, గురుగావ్‌ ఫోర్టీస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి హై-పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ(హెచ్‌పీఎల్‌సీ) టెస్ట్‌ చేయడంతో ఆ వ్యక్తి కుమారుడికి ‘సికిల్ సెల్ అనీమియా’ అని తెలిసింది. అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని తెలిపారు వైద్యులు. తల్లిదండ్రులిద్దరి నుంచి పిల్లలకు ఈ జబ్బు వస్తుందని వెల్లడించారు వైద్యులు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ చేయాలని తెలిపారు.
ఈ క్రమంలో వైద్యులు సదరు వ్యక్తి, అతడి భార్యకు టెస్ట్‌లు చేయగా షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెస్టుల్లో ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా తేలింది. ఇక అతడి భార్యలో సికెల్‌ సెల్‌ అనీమియా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులిద్దరిలో సికెల్‌ సెల్‌ అనీమియా మధ్యస్థ లక్షణాలు ఉంటేనే.. వారి ద్వారా వంశపారంపర్యంగా అది పిల్లలకు వస్తుంది. కానీ ఇక్కడ సదరు యువకుడి తల్లిలో మాత్రమే సికెల్‌ సెల్‌ అనీమియా లక్షణాలు గుర్తించారు వైద్యులు. ఎందుకైనా మంచిదని మరోసారి టెస్ట్‌ చేశారు. అప్పుడు కూడా అదే ఫలితం రావడంతో ఈ విషయాన్ని కుర్రాడికి తెలిపారు.
ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడా యువకుడు. తనకు వచ్చిన జబ్బు.. అది ఎలా వస్తుందో తండ్రికి వెల్లడించాడు. ఈ క్రమంలో భార్య చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత దీని గురించి భార్యను నిలదీయగా.. ఆమె తన తప్పు అంగీకరించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేదని తెలిపింది. అతడి ద్వారా ఆమె గర్భవతి అయ్యింది. సదరు మహిళకు, ఆమె ప్రియుడికి సికెల్‌ సెల్‌ అనీమియా ఉండటం వల్లే.. ఆ కుర్రాడికి కూడా అదే జబ్బు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు.