రాహుల్ గాంధీపై బాలల కమిషన్ ఫైర్ -Delhi gang rape, murder ఫొటోలపై పోలీసులు,ట్విటర్‌కు నోటీసులు
దాదాపు పదేళ్ల కిందటి నిర్భయ ఘటన తరహాలో తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న 9ఏళ్ల దళిత బాలిక గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 'ఓటేసే ముందు నిర్భయను గుర్తు తెచ్చుకోండి' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన ఓ ట్వీట్ ను ప్రస్తావిస్తూ విపక్ష పార్టీలు అధికార బీజేపీపై విమర్శల దాడి చేస్తున్నది. కాగా,
హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫొటోను తొలగించాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ట్విటర్ ఇండియాకు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శిస్తున్న ఫొటోను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. అందులో రాహుల్ సహా చిన్నారి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా,

హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ ఫొటోలు దిగడం, వాటిని ట్విటర్ లో షేర్ చేయడాన్ని ఎన్సీపీసీఆర్ సీరియస్ గా తీసుకుంది. సదరు ఫొటోను తొలగించాల్సిందిగా రాహుల్‌కు నోటీసులు పంపాలంటూ ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ అధికారిని ఎన్సీపీసీఆర్ ఆదేశించింది. అత్యాచార బాధిత కుటుంబాలకు సంబంధించిన వివరాలను బహిరంగపరచడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది.
ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులను రాహుల్ గాంధీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం వేర్వేరుగా పరామర్శించారు. అనంతరం వారి ఫొటోను ట్విటర్‌లో రాహుల్ పోస్టు చేశారు. వారి కన్నీళ్లు కోరుకునేది తమ బిడ్డకు న్యాయం జరగాలని మాత్రమే అంటూ ఆ పోస్టులో ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు,
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.. రాహుల్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇది రాజకీయాలను దిగజార్చే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా రేప్ బాధితురాళ్లు ఉన్నారని, మరి ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన ఆ రాష్ట్రాలకు ఎందుకు వెళ్లరని పాత్ర ప్రశ్నించారు. రాహుల్ చర్య పోస్కో చట్టానికి విరుద్ధమని బీజేపీ నేతలు అన్న కొద్ది గంటలకే జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.