సీఎంఓ టు పీఎం నియోజకవర్గం : ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీ : జగన్ సైతం...!!
ప్రవీణ్ ప్రకాశ్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నమ్మకమైన అధికారి. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన మాటే ఫైనల్ అన్నట్లుగా పట్టు సాధించారు. ఇక, ఇప్పుడు ఆ అధికారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కొద్ది కాలంగా పలువురు సివిల్ సర్వీసు అధికారులు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ కూడా చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచే పలువురు సివిల్స్ అధికారులు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు.

ప్రవీణ్ బీజేపీలోకి ఎంట్రీ...
సివిల్స్ అధికారులు రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రులుగా చేసిన వారు...చేస్తున్న వారు ఉన్నారు. ఇక, ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. సుదీర్ఘ కాలం ఢిల్లీలో పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం కేంద్రంలో కీలక స్థానాలతో ఉన్న వారితో మంచి రిలేషన్ ఉంది. ప్రవీణ్ ప్రకాశ్ వారి ద్వారా బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందు కోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా...త్వరలో ఉత్తర ప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే ఆలోచనలోనూ ఉన్నట్లుగా చెబుతున్నారు.

వారణాశి నుంచి పోటీకి సిద్దంగా..
ఆయన పోటీకి కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా చెప్పుకొనే వారణాశి ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అది ప్రవీణ్ ప్రకాశ్ సొంత ప్రాంతం. అదే విధంగా..అక్కడ తెలుగు వారి ప్రభావం సైతం ఎక్కువే. అక్కడి పలు సంఘాల నేతలతో ప్రవీణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రధాని మోదీ తన మానస పుత్రికగా చెప్పుకొన్న స్వచ్ఛభారత్ మిషన్‌లో వారణాశిలోనే ప్రవీణ్ ప్రకాశ్ పని చేసారు. ప్రవీణ్ ప్రకాశ్ తండ్రి కూడా ఓబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు చీఫ్ ఇంజినీర్‌గా వారణాసిలోనే పనిచేశారు.

కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు..
తన రాజకీయ ఆలోచనలు..ప్రయత్నాల గురించి ప్రవీణ్ ముందుగా ముఖ్యమంత్రి జగన్ కు సైతం సమాచారం ఇచ్చారనే ప్రచారం సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. 1994 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాశ్ కు తన బ్యాచ్ మెట్స్ అనేక మంది రాజకీయంగా కేంద్రంలో పలు స్థానాల్లో ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశం. ప్రస్తుత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ కు చెందిన అధికారి. అయితే, బీజేపీ లో చేరటానికి సమస్యలు ఉండకపోయినా..చేరిన వెంటనే ఆయన ఎమ్మెల్యే సీటు ఆశించటం పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

జగన్ తో ఇప్పటికే ప్రవీణ్ చర్చలు..
ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు ఇప్పుడు బీజేపీకి జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి. అక్కడ ప్రతీ సీటు పార్టీకి కీలకం కాబోతోంది. ప్రయోగాలు చేసే పరిస్థితిలో కాషాయ నేతలు లేరు. అందునా.. ప్రతిపక్షాలు అన్నీ ఏక తాటి పైకి వస్తున్నాయి. వారణాశి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సౌరబ్ శ్రీవాత్సవ్ బలమైన బీజేపీ నేత. ఆయన్ను కాదని..కొత్తగా పార్టీలో చేరినా..ప్రవీణ్ ప్రకావ్ కు వస్తుందా అంటే సందేహమే. మంచి సమర్ధత కలిగిన అధికారిగా పేరున్న ప్రవీణ్ ప్రకాశ్ కు ఏపీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత అదే రకంగా కాంట్రవర్సీలు వెంటాడాయి.

ఐఏఎస్ సీఎంఓ టు పీఎం నియోజకవర్గం..
కొద్ది కాలం క్రింత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ను పదవి నుంచి తప్పించటానికి ప్రవీణ్ కారణంగా ప్రచారం సాగింది. అదే విధంగా సీఎస్ గా ఎవరు ఉన్నా..ప్రవీణ్ మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం సచివాలయంలో ఉంది. మరి..ప్రచారం సాగుతున్నట్లుగా ప్రవీణ్ ప్రకాశ్ తన అధికారిక హోదా వదలి.. రాజకీయాల వైపు ఎప్పుడు వెళ్తారు...టిక్కెట్ పైన హామీ వస్తేనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా... అనేదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి కర చర్చగా మారుతోంది.