అబ్బే.. ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వాస్తవానికి బీజేపీ నుంచి మాజీమంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయన పోటీ చేయను బాబోయ్ అని క్లారిటీ ఇచ్చారు. అయినా సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రవీణ్ కుమార్ స్పష్టత ఇచ్చారు.

తప్పుడు ప్రచారం
హుజూరాబాద్‌లో కొందరికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనపై వస్తోన్న ప్రచారాన్ని విశ్వసించొద్దని కోరారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. తనపై కేసులు పెట్టారని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే తాను పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని వివరించారు.

వారికే సపోర్ట్.. కానీ
విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వెదజల్లుతున్న డబ్బును వాటికే అందజేయాని కోరారు.

ఇల్లు కొంటున్న..
ఇప్పటికే వీఆర్‌ఎస్ తీసుకున్నానని, ప్రస్తుతం కొత్త ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని ప్రవీణ్ కుమార్ చెప్పారు. తనను వివాదాల జోలికి లాగకూడదని కోరారు. ఒకవేళ తనను ఎవరైనా వివాదాల్లోకి లాగితే వారి అంచనాలు తలకిందులు అవుతాయని హెచ్చరించారు. తను ఎవరినీ ఏమీ అననని.. అలాగే తన జోలికి ఎవరూ వచ్చిన చూస్తూ ఊరుకోబోనని స్పష్టంచేశారు. స్వేరో ఏర్పాటు చేసి దళిత జాతి కోసం ప్రవీణ్ కుమార్ పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన చాలా మంది ఫాలొవర్లు ఉన్నారు.