TS weather update: మరో రెండ్రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో కాస్త విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ నేటి నుంచి మొదలుకానున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు.
ఈ గాలులు ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
కాగా, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బుధవారం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది.

మరోవైపు, ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ తోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ఎగువ ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుండగా, మిగితా ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో దాదాపు స్థిరంగా కొనసాగుతోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,74,060 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. బుధవారం రాత్రి 8 క్రస్ట్ గేట్ల నుంచి 91,343 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 1,76,660 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 25 గేట్ల ద్వారా 1,67,675 క్యూసెక్కుల నీటిని, శ్రీశైలం ప్రాజెక్టుకు 1,89,812 క్యూసెక్కులు వరదనీరు రాగా, 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక ఏపీలో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో బ్యారేజీ నుంచి భారీగా నీటిని విదుల చేస్తున్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.