Revanth Reddy: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆ బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి... పూర్తి వివరాలివే...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లకు ప్రత్యేకించి ఏ బాధ్యతలు అప్పగించలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపికైనవారికి రేవంత్ పని విభజన చేశారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం... కాంగ్రెస్ సీనియర్ నేత గీతా రెడ్డికి సికింద్రాబాద్,నల్గొండ,హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎన్‌ఎస్‌యూఐ,ఇంటలెక్చువల్ సెల్,రీసెర్చ్ డిపార్ట్‌మెంట్,ప్రొఫెషనల్ కాంగ్రెస్ పర్యవేక్షణ బాధ్యతలు ఆమెకు అప్పగించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు నిజామాబాద్,మహబూబాబాద్,మెదక్,పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే యూత్ కాంగ్రెస్,మైనారిటీ డిపార్ట్‌మెంట్,ఫిషర్‌మెన్ డిపార్ట్‌మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.

మరో కాంగ్రెస్ సీనియర్ నేత,ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఖమ్మం,వరంగల్,యాదాద్రి భువనగిరి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే మహిళా కాంగ్రెస్,లేబర్ సెల్,అసంఘటిత కార్మికుల విభాగం పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు.
మరో నేత మహేష్ కుమార్ గౌడ్‌కు మహబూబ్ నగర్,నాగర్‌కర్నూల్,చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మహమ్మద్ అజారుద్దీన్‌కు ఆదిలాబాద్,జహీరాబాద్,మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు కూడా ఆయనకే అప్పగించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించిన సమయంలోనే గీతారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్,జగ్గారెడ్డి,మహమ్మద్ అజారుద్దీన్,జగ్గారెడ్డి,మహేష్ కుమార్ గౌడ్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు తమకు ప్రత్యేకించి ఏ బాధ్యతలు అప్పగించలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.