అక్రమ మైనింగ్ లో మైలవరం వీరప్పన్ .. వైఎస్ బీజం వేస్తే జగన్ పెంచి పెద్దది చేశారు : పట్టాభి ధ్వజం
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విరుచుకుపడ్డారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ బీజం వేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఆరోపించారు . విలువైన సహజ వనరులను దోపిడీ చేయడం వైసిపి నైజమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మైలవరం వీరప్పన్ అంటూ ఆయనే మైనింగ్ సూత్రధారి అంటూ పట్టాభి ఆరోపించారు.

వైఎస్ హయాంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ చేసి లేని సర్వే నంబర్ సృష్టి
కొండపల్లి లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, కానీ అదేమీ లేదని వైసీపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని పట్టాభి మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కి తండ్రి బీజం వేస్తే, అధికారంలోకి వచ్చాక దాన్ని పెంచి పెద్దది చేశారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పట్టాభి. వైఎస్ఆర్ హయాంలో రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేశారని, లేని సర్వే నెంబర్ 143 ను సృష్టించారని పట్టాభి ఆరోపించారు. ఇక అంతే కాదు ఆ సర్వే నెంబర్ కింద అక్రమ మైనింగ్ కోసం 216.25 ఎకరాలు కేటాయించారని పట్టాభి పేర్కొన్నారు.

అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది వైఎస్ జగన్ హయాంలో
2016 డిసెంబర్ 27వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పు లో సర్వేనెంబర్ 143 ఇంకు పెన్నుతో రాసి సృష్టించిందని హైకోర్టు స్పష్టంగా వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు కు లోబడి చంద్రబాబు 2017 లో మైనింగ్ లీజులను రద్దు చేశారని పట్టాభి స్పష్టం చేశారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని పట్టాభి ఆరోపించారు. జగన్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ డైరెక్షన్ లోనే 2019 అక్టోబర్ 17వ తేదీన అటవీ భూములను రెవిన్యూ భూములుగా మార్చారని పట్టాభి పేర్కొన్నారు.

అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెర తీయగా, అక్రమ మైనింగ్ టీడీపీ హయాంలోనే జోరుగా సాగిందని వైసీపీ నేతలు, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది అని టీడీపీ నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలను ఎక్కుపెడుతున్నారు. ఒకరు చేసిన కుంభకోణాలను మరొకరు వెలుగులోకి తెస్తున్నారు.

టీడీపీని టార్గెట్ చేస్తున్న మైలవరం ఎమ్మెల్యే .. ఏపీలో పొలిటికల్ హీట్
అక్రమ మైనింగ్ పేరుతో తనపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమా ఆరోపించిన మైనింగ్ జరిగిన ప్రాంత అటవీ భూమా .. రెవిన్యూ భూమా ? నిగ్గు తేల్చాలని ప్రశ్నించిన వసంత కృష్ణ ప్రసాద్ అటవీ భూమిని నిలిపి తేలికైన సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే క్రమంలో తాజాగా కొండపల్లి అక్రమ మైనింగ్ పై రెండు పార్టీల నేతలు సంచలన ఆరోపణలు చేస్తుండటం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.