తెలంగాణలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ పూర్తి-ఏ కేడర్‌లో ఏయే పోస్టులు-ఇక ఉద్యోగ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్...
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. జిల్లాలు,జోనల్,మల్టీజోనల్ పోస్టులుగా ఉద్యోగాలను పునర్యవ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జోన్లు,మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ అగస్టు,2018లో ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణను 36 నెలల్లోగా పూర్తి చేయాలి. ప్రస్తుత నెలతో ఆ గడువు పూర్తవనుండటంతో ప్రభుత్వం తాజాగా దీన్ని పూర్తి చేసింది. ఉపాధ్యాయ పోస్టులు మినహా అన్నిశాఖల పోస్టుల కేటగిరీలను నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణపై జారీ చేసిన జీవోల అమలును మొత్తం నాలుగు దశల్లో చేపట్టనున్నారు.

జిల్లా కేడర్ పోస్టులు...
తాజా ఉత్తర్వుల ప్రకారం... ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్‌మెన్, ఫోర్‌మెన్, కార్పెంటర్, మేస్త్రీ, గార్డెనర్, మిలిమాలన్, చౌకీదార్, ప్రింటింగ్ టెక్నీషియన్, కానిస్టేబుల్,టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, రెనో ఆపరేటర్, జమేదార్, చైన్‌మెన్, డఫేదార్, కుక్,జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులన్నీ జిల్లా కేడర్‌గా పరిగణించనున్నారు.

జోనల్ కేడర్ పోస్టులు...
హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, సీనియర్ డ్రైవర్, నాయబ్ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్‌ఐ, ఏఆర్‌ఐ, సీనియర్ స్టెనోగ్రాఫర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, సూపరింటెండెంట్, నాన్‌టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్,అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1,2,3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, తదితర పోస్టులను జోనల్ పోస్టులుగా గుర్తించారు.

మల్టీ జోనల్ కేడర్ పోస్టులు..
డిప్యూటీ కలెక్టర్,ఆర్డీవో, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, సీఐ, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్ అధికారి, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2,3 తదితర పోస్టులు మల్టీ జోనల్ పరిధిలోకి తీసుకొచ్చారు. అన్ని శాఖల పరిధిలో జిల్లా,జోనల్,మల్టీ జోనల్ కింద పరిగణించకుండా మిగిలిపోయిన పోస్టులన్నీ రాష్ట్రస్థాయి పోస్టులుగా పరిగణించాల్సి ఉంటుంది.

జిల్లాలతో 7 యూనిట్లు...
పలు ప్రభుత్వ శాఖల్లో కొన్ని జిల్లాలను మొత్తం 7 యూనిట్లుగా విభజించారు. ఇందులో 1.ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు 2. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల 3.కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి 4.కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ 5.సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగామ 6.మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ 7.మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట యూనిట్లు ఉన్నాయి.

నాలుగు దశల్లో పూర్తి...
మొదటి దశలో... పునర్వ్యవస్థీకరణలో కేటాయించిన కేడర్లను పోస్టులకు అన్వయిస్తారు. దీంతో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఏ కేడర్ కింద ఉన్నాయనే దానిపై స్పష్టత వస్తుంది. రెండో దశలో జిల్లాల వారీగా కేడర్ లెక్కను పరిశీలించిన పోస్టులు తక్కువగా ఉన్న జిల్లాలకు పోస్టులను కేటాయిస్తారు.మూడో దశలో కొత్త జిల్లాలు,జోన్ల వారీగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తారు. తదనుగుణంగా బదిలీల ప్రక్రియ ఉంటుంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి... వారి ఛాయిస్ ప్రకారం ఆయా జిల్లాలకు పోస్టింగ్ ఇస్తారు. మొదటి ఆప్షన్ ఇచ్చిన చోట పోస్టింగ్ కుదరకపోతే రెండో ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.అన్ని జిల్లాల పోస్టులపై నాలుగో దశలో ఒక క్లారిటీ వస్తుంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే లెక్క తేలుతుంది. తదనుగుణంగా ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టవచ్చు.

సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఛాన్స్
పోస్టుల పునర్వ్యవస్థీకరణతో ఉద్యోగులకు తమ సొంత జిల్లాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆప్షన్లను ఉపయోగించుకోవడం ద్వారా ఇందుకు వీలవుతుంది. ఒకవేళ అతని పనిచేసే పోస్టు ఆ జిల్లాలో ఖాళీ లేకపోతే... వేరే జిల్లాకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. లేదా ఉన్నచోటే ఉండిపోవచ్చు. ఏదేని జిల్లాలో ఒక ప్రభుత్వ విభాగంలో అవసరానికి మించి పోస్టులు ఉంటే... అందులో జూనియర్ మోస్ట్ ఉద్యోగులను గుర్తించి వేరే చోటుకు బదిలీ చేస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉద్యోగులంతా ఆర్డర్ టు సర్వ్ విధానంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని రద్దు చేయాలని గతంలో పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఇన్ని నెలల తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయినట్లయింది. త్వరలోనే నోటిఫికేషన్ల ప్రక్రియ ముందుకు కదలవచ్చు.

ఉద్యోగ సంఘాల హర్షం
ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లాలు,జోన్లు,మల్టీజోన్లతో 95 శాతం ఉద్యోగాలకు స్థానిక రిజర్వేషన్ లభించేలా సీఎం కేసీఆర్ కృషి చేశారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అధ్యక్షురాలు మమత అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడం సంతోషమన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై టీజీవో నేతలు ఏ సత్యనారాయణ, ఎస్ సహదేవ్, రవీందర్‌కుమార్, ఎంబీ కృష్ణ యాదవ్, జీ వెంకటేశ్వర్లు, టీఎన్జీవో నేతలు మామిల్ల రాజేందర్,రాయకంటి ప్రతాప్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.